మోత మోగిస్తున్న వాల్ స్ట్రీట్ స్టాక్స్
న్యూయార్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో వాల్ స్ట్రీట్ స్టాక్స్ కూడా ఆ దేశ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపట్లోనే నాస్డాక్ చరిత్ర సృష్టించింది. మొదటిసారి 6000 మార్కును తాకింది. బ్లూ చిప్ కంపెనీల ఫలితాలు చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో వాల్ స్ట్రీట్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయని అక్కడి విశ్లేషకులంటున్నారు.
నాస్డాక్ తో పాటు డౌ జోన్స్ కూడా లాభాలు పండిస్తోంది. ఓపెనింగ్ బెల్ మోగించిన కొద్ది సమయ వ్యవధిలోనే నాస్ డాక్ కాంపొజిట్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగి, 6,004.27ను తాకింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా 0.7 శాతం ఎగిసి, 20,911.41 వద్ద ట్రేడైంది. అదేవిధంగా ఎస్ అండ్ పీ 500 కూడా లాభాల్లో నడుస్తుందని తెలుస్తోంది.
ఇటు మన దేశీయ మార్కెట్లూ మంగళవారం ట్రేడింగ్ లో ఫుల్ జోష్ లో కొనసాగాయి. ఆరంభం నుంచి రికార్డు లాభాల మోత మోగించాయి. నిఫ్టీ 88.65 పాయింట్లు ఎగిసి రికార్డు స్థాయిలో 9307 వద్ద ముగిసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 9,300 ని తాకింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 287.40 పాయింట్ల లాభంలో 29,943 వద్ద క్లోజైంది.