ఆమెకు ఎందుకింత ఫాలోయింగ్..?
రెక్జావిక్: బిర్నా బ్రాన్స్డాటిర్ అనే 20 ఏళ్ల అమ్మాయి జనవరి నెలలో తప్పిపోయింది. యావత్ దేశం ఆమె గురించే చర్చ. కొండలు, గుట్టలతోపాటు నిర్జీవ ప్రదేశాలన్నింటినీ గాలించండంటూ దేశాధ్యక్షుడు ప్రజలందరికి పిలుపునిచ్చారు. అలా ప్రజల గాలింపులో ఎనిమిది రోజుల తర్వాత ఓ సముద్ర తీరంలో ఆమె మృతదేహం దొరికింది. దేశాధ్యక్షుడు తోర్లాసియస్ జోహానెస్సన్, ప్రధాన మంత్రి బెనెడిక్ట్సన్లతోపాటు ప్రజలంతా ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె రాజకీయవేత్తకాదు, పారిశ్రామికవేత్తకాదు. అందరిలా డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి. మరి ఆమెకు ఎందుకింత ఫాలోయింగ్ అన్న అనుమానం రావచ్చు.
ఐస్లాండ్లో అంతేమరి. అక్కడ ఓ అమ్మాయి చనిపోతే ప్రజలంతా తమ కూతురో, సోదరియో చనిపోయినంతగా, అబ్బాయి చనిపోతే తమ కుమారుడో, సోదరుడో మరణించినంతగా బాధపడతారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులూ అంతే. అందుకే ఐస్లాండ్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. హత్యల రేటు ఏడాదికి 1.8 శాతం మాత్రమే ఉంది. నిరుద్యోగం కూడా చాలా తక్కువ. 2008 తర్వాత ఆ దేశంలో ఒక్క ఆత్మహత్య కూడా లేని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసినప్పడు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఒకటి, రెండు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదు.
1944లో రక్తపాత రహితంగానే డెన్మార్క్ నుంచి స్వాతంత్య్రం సాధించిన చరిత్ర కూడా ఐస్లాండ్కు ఉంది. ఈ దేశంలో ప్రజలంతా సమానత్వ భావనతో మెదలుతారు. ఆపదలో ఒకరినొకరు ఆదుకుంటూ పరస్పర సహకారంతో ప్రజలంతా బతుకుతారు. ఏడాదిలో తక్కువ ఎండకాలం, ఎక్కువ శీతాకాలం ఉండడం వల్ల కూడా ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సమైక్య జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమాజంలో హత్యలు జరిగినప్పుడు కలవరం రేగుతుంది. 20 ఏళ్ల బిర్నాను చంపింది కూడా విదేశీయులేనని దర్యాప్తులో తేలింది. గ్రీన్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు నావికులు ఐస్లాండ్ సముద్రం ఒడ్డున లంగర్ వేసినప్పుడు ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి తిరిగి వారి దేశం వెళ్లిపోవడంతో ఐస్లాండ్ పోలీసులు గ్రీన్లాండ్ వెళ్లి అనుమానితులను హెలికాప్టర్లో తీసుకొచ్చారు. హత్య వెనక కారణం ఏమిటో ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది.