నల్ల బెలూన్ ఎలా పగిలిందబ్బా..?!
సౌరశక్తి, ఉష్ణ సంగ్రహణం వంటి విషయాల గురించి మనం ఎన్నో విన్నాం. సూర్యుడి కిరణాలు ఎంతటి శక్తిమంతమైనవో, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకున్నాం. అలాగే ఉష్ణ గ్రాహకాలు, విసర్జకాలు.. వాటి రంగుల మతలబు వగైరా సంగతులూ చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం. ఈ రెండిటి కలయికలోని ఓ చిట్టి ప్రయోగం మాత్రం చాలామందికి తెలిసుండదు. అతి తక్కువ ఖర్చుతో అబ్బురపరిచే ఈ 'సైన్స్ వండర్' మీకోసం..!
కావాల్సివవి: రంగు లేని బెలూన్ (క్లియర్), నల్ల రంగు బెలూన్, భూతద్దం, సూర్యకాంత, పెద్దల పర్యవేక్షణ
ఎలా చేయాలి..?
తొలుత రెండు బెలూన్లను దగ్గరకు తీసుకుని ఒకదానిలోకి మరొకటి ఉండేలా చేయండి. రంగు లేని బెలూన్ బయట ఉండేలా, దాని లోపలి భాగంలో నల్ల రంగు బెలూన్ ఉండేలా జాగ్రత్త పడండి.
ఈ రెండు బెలూన్ల మూతి భాగాలు తెరచి ఉంచి, తొలుత నల్ల బెలూన్‌లోకి కొద్ది పరిమాణంలో గాలి నింపండి.
అనంతరం గాలి బయటకు పోకుండా దాని మూతిని దారంతో కట్టేయండి. ఇప్పడు బయట ఉన్న రంగులేని బెలూన్‌లోకి తగినంత పరిమాణంలో గాలి ఊదండి. దీని మూతిని కూడా దారంతో కట్టేయండి.
ఇప్పుడు మీకు ఒకదానిలో ఒకటి దాగున్న బెలూన్లు దర్శనమిస్తాయి. బాహ్యంగా రంగులేని బెలూన్.., దాని లోపలి భాగంలో చిన్న సైజులోని నల్ల రంగు బెలూన్ కనిపిస్తాయి.
సూర్యకాంతి ఉండే ప్రదేశంలోకి ఈ బెలూన్లను తీసుకెళ్లి, భూతద్దం సాయంతో సన్నని సూర్యకిరణాలు వాటిపై పడేలా చేయండి.
ఏం జరుగుతుంది..?
సూటిగా బెలూన్లను తాకిన వెచ్చని సూర్య కిరణాలు బయట ఉన్న రంగులేని బెలూన్ని కాకుండా.. లోపలి నల్ల రంగు బెలూన్ని పగిలేలా చేస్తాయి. దీంతో టప్‌మనే శబ్దంతో పాటు ముక్కలైన నల్ల బెలూన్ మనకు కనిపిస్తుంది. రంగు లేని బెలూన్ మాత్రం మునుపటిలాగే ఉంటుంది.
ఎందుకిలా..?
అసాధారణ రీతిలో అమర్చిన ఈ బెలూన్లలో తొలుత సూర్య కిరణాల వేడికి పగలాల్సింది బయట ఉన్న తెల్ల బెలూన్. అయితే, ఆశ్చర్యకరంగా లోపలి నల్ల బెలూన్ పగిలింది. దీనికి శాస్త్రీయ వివరణ ఉంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఉష్ణ గ్రాహకం ఇక్కడ పనిచేసింది. రంగులేని బెలూన్ పారదర్శకంగా ఉంటుంది. ఇది తనలోకి చొచ్చుకుపోయే సూర్య కిరణాలను, కాంతిని అడ్డుకోదు. దీంతో కాంతి నేరుగా లోపలికి వెళ్లిపోయింది. అయితే, లోపలి నల్ల రంగు బెలూన్ ఈ కాంతిని అడ్డుకుంది. అంతేగాక, దాని నల్లని రంగు కారణంగా సూర్య కాంతిని శోషించుకుంది. దీంతో అందులోని ఉష్ణాన్ని సైతం బెలూన్ గ్రహించినట్టయింది. ఉష్ణం పెరుగుతున్న కొద్దీ బెలూన్లోని అణువుల మధ్య దూరం పెరగసాగింది. అణువుల బంధ విచ్ఛిత్తి కారణంగా నల్ల బెలూన్‌లో బంధించి ఉన్న గాలి ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. అంతే.. టప్మని శబ్దం చేస్తూ బెలూన్ పేలిపోయింది. అయితే, ఉష్ణాన్ని గ్రహించని కారణంగా బయట ఉన్న రంగులేని బెలూన్‌కు మాత్రం ఎటువంటి నష్టమూ వాటిల్లలేదు.