![బండారం బయటపడుతోంది](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/2/71399059210_625x300.jpg.webp?itok=ZD-b_6cM)
బండారం బయటపడుతోంది
- కబ్జాలు...వసూళ్లు
- బండారు అనుచరులదీ ఇదే తీరు
- భీతిల్లుతున్న ఓటర్లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రజల సమస్యలపై ఉద్యమాల ముసుగులో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు.. పారిశ్రామిక ప్రాంతాల్లో సమస్యలపై బయట పోరాటాలు.. తెరవెనుక పారిశ్రామికవేత్తలతో లాలూచీలు.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జాలలు. భూబకాసరులకు వంతపాటలు.....పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై ఇలా పలు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం, నిరుద్యోగం, ఉపాధి కల్పనల పేరుతో కొద్ది రోజులు ఉద్యమాలు నడిపి హడావుడి చేయడం.. లక్షలకు లక్షలు పిండుకున్నాక ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ఆయన నైజమన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా భూ కబ్జాదారులను పెంచి పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక వాడలో ఉద్యమాలు చేసిన బండారు అక్కడ పోటీ చేయకుండా పెందుర్తి నుంచి పోటీకి దిగడం వెనుక ఆ పార్టీ కార్యకర్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గాజువాక, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో బండారు సత్యనారాయణమూర్తి పోరాటాల ముసుగులో ప్రజలను మోసం చేశారన్న అభిప్రాయాలు ఉండడంతో అక్కడ నుంచి గెలవలేరని భావించి, పెందుర్తిని ఎంచుకున్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా పెందుర్తి నియోజవకర్గంలో ఆయన వెంట ఉండే అనుచరగణాన్ని చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అనేక భూ కబ్జాలు
బండారు అనుచరులు పెందుర్తిలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను దిగమింగారు. రికార్డులను ట్యాంపర్ చేసి భూములను జిరాయితీలుగా మార్చి దర్జాగా అమ్ముకున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో సర్వే నెంబర్ 394-1లో 4.22 ఎకరాల ప్రభుత్వ భూమిని బండారు ముఖ్య అనుచరుడైన గండి ముత్యాలనాయుడు కబ్జా చేశాడు. ఈయన బండారు ఆశీస్సులతో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పదేళ్లుగా కొనసాగుతున్నాడు.
ముత్యాలనాయుడు అధికారులను ప్రసన్నం చేసుకొని ప్రభుత్వ భూమిని జిరాయితీగా రికార్డుల్లో మార్పించి తన భార్య పేరున గిఫ్ట్‌డీడ్ రాయించి ఇచ్చాడు. సుమారు రూ.3 కోట్లు విలువ చేసే ఆ భూమిని 2007లో కరణం ప్రభావతి, నర్సిపల్లి మల్లేశ్వరి అనే ఇద్దరికి విక్రయించాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సమాచార హక్కు చట్టం గుర్తించి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సబ్బవరం మండలంలో గొల్లలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 47/2లో 22 ఎకరాల మిగులు భూములను కూడా ముత్యాలనాయుడు కబ్జా చేశారు.
అధికారంలోకి వస్తే అంతే..
ప్రస్తుతం ముత్యాలనాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారాల బాధ్యతలను చూస్తున్నారు. ఎటువంటి అధికారం లేకుండానే అనేక కబ్జాలకు పాల్పడుతున్న వారికి అండదండలు అందిస్తున్న బండారు.. అధికారంలోకి వస్తే పెందుర్తిలో భూబకాసురులకు ఎదురుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.