లక్ష్యం లేనివారే నిజమైన పేదలు
- బిషప్ పూల ఆంతోని
- భక్తి శ్రద్ధలతో దివ్యసంస్కారాల దినం
- జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు
కర్నూలు సీక్యాంప్: ఎలాంటి లక్ష్యం లేకుండా జీవించే వాళ్లే నిజమైన పేద వారని అని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని అన్నారు. నగరంలోని బిషప్ చర్చిలో ఆదివారం ఫాదర్ కోల విజయరాజు ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య దివ్యసంస్కారాల దినం జరిపారు. నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లి, పత్తికొండ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలని పూల ఆంథోని తన ప్రసంగంలో అన్నారు. లక్ష్యం లేకుండా బతికే వారే పేదలని, అంతే కానీ ధనం లేనివారు కాదన్నారు. జీవితం సముద్రం లాంటిదని, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని జీవించాలన్నారు. కార్యక్రమంలో క్రైస్తవులు దివ్యసంస్కారాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఫాదర్ జోజిరెడ్డి, లూర్ధయ్యబృందం, మరియ దళ సభ్యులు, యువకులు, సిస్టర్లు పాల్గొన్నారు.