నేడు జాతీయ పక్షుల దినోత్సవం
పురుషుల చరిత్రలో స్త్రీలు తెర వెనుక ఉంటారు. ప్రఖ్యాత పక్షి శాస్త్రజ్ఞుడైన సలీం అలీని‘బర్డ్ మేన్ ఆఫ్ ఇండియా’ అంటారు. కాని ‘బర్డ్ ఉమన్ ఆఫ్ ఇండియా’కూడా ఉంది. ఆమె పేరు జమాల్ ఆరా. బిహార్‌కు చెందిన జమాల్ ఆరా ఎన్నో అరుదైన పక్షులను, వాటి జీవనాన్నిగుర్తించి, రికార్డు చేసింది. జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం. పక్షుల ఆవరణాలను కాపాడుకోవడంతోపాటు వాటికై స్త్రీలు చేసిన సేవను కూడా గుర్తు చేసుకోవాలి.
మనిషికి పక్షిని చూశాకే ఎగరాలనే కోరిక పుట్టింది. పక్షి మనిషికి అలారం. రైతుకు పురుగుల మందుగా మారి పురుగు పుట్రను తిని పంటను కాపాడింది. పక్షి పాట పాడింది. పురివిప్పింది. గంతులేసింది. పలుకులు పలికింది. ఎడతెగని ఉల్లాసాన్ని ఇచ్చింది. జనవరి 5 ‘జాతీయ పక్షుల దినోత్సవం’ ఎందుకు జరుపుతామంటే పక్షి గురించి చైతన్యం కలిగించుకోవడానికి. ప్రపంచంలో దాని వాటా దానికి ఇవ్వడానికి. దానినీ బతకనివ్వమని కోరడానికి.
అడవులు, ఆవాసాలు
మన దేశంలో నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ కూడా పక్షులు, మనుషులు కలిసి బతికేవారు. అడవిలో ఉండే పక్షులు, జలాశయాల పక్షులు, వలస పక్షులు... ఇవి కాక మనిషి ఆవాసాల దగ్గర ఉండే పిచుకలు, కాకులు, కోయిలలు, గొరవంకలు... వంటివి మనగలిగేవి. మనిషి ఆవాసాల్లో పెరళ్లు, బావులు, చెట్లు మాయమయ్యాక ఇక అవి వాటికి కాకుండా పోయాయి. సెల్‌ఫోన్ టవర్లు, కాంక్రీట్‌తనం, రేడియేషన్... పిచుకలకు దెబ్బ కొడుతోంది. అడవులను కొట్టేయడం వల్ల అడవి పిట్టలు... జలాశయాల ఆక్రమణల వల్ల తడి, తేమల్లోని పురుగుల్ని చేపల్ని తినే కొంగలు, పిట్టలు ఆర్తనాదాలు చేసే స్థితికి వచ్చాయి. పక్షులు లేని ఈ ప్రపంచం క్షణమైనా బాగుంటుందా? అందుకే పక్షికి గుక్కెడు నీళ్లు, గుప్పెడు గింజలు, మాంజా దారాలు లేని ఆకాశం ఇవ్వగలగాలి. పిల్లలకు నేర్పగలగాలి. ‘బర్డ్‌వాచింగ్’ను హాబీగా మార్చగలగాలి.
అడవుల కోసం
బిహార్‌లో అడవుల నరికివేత మీద జమాల్ ఆరాపోరాటం చేసింది. అడవులుపోతే ఎడారులొస్తాయని పక్షులు బతకవని ప్రభుత్వానికి లేఖలు రాసింది. రాచరిక కుటుంబాలు సరదా కోసం బిహార్‌లో ఖడ్గమృగాలను వేటాడటాన్ని నిషేధించాలని కోరింది. ‘అడవిలోకి ఎవరు వచ్చినా ఫారెస్ట్ ఆఫీసర్లు గానీ మామూలు మనుషులుగాని.. వారి దగ్గర తుపాకులు ఉండకూడదు’ అని ఆమె 1950లలోనే సూచించింది. 1970లో ఈ నియమం అమలయ్యింది. ఎందుకంటే తుపాకీ చేతిలో ఉంటే అడవిలో పేల్చబుద్ధవుతుంది. ఒక మూగజీవో పక్షో మరణిస్తుంది. పిల్లల కోసం పక్షుల గురించి పుస్తకాలు రాసి, ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో ప్రసంగాలు చేసిన జమాల్ ఆరా ప్రపంచవ్యాప్త జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించుకోవడం తెలియక తెర వెనుక ఉండి΄ోయింది. ఇటీవలే ఆమె కృషి బయటకు తెలిసి మహిళా జాతి గర్వపడుతోంది. 1995లో మరణించిన జమాల్ ఆరాను– ‘ఫస్ట్ ఇండియన్ బర్డ్ ఉమన్’గా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment