సాక్షి, మంచిర్యాల: ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులను ప్రోత్సహించేలా ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తామని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్.శోభ అన్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఔత్సాహికులతో కలసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ పులుల అభయారణ్యంలోని బైసన్‌కుంట పరిసరాల్లో వివిధ రకాల పక్షులను స్వయంగా వీక్షించారు. అనంతరం రెండ్రోజులుగా సాగిన బర్డ్ వాక్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు.
సుదూర ప్రాంతాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు అనే భేదం లేకుండా ప్రకృతిపై ప్రేమతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఔత్సాహికులను చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. రాష్ట్రంలో యువ ఫారెస్టు అధికారులు చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం కలప అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయిందని, పులుల సంతతి పెరుగుతోందని ఆనందం వ్యక్తంచేశారు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్, నిర్మల్ సర్కిల్ సీఎఫ్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ పులుల అభయారణ్యంలో కోర్ అవతలి కొంత భాగాన్ని ప్రకృతి ప్రేమికులు పర్యటించేలా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సీఎఫ్ రామలింగం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి డీఎఫ్‌వోలు శివాని డోగ్రా, శాంతారామ్, వికాస్ మీనా, రాజశేఖర్, నిఖిత బోగ, ఉమ్మడి జిల్లాలోని ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్వోలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment