టీడీపీ కింది స్థాయి నేతల టచ్‌లోకి పంచకర్ల
మాజీ మంత్రిని పక్కన పెట్టేసిన వైనం
43 ఏళ్ల సీనియర్‌కు అవమానాలు
ఎక్కడికక్కడ బండారు వర్గాన్ని వెక్కిరిస్తున్న జనసేన క్యాడర్
పెందుర్తి: జగమంతా కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అన్నట్లు తయారైంది 43 ఈయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందిన బండారు ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థిగా పెందుర్తి బరిలో ఉన్న పంచకర్ల రమేష్‌బాబు తన చిరకాల ప్రత్యర్థి బండారు సత్యనారాయణమూర్తిని క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేలా చేశారు. కూటమి అభ్యర్థిగా ఉన్న రమేష్‌బాబు ప్రధాన పార్టీ టీడీపీని కలుపుకుని వెళ్లాల్సింది పోయి.. దొడ్డిదారిలో టీడీపీలో బండారు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అడుగడుగునా బండారు వర్గానికి జనసేన క్యాడర్ నుంచి తీవ్రస్థాయిలో అవమానాలు ఎదురవుతున్నాయి. ‘మాకు మీ అవసరం లేదు’అంటూ బండారు వర్గాన్ని మరింత రగిలిపోయేలా చేస్తున్నారు.
అధినేత నుంచే అవమానం
జనసేన–టీడీపీ జత కట్టిన దగ్గర నుంచి సీనియర్, స్థానికుడైన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా పలు బహిరంగ వేదికల్లో బండారుకే టికెట్ అన్నట్లు సంకేతాలిచ్చారు. తీరా ఆఖరి నిమిషంలో బండారును కాదని కొద్ది రోజుల కిందట జనసేన తీర్థం పుచ్చుకున్న స్థానికేతరుడు పంచకర్లకు పెందుర్తి టికెట్ కేటాయించారు. బండారుకు టికెట్ ఇవ్వకపోగా.. కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు టికెట్ నిరాకరించడం.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి అయిన రమేష్‌బాబుకు టికెట్ ఇవ్వడంతో బండారు రగిలిపోతున్నారు. నిద్రాహారాలు కూడా సరిగా లేకపోవడంతో కొద్ది రోజుల కిందట అనారోగ్యం పాలయ్యారు. అయినా కూడా టీడీపీ అధిష్టానం నుంచి కనీసం పరామర్శ లేదని బండారు వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది.
బండారా.. డోంట్ కేర్ : ఇదిలా ఉండగా జనసేన నుంచి కూడా బండారుకు తొలి నుంచి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇరు పార్టీలు జతకట్టిన తర్వాత తప్పదన్నట్లు అప్పుడప్పుడు కలసి తిరిగినా.. బండారు–పంచకర్ల బంధం టికెట్ కేటాయించిన తర్వాత అతుక్కునే ప్రయత్నమే జరగలేదు. బెర్త్ ఖాయం చేసుకొని పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టిన పంచకర్ల రమేష్‌బాబు మర్యాద కోసమైన బండారును పలకరించలేదు. ఇంటికే పరిమితమైన బండారు లేకపోతే మాకెంటి అనే రీతిలోనే జనసేన తీరు ఉంది తప్పితే.. పొత్తు ధర్మం కోసం పంచకర్ల వర్గం బండారును కలుపుకునే ప్రయత్నం చేయలేదు. కాగా.. కొద్ది రోజులుగా బండారుపై కాస్తోకూస్తో అసంతృప్తిగా ఉన్న కిందిస్థాయి నాయకులతో పంచకర్ల టచ్‌లోకి వెళ్లడంతో.. బండారు వర్గం తీవ్రస్థాయిలో రగిలిపోతోంది. నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోసిన బండారు సత్యనారాయణమూర్తికి జనసేన నుంచి ఇన్ని అవమానాలా? అంటూ టీడీపీ పాత కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment