స్త్రీల కోసం సాగిన సుమధుర గీతం
‘దారి చూపిన దేవత... నీ చేయి ఎన్నడు వీడతా’....స్త్రీల సెంటిమెంట్‌ను మాట్లాడాల్సి వస్తే సగటు స్త్రీని శ్లాఘించాల్సి వస్తే సినిమాకు ఏసుదాస్ గొంతు కావాలి. ఏసుదాస్ వారిని పొగిడినా వారి వేదనను పాడినా ఎంతో స్థిమితం. సమాజం నిర్దేశించిన సాధారణ చట్రంలో ఉండే స్త్రీలు ఏసుదాస్ పాటతో ఊరడిల్లి కలెక్షన్లకు కారణమయ్యేవారు. ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ అన్న ఏసుదాసే ‘తెల్లారే దాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే’ ఎలా అని భార్య అలక తీర్చడానికి పూనుకుంటాడు. ‘అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు’ను చూపిన ఏసుదాస్ గీతాలు ఆయన 82వ జన్మదినం సందర్భంగా...
‘చుక్కల్ని వొలిచి చక్కంగా మలిచి నీ కంఠహారాన్ని చేయించనా’ అని పాడతారు ఏసుదాస్ ‘ఎవ్వరిది ఈ పిలుపు’ పాటలో. ‘ప్రాణాలు ఐదు నీలోన ఖైదై ఆరోది నీవై జీవించనా’ అని కూడా అదే పాటలో అంటారు. ఏసుదాస్ గొంతులోని నిజాయితీ ప్రతి పురుషుడిలో ఉండాలని మహిళా ప్రేక్షకులు కోరుకుంటారు ఆయన పాడుతుంటే. ‘అంతులేని కథ’లో జయప్రద ఇంటి కూతురిగా మొత్తం కుటుంబాన్ని మోస్తూ ఉంటుంది. మోయాల్సిన కొడుకు రజనీకాంత్ నిర్బాధ్యతగా తిరుగుతుంటాడు. పైగా జయప్రదను పట్టుకొని ‘ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం’ అని నిలదీస్తాడు. ‘పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా... నారు పోసి నీరు పోసే నాథుడు వాడమ్మా’ అని బాధ్యత నుంచి తప్పించుకునే వాదన చేస్తాడు. బాధ్యత నుంచి తప్పించుకునే పురుషుడికి మించిన భారం ఏ స్త్రీకీ లేదు. బాధ్యతను పంచుకునేవాడినే స్త్రీ గౌరవిస్తుంది. ఏసుదాస్ పాడిన ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ ఇప్పటికీ హిట్.
తెలుగు సినిమాల్లో గృహిణి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఘనకార్యాలన్నీ హీరో చేయాలి. హీరోయిన్ గృహిణిగా ఉంటూ అతన్ని సపోర్ట్ చేయాలి. ఆమెకు కూడా ఘనకార్యాలు చేయగల శక్తి, ప్రతిభ ఉన్నా తెలుగు సినిమా ఇంటికే పరిమితం చేసి ఏసుదాస్ చేత ఆమెను శ్లాఘించేలా చేసి హౌస్‌ఫుల్స్ రాబట్టుకుంది. ‘కుంకుమ తిలకం’లో ‘ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా’ పాటలో హీరో మురళీమోహన్ హీరోయిన్ జయసుధతో ‘నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్ని’... అంటాడు ఏసుదాస్ గొంతుతో. ‘భద్రకాళి’లోని ‘చిన్ని చిన్ని కన్నయ్యా’లో ఇదే మురళీమోహన్ ఏసుదాస్‌ను పలికిస్తూ ‘గాయత్రి మంత్రమును జపియించు భక్తుడినై కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే’ అని భార్య జయప్రదను ఆరాధనగా చూస్తాడు. ‘మేఘసందేశం’లో అక్కినేని భార్య జయసుధను చూస్తూ ‘సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో’.. ఆమె సౌందర్యాన్ని మెచ్చుకుంటాడు. ఇక ‘ప్రేమపక్షులు’ సినిమాలో అలకబూనిన భార్యను బుజ్జగిస్తూ ఏసుదాస్ పాడిన ‘తెల్లారే దాకా నువ్వు తలుపు మూసి తొంగొంటే’ ఎంత ముచ్చట గొలుపుతుందో.
అంతేనా? ‘పెదరాయుడు’లో బంధువులందరూ వెలి వేసిన భార్య సౌందర్యకు భర్త మోహన్ బాబు ఏసుదాస్ పాట సాయంతో శ్రీమంతం చేస్తాడు. ‘కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా’ అనే పాట టికెట్లను తెగేలా చేసింది. ఇక ‘పెళ్లి చేసుకుందాం’ లో వెంకటేష్ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని భార్య స్థానానికి విలువ ఇవ్వకుండా చులకన చేసి ఆ తర్వాత యాక్సిడెంట్ వల్ల మంచాన పడితే స్త్రీ/భార్య పురుషునికి ఎంత సపోర్ట్‌గా నిలుస్తుందో తెలుస్తుంది. ఏసుదాస్ పాట ఆ వివరణ ఇస్తుంది– ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ అంటూ. ‘సతిని మించిన ఆప్తులు ఉండరు’ అని ఈ పాట చెబుతుంది. ‘గృహప్రవేశం’లో భార్య జయసుధ విలువ తెలుసుకున్న మోహన్‌బాబు ‘దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడతా’ అని కన్నీరుతో పాడటం ఆ సినిమా హిట్‌కు కారణం. ‘మిథునం’ సినిమాలో దంపతుల గొప్పతనాన్ని ‘ఆదిదంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునం’ పాటలో తెలియచేస్తారు ఏసుదాస్.
తల్లి గొప్పతనం చెప్పే పాటలు ఏసుదాస్ పాడారు. ‘సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించింది అమ్మ’ పాట ‘అమ్మ రాజీనామా’లో పెద్ద హిట్. ‘అమ్మ మీద ఒట్టు’ సినిమాలో ‘అమ్మా నీకు వందనం కన్నతల్లి నీకు వందనం’ పాట గొప్ప భావగాఢతతో ఉంటుంది. అమ్మ గొప్పతనం గురించి చెబుతూనే అమ్మను ఎంతమంది కాపలా కాస్తారో చెబుతుంది ఈ పాట. అయితే అమ్మ లేనిచోట ఏసుదాస్ పాటే అమ్మ జోల అవుతుంది. ‘మా ఆయన బంగారం’లో ‘చిట్టికూన చిట్టికూన ఊరుకోరా చిన్నినాన్నా కొడుకో బంగారు మారాజా’ కూడా హిట్.
ఇక విఫల ప్రేమికులు, ప్రేమ విరాగులు, విరహంలో ఉన్నవారు ఏసుదాస్ గొంతుతో ఎంతో సింపతీని మహిళా ప్రేక్షకుల నుంచి పొందారు. ‘గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం’ (స్వయంవరం), ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ (మేఘసందేశం), ‘సుక్కల్లే తోచావే’ (నిరీక్షణ). ‘ఏ నావదేతీరమో’ (సంకీర్తన), ‘వెన్నెలైనా చీకటైనా’ (పచ్చని కాపురం)... ఎన్నో. తెలుగు ప్రేక్షకులు, అందునా మహిళా ప్రేక్షకులు సెంటిమెంట్ ప్రియులు. ఆ సెంటిమెంట్‌ను నిలబెడుతూ ఏసుదాస్ పాడిన పాటలు ఆయనను తెలుగువారికి మరింత దగ్గర చేశాయి. ఆయన గొంతులోని సెంటిమెంట్ అలాగే కొనసాగాలని కోరుకుందాం.
– సాక్షి ఫ్యామిలీ