రైతు ఆత్మహత్యలపై సమరమే: బీజేఎల్పీ
అసెంబ్లీలో సర్కారును నిలదీస్తాం: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. సోమవారం అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం సమావేశం వివరాలను డాక్టర్ కె.లక్ష్మణ్ మీడియాకు వివరించారు. శాసనసభలో నిలదీస్తామనే భయంతోనే రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014 జూన్ 2 తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికీ పెంచిన రూ. 6 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభానికి కారణాలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక, రుణమాఫీ, కరువు మండలాల ప్రకటనలో నిర్లక్ష్యం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో డెంగీ, స్వైన్ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు తీవ్రంగా ఉంటే వైద్య శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వీటిపై సమగ్రంగా చర్చించడానికి అసెంబ్లీని 3 వారాలపాటు జరపాలని డిమాండ్ చేశారు.
నవంబర్ ఆఖరులోగా రాష్ట్ర కమిటీ: సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఉపక్రమించింది. నవంబర్ ఆఖరులోగా రాష్ట్ర కమిటీకి సంస్థాగత ఎన్నికలను పూర్తిచేయడానికి ఎన్నికల అధికారిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతిరెడ్డిని జాతీయ పార్టీ నియమించింది. రాష్ట్ర కమిటీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియను కూడా పూర్తిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను అక్టోబర్లో పూర్తిచేయనున్నారు.