
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. తెలుగు తమ్ముళ్లు పార్టీ నేతలకు ఎదురు తిరుగుతున్నారు. అవసరమైతే పదవులకు రాజీనామాలు చేసి తమ పంతం నెగ్గించుకుంటున్నారు. కొన్నిచోట్ల తమ పంతం నెరవేరక వెనక్కి తగ్గుతున్నారు. రాజీనామాలు ఆమోదించుకునే దిశగా ఒక్కరు కూడా ప్రయత్నం చేయకపోవడం కేవలం బ్లాక్‌మెయిల్ కోసమే ఈ ప్రహసనం నడుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. భీమవరంలో రెండురోజుల పాటు సాగిన కౌన్సిలర్ల రాజీనామా వివాదం ఇదే విధంగా ముగిసింది. భీమవరం మున్సిపాలిటీలో అధికారపక్ష టీడీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు బుధవారం మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు తీరు పట్ల మెజారిటీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పక్షంలో ఉన్నా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించుకోలేని దుస్థితి ఉండటం పట్ల కౌన్సిలర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇదే పరిస్థితి జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలలో కూడా ఉంది. మెజారిటీ ఉన్న చోట స్థానిక ఎమ్మెల్యే ఏం చెబితే అవే తీర్మానాలుగా మారుతున్నాయి. కనీసం కౌన్సిలర్లకు తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కూడా ఉండటం లేదు. గెలిచి కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో కౌన్సిలర్లు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి పిలిచి అసమ్మతి వర్గంతో చర్చలు జరపడంతో భీమవరం రాజీనామాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. అయితే చింతలపూడి వ్యవహారం ఇంతవరకూ కొలిక్కి రాలేదు. సెప్టెంబర్ నెలాఖరులో చింతలపూడి నియోజకవర్గం ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఆ రాజీనామాలు ఆమోదించే విషయంలో పట్టుపట్టకపోవడంతో బ్లాక్‌మెయిల్ చేసేందుకే రాజీనామాలు చేసినట్లు స్పష్టం అవుతోంది.
చింతలపూడి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం, ఎంపీ మాగంటి బాబు తరపున సీనియర్ నేత ముత్తారెడ్డి ఆధ్వర్యంలోని వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం రోడ్డెక్కిన మాగంటి బాబు వర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు రాజీనామా అస్త్రం సంధించారు. ఇందులో కొందరు ఇప్పటికే తాము ఒత్తిడి వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించామని, తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చింతలపూడి వ్యవహారంలో పెద్ద ఎత్తున రాజీనామాలకు దిగినా సమస్య పరిష్కారం కాలేదు.
ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. మూడున్నర ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా గ్రూపు తగాదాలతో చింతలపూడి ఎఎంసీ చైర్మన్‌ను ప్రకటించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. గోపాలపురం నియోజకవర్గంలో కూడా అసమ్మతులు తీవ్రంగా ఉన్నాయి. కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితులు ఉన్నా అధిష్టానం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఎన్నికలు మరో ఏడాదిలో ఉండే అవకాశం కనపడుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment