
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఒకే హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రమాదకర నల్ల బెలూన్లు ఎగురవేయడం ద్వారా భారీ కుట్రకు పూనుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.
ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం విమానశ్రయం నుంచి భీమవరానికి బయలుదేరిన సమయంలో ఆ పార్టీ నేతలు ప్రమాదకర బెలూన్లు ఎగురవేయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఘటన వెనుక సూత్రధారులు, పాత్రధారులను, కుట్ర అమలు చేసిన దుష్టశక్తులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు సోము వీర్రాజు తెలిపారు.