గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ : గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందచేశారు.
మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.