ఘనంగా ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు
విజయవాడ (గుణదల): గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 7 గంటలకు విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప, గోల్డెన్ జుబిలేరియన్ గురువులు ఫాదర్ వెంపని, ఫాదర్ టీహెచ్ జాన్ మాథ్యూ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభించారు. బిషప్ టీజే రాజారావు ప్రారంభ సందేశమిస్తూ, లోక రక్షకుడైన యేసును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలిపారు.
ఇన్నేళ్లుగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటే మరియమాత ఆశీర్వాదమేనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందచేశారు. గురువులుగా 50 ఏళ్లు, 25 ఏళ్లు పూర్తిచేసుకున్న వారిని బిషప్ తెలగతోటి అభినందించి, సత్కరించారు. మధ్యాహ్నం 3 గంటలకు మరియమాత విగ్రహాన్ని గుణదల పురవీధుల్లో ఊరేగించారు. మరియమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.