నడక యాతన!
=కాలిబాటలు, పొలంగట్లే రహదారులు
=నిధులున్నా రోడ్లు వేయని పంచాయతీరాజ్
=చాలా చోట్ల గుంతలుపడి దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్లు
=ప్యాచ్‌లే తప్ప శాశ్వత పనులు నిల్
=జిల్లాలో ఇదీ పరిస్థితి
రాష్ట్ర రాజకీయాలను శాసించే అధినాయకులు మన జిల్లాలోనే ఉన్నారు. ఒకరు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు. ఇంకొకరు మూడేళ్లకుపైగా సీఎం పదవిని పట్టుకుని ఊగిసలాడుతున్నారు. వీరిలో ఒక్కరూ తమ సొంత జిల్లాలోని రోడ్ల దుస్థితిపైన దృష్టి పెట్టలేదు. గుంతలు పడి.. రాళ్లుతేలి.. నడవడానికి వీలులేని స్థితికి చేరినా కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. అక్కడక్కడా నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో అవి మురిగిపోతున్నాయి. గ్రామీణ రోడ్ల దుస్థితిపై శుక్రవారం సమరసాక్షి ప్రత్యేక కథనం..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రోడ్లు నరకానికి నకళ్లుగా మారా యి. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. కుప్పం నియోజకవర్గంలో 465 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో కుప్పం నుంచి కేజీఎఫ్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. కృష్ణగిరి-కుప్పం రోడ్డు గుంతలమయంగా మారింది. వంద వసంతాల ఉత్సవాలు నిర్వహించిన నిధులతోనే మరమ్మతులు చేస్తున్నా రు. ప్రత్యేకంగా బడ్జెట్ లేదు. పంచాయతీరాజ్ రోడ్లు గుంతలు పడి, కంకరతేలిపోయాయి.
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 25 గ్రామాలకు పూర్తిగా రోడ్డు సౌకర్యం లేదు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీరోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కోతకు గురయ్యాయి. బి.కొత్తకోట జాతీయ రహదారి అమరనారాయణపురం క్రాస్ నుంచి తుమ్మనంగుంట వరకు గుంతలు పడి పోయింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలో 481 కిలోమీటర్ల ఆర్అండ్బీ రాష్ట్ర రహదారులు, 60 కి.మీ మేర పీఆర్ రోడ్లు ఉన్నాయి. వీటిల్లో మూలతిమ్మేపల్లె నుంచి తప్పిడిపల్లె వరకు, ధర్మపురి నుంచి వెంకటాపురం, గంగవరం కేసీపెంట నుంచి అప్పిశెట్టిపల్లె, గాంధీనగర్, పెద్దపంజాణి మండలంలోని లింగమనాయునిపల్లె, నాగిరెడ్డిపల్లె, గుండ్లం వారిపల్లె, పలమనేరు మండలంలో జగమర్ల యానదికాలనీ రోడ్లు దుస్థితికి చేరాయి. 90 పంచాయతీల్లో 33 చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
సత్యవేడు నియోజకవర్గంలో చెరివి, పీవీ.పురం, గొల్లపాళెం, చమర్తకండ్రిగ, సత్యవేడు - మాదరపాకం రోడ్లు దెబ్బతిన్నాయి. చెరివి రోడ్డు ఆరు కిలోమీటర్ల మేర శ్రీసిటీ సెజ్‌లో ఉంది. ఈ రోడ్డు నిర్వహణను ఆర్అండ్బీ గాలికొదిలేసింది. పీవీ.పురం రోడ్డు క్వారీ వాహనాల తాకిడికి ధ్వంసమైంది. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధులు రాకపోవడంతో గుంతలు పడినా పూడ్చే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 14 గ్రామాలకు రోడ్లు లేవు. చెరువుకట్టలు, బండ్లబాటల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాలకు పొలంగట్లే రహదారులు. పంచాయతీ రాజ్రోడ్లకు నామమాత్రంగా గుంతలు పూడ్చడం మినహా, శాశ్వత పనులు చేయడం లేదు. బీఆర్జీఎఫ్ నిధులతోనైనా మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో అక్కెరి దళితవాడ, వేణుగోపాలపురం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రామచంద్ర ఎస్టీ కాలనీకి రోడ్డు సౌకర్యమే లేదు. చెరువు కట్టపై రాకపోకలు సాగిస్తున్నారు. నగరి మండలంలో దువ్వూరు సుబ్బారెడ్డి కండ్రిగకు రోడ్డే వేయలేదు. కాసావేడు ఎస్టీ కాలనీకీ అదే పరిస్థితి. కృష్ణారామాపురం వద్ద రోడ్డు గతులమయమైంది. చెరుకు లారీలు, ట్రాక్టర్లతో రోడ్డు ధ్వంసమైంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లె రోడ్డు, అనుప్పల్లెకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చంద్రగిరి ఇందిరమ్మకాలనీ, మల్లయ్యగారిపల్లె, రాయలపురం గ్రామాలకు రోడ్లు అంతంతమాత్రమే.
మదనపల్లె మండలంలోని 16 పంచాయతీల్లో 384 పల్లెలు ఉంటే, 150 గ్రామాలకు కేవలం కాలిబాటలే దిక్కు. ఐదేళ్లుగా పీఆర్ నిధులున్నా ఖర్చుచేయని పరిస్థితి. చిన్నాచితకా రోడ్ల ప్యాచ్పనులనూ పట్టించుకునేవారే లేకుండా పోయారు. 61 రోడ్లు ఉంటే వీటిల్లో జాతీయ రహదారులూ గుంతలు పడిపోయాయి. మేకలవారిపల్లె, మిట్టామర్రి, మేడిపల్లె, ఆవులపల్లె గ్రామస్తులు శ్రమదానంతో రోడ్లు నిర్మించుకున్నారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో బాలగంగనపల్లె, పెనూమూరు మండలంలో సామిరెడ్డిపల్లె ఎగువ దళితవాడ, రామాపురం గ్రామాలకు రోడ్లు లేవు. సామిరెడ్డిపల్లె దళితవాడకు చెరువులో నుంచి వెళ్లాలి. వర్షాలుకు నీళ్లొస్తే ఆ గ్రామంతో సంబంధాలు తెగిపోయినట్టే. వెదురుకుప్పం మండలం మాంబేడుకు రోడ్డే లేదు.