పెద్దనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
– నకిలీ కరెన్సీ, సెల్ఫోన్లు స్వాధీనం
ఆదోని టౌన్: 25 శాతం కమీషన్‌తో పెద్ద నోట్లను మార్చుతామని నమ్మించి మోసం చేస్తున్న ముఠా పోలీసులకు దొరికింది. ఎమ్మిగనూరు పట్టణంలో కొందరు వ్యక్తులు పెద్ద నోట్ల మార్పిడితో మోసం చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి జిరాక్స్ నోట్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. డోన్ కొండపేటకు చెందిన వడ్డే నాగరాజు, నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన నాయక్ మహ్మద్ షరీఫ్, ఎమ్మిగనూరు పట్టణంలోని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తనయుడు షేక్ అబ్దుల్లా, షరాఫ్ బజార్ వీధికి చెందిన చిలుకూరు నయనకాంత్, ఆదోనికి చెందిన ఖాదర్ ముఠాగా ఏర్పాడ్డారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి అనే రైతు నుంచి పెద్దనోట్లను 25శాతం కమీషన్‌తో మార్పిడి చేసి ఇస్తామని నమ్మించారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌కు రమ్మని సమాచారం ఇచ్చారు. వీరి వ్యహరాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మినూరు టౌన్ ఎస్ఐ, సిబ్బంది బస్టాండ్‌కు చేరుకుని నిఘా వేశారు. ఆ ముఠా సభ్యుల తంతును ఎప్పటికప్పుడు గమనించారు. రైతు శివరామిరెడ్డిని మోసం చేసేందుకు రూ. వంద నోట్ల కట్టలో పైనా కింద ఒరిజినల్ నోట్లు పెట్టి మధ్యంలో జీరాక్స్ నోట్లు పెట్టారు. రైతు నుంచి ఒరిజనల్ పెద్దనోట్లు రూ.500, వెయ్యి నోట్లను తీసుకొని నకిలీ, జిరాక్స్ నోట్లను అందజేసే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా నలురుగురిని పట్టుకున్నారు. ఆదోనికి చెందిన ఖాదర్ తప్పించుకొని పారిపోయాడు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.. పెద్ద నోట్ల మార్పిడి అంటూ జిల్లాలో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో ఎమ్మిగనూరు సీఐ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.