Blackmail politics
-
Blackmail Politics: నేనింతే.. మారనంతే!
జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు మారలేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దౌర్జన్యాలు, బరితెగింపులతో తనకడ్డే లేనట్లు ప్రవర్తించారు. అధికారులను భయకంపితులను చేశారు. ఈ ఆగడాలు తాళలేని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా తీరు మార్చుకున్నారా అంటే అదీ లేదు. ఉన్నతాధికారులను సైతం బ్లాక్మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడిపత్రి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలి. మున్సిపాలిటీలో ప్రాభవాన్ని కోల్పోతున్నానన్న భావనతో అధికారులను, సిబ్బందిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ప్రొటోకాల్ పేరుతో భయకంపితులను చేస్తున్నారు. మున్సిపాలిటీలో వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అహంకార ధోరణితో మున్సిపల్ కమిషనర్ మొదలు కింది స్థాయి సిబ్బంది వరకూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలు పక్కనే చైర్మన్‌కు కేటాయించిన గది, ఇటీవల జేసీ ఆక్రమించుకుని నేమ్‌బోర్డు వేయించుకున్న డీఈ చాంబర్ ఉన్నతాధికారికి బెదిరింపులు ఈ నెల ఒకటోతేదీ మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న వలంటీర్లనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన కొద్దిసేపటికే కార్యాలయంలోని ఉద్యోగులకు ఫోన్ చేసిన జేసీ.. ఏ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కుర్చీలు వేసి కూర్చోబెట్టారని ప్రశ్నించారు. కొద్దిసేపటికే అనుచరులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని దూషిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. లీగల్ నోటీసులు ఇస్తానంటూ ఉన్నతాధికారి అయిన కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డిని కూడా బెదిరించారు. కార్యాలయంలోని పరిపాలనా విభాగాల్లోకి వెళ్లి సిబ్బందిపైనా నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలోనే కమిషనర్ జోక్యం చేసుకుని చీటికిమాటికి తమ విధులకు ఆటంకం కల్గించడం సరికాదని హితవు చెప్పారు. అనుచరుల కోసం చాంబర్! మున్సిపల్ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏ మున్సిపాలిటీలోనూ లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తన వద్దనే ఉంచుకుంటున్నారు. దీంతో బయటి వ్యక్తులు చాంబర్లకు వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు కొందరు నిత్యం కార్యాలయంలోనే తిష్టవేసి కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నట్లు వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బెదిరించడం తగదు బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఒంటెద్దు పోకడలతో అధికారులను బెదిరించడం తగదు. అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తే మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించే వీలుంటుంది. – నరసింహప్రసాద్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్, తాడిపత్రి -
అసమ్మతి కుంపట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. తెలుగు తమ్ముళ్లు పార్టీ నేతలకు ఎదురు తిరుగుతున్నారు. అవసరమైతే పదవులకు రాజీనామాలు చేసి తమ పంతం నెగ్గించుకుంటున్నారు. కొన్నిచోట్ల తమ పంతం నెరవేరక వెనక్కి తగ్గుతున్నారు. రాజీనామాలు ఆమోదించుకునే దిశగా ఒక్కరు కూడా ప్రయత్నం చేయకపోవడం కేవలం బ్లాక్మెయిల్ కోసమే ఈ ప్రహసనం నడుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. భీమవరంలో రెండురోజుల పాటు సాగిన కౌన్సిలర్ల రాజీనామా వివాదం ఇదే విధంగా ముగిసింది. భీమవరం మున్సిపాలిటీలో అధికారపక్ష టీడీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు బుధవారం మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు తీరు పట్ల మెజారిటీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పక్షంలో ఉన్నా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించుకోలేని దుస్థితి ఉండటం పట్ల కౌన్సిలర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇదే పరిస్థితి జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలలో కూడా ఉంది. మెజారిటీ ఉన్న చోట స్థానిక ఎమ్మెల్యే ఏం చెబితే అవే తీర్మానాలుగా మారుతున్నాయి. కనీసం కౌన్సిలర్లకు తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కూడా ఉండటం లేదు. గెలిచి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో కౌన్సిలర్లు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి పిలిచి అసమ్మతి వర్గంతో చర్చలు జరపడంతో భీమవరం రాజీనామాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. అయితే చింతలపూడి వ్యవహారం ఇంతవరకూ కొలిక్కి రాలేదు. సెప్టెంబర్ నెలాఖరులో చింతలపూడి నియోజకవర్గం ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఆ రాజీనామాలు ఆమోదించే విషయంలో పట్టుపట్టకపోవడంతో బ్లాక్మెయిల్ చేసేందుకే రాజీనామాలు చేసినట్లు స్పష్టం అవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం, ఎంపీ మాగంటి బాబు తరపున సీనియర్ నేత ముత్తారెడ్డి ఆధ్వర్యంలోని వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం రోడ్డెక్కిన మాగంటి బాబు వర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు రాజీనామా అస్త్రం సంధించారు. ఇందులో కొందరు ఇప్పటికే తాము ఒత్తిడి వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించామని, తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చింతలపూడి వ్యవహారంలో పెద్ద ఎత్తున రాజీనామాలకు దిగినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. మూడున్నర ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా గ్రూపు తగాదాలతో చింతలపూడి ఎఎంసీ చైర్మన్‌ను ప్రకటించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. గోపాలపురం నియోజకవర్గంలో కూడా అసమ్మతులు తీవ్రంగా ఉన్నాయి. కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితులు ఉన్నా అధిష్టానం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఎన్నికలు మరో ఏడాదిలో ఉండే అవకాశం కనపడుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ మొదలైంది. -
బండారం బయటపడుతోంది
కబ్జాలు...వసూళ్లు బండారు అనుచరులదీ ఇదే తీరు భీతిల్లుతున్న ఓటర్లు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రజల సమస్యలపై ఉద్యమాల ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు.. పారిశ్రామిక ప్రాంతాల్లో సమస్యలపై బయట పోరాటాలు.. తెరవెనుక పారిశ్రామికవేత్తలతో లాలూచీలు.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జాలలు. భూబకాసరులకు వంతపాటలు.....పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై ఇలా పలు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం, నిరుద్యోగం, ఉపాధి కల్పనల పేరుతో కొద్ది రోజులు ఉద్యమాలు నడిపి హడావుడి చేయడం.. లక్షలకు లక్షలు పిండుకున్నాక ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ఆయన నైజమన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా భూ కబ్జాదారులను పెంచి పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక వాడలో ఉద్యమాలు చేసిన బండారు అక్కడ పోటీ చేయకుండా పెందుర్తి నుంచి పోటీకి దిగడం వెనుక ఆ పార్టీ కార్యకర్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాజువాక, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో బండారు సత్యనారాయణమూర్తి పోరాటాల ముసుగులో ప్రజలను మోసం చేశారన్న అభిప్రాయాలు ఉండడంతో అక్కడ నుంచి గెలవలేరని భావించి, పెందుర్తిని ఎంచుకున్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా పెందుర్తి నియోజవకర్గంలో ఆయన వెంట ఉండే అనుచరగణాన్ని చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనేక భూ కబ్జాలు బండారు అనుచరులు పెందుర్తిలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను దిగమింగారు. రికార్డులను ట్యాంపర్ చేసి భూములను జిరాయితీలుగా మార్చి దర్జాగా అమ్ముకున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో సర్వే నెంబర్ 394-1లో 4.22 ఎకరాల ప్రభుత్వ భూమిని బండారు ముఖ్య అనుచరుడైన గండి ముత్యాలనాయుడు కబ్జా చేశాడు. ఈయన బండారు ఆశీస్సులతో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పదేళ్లుగా కొనసాగుతున్నాడు. ముత్యాలనాయుడు అధికారులను ప్రసన్నం చేసుకొని ప్రభుత్వ భూమిని జిరాయితీగా రికార్డుల్లో మార్పించి తన భార్య పేరున గిఫ్ట్‌డీడ్ రాయించి ఇచ్చాడు. సుమారు రూ.3 కోట్లు విలువ చేసే ఆ భూమిని 2007లో కరణం ప్రభావతి, నర్సిపల్లి మల్లేశ్వరి అనే ఇద్దరికి విక్రయించాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సమాచార హక్కు చట్టం గుర్తించి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సబ్బవరం మండలంలో గొల్లలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 47/2లో 22 ఎకరాల మిగులు భూములను కూడా ముత్యాలనాయుడు కబ్జా చేశారు. అధికారంలోకి వస్తే అంతే.. ప్రస్తుతం ముత్యాలనాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారాల బాధ్యతలను చూస్తున్నారు. ఎటువంటి అధికారం లేకుండానే అనేక కబ్జాలకు పాల్పడుతున్న వారికి అండదండలు అందిస్తున్న బండారు.. అధికారంలోకి వస్తే పెందుర్తిలో భూబకాసురులకు ఎదురుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.