నేవీలోకి ఐఎన్ఎస్ తిహయు
విశాఖలో ప్రారంభించిన నావికాదళ ప్రధానాధికారి బిస్త్
బీచ్రోడ్టు (విశాఖపట్నం): వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ తిహయును తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ బుధవారం ఇక్కడ ప్రారంభించారు. దీన్ని కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) నిర్మించింది. ఇప్పటిదాకా ఈ సంస్థ భారత నేవీ కోసం ఇలాంటివి 18 అటాక్ క్రాఫ్ట్‌లను తయారు చేసింది. ఈ సందర్భంగా బిస్త్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు మేకిన్ ఇండియాలో భాగంగా నేవీ నాలుగు వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌ల తయారీకి ఆర్డరు ఇచ్చిందని చెప్పారు. వీటిలో రెండు తూర్పు నావికాదళానికి కేటాయించారన్నారు.
ఇందులో మొదటి దైన ఐఎన్ఎస్ తార్ముగ్లి నౌకను ఈ ఏడాది మే 23న ప్రారంభించామన్నారు. గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో ఇది పయనిస్తుందని తెలిపారు. ఈ నౌకలో నలుగురు అధికారులు, 41 మంది సిబ్బంది పని చేస్తారన్నారు. 315 టన్నుల బరువును తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ నౌకలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 30ఎంఎం సీఆర్ఎన్ 91 గన్‌తోపాటు 11 మెషీన్ గన్లను అమర్చారని, 2,720 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజన్‌తో ఇది పయనిస్తుందన్నారు. ఈ యుద్ధ నౌకకు అండమాన్‌లోని తిహయు దీవి పేరు పెట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో జీఎస్ఆర్ఎస్ఈ చైర్మన్ రియర్ అడ్మిరల్ ఎ.కె.వర్మ, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ అడ్మిరల్ మేహ ష్ సింగ్, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.