Blue Coats
-
విధులపై నిర్లక్ష్యం..వసూళ్లే లక్ష్యం
తిరుపతి క్రైం: నిత్యం వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులతో స్నేహపూర్వకంగా మెలగాలనే ఉద్దేశంతో అర్బన్ ఎస్పీ ‘ఫ్రెండ్లీ పోలీసు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతకాలం ఇది సజావుగానే సాగింది. ఆ తర్వాత క్రమేణా గాడి తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన పోలీసులు వసూ ళ్ల బాట పట్టారు. చిరు వ్యాపారుల నుంచి ఇసుక మాఫియా వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. అలాగే మద్యం షాపులను రాత్రిపూట మూసే సమయానికల్లా అక్కడికి చేరుకుని బ్లూకోట్స్ రూ.100, రక్షక్ వాహనాలు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్షన్‌కే ప్రాధాన్యత రక్షక్ వాహనాలు ప్రజల రక్షణను గాలికొదిలేస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. రక్షణ కన్నా కలెక్షన్పైనే ఎక్కువగా దృష్టి సారించారని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడ చిరు వ్యాపారులు కనిపించినా వారిని వదలడం లేదు. తమ దుకాణాలకొచ్చి తినుబండారాలను తినడంతో పాటు డబ్బులు డిమాండ్ చేస్తూ, తమ కడుపు కొడుతున్నారని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రశ్నిస్తే రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేస్తారా? అని తమపై కేసులు బనాయిస్తున్నారని వారు లబోదిబోమంటున్నారు. గతంలో రౌడీలు మామూళ్లు వసూలు చేస్తుంటే, ప్రస్తుతం పోలీసులే దర్జాగా వసూళ్లకు తెగబడుతున్నారని వాపోతున్నారు. విధులు పక్కన పెట్టి సరదాలు రక్షక్ వాహనంలో సంచరిస్తూ ఎక్కడ ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రక్షక్ పోలీసులది. అయితే వా హనాన్ని చెట్ల కింద పార్కింగ్ చేసి సరదాలు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుచానూరులో పెట్రేగిపోతున్న ఆగడాలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుచానూరులో పోలీసులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. స్టేషన్లో బ్లూకోట్స్‌లో విధులు నిర్వహిస్తున్న, సుమారు 45 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుచానూరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా వాహనాలే వారికి టార్గెట్. తెల్లవారుజామున బైక్‌పై వెళ్లి ఇసుక వాహనాలను అడ్డగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నేరమని, వాహనాన్ని స్టేషన్‌కు తరలించాలంటూ డ్రైవర్‌ను హడలెత్తిస్తారు. ఆ తర్వాత వాహన యజమానిని అక్కడికి రప్పించి, సెటిల్మెంట్ చేసుకుంటున్నారని తిరుచానూరు ప్రజానీకం కోడై కూస్తోంది. జాతీయ రహదారిపై గస్తీ పేరిట ప్రతి వాహనం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ఇలా బ్లూకోట్స్ పోలీసుల ఆగడాలకు అంతులేకుండాపోతోందని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో కూడా తిరుచానూరు పోలీసులపై పలు ఆరోపణలొచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఏదీ నిఘా? గతంలో రక్షక్, బ్లూకోట్స్ పోలీసులపై ప్రత్యేక నిఘా ఉండేది. దీంతో వారు సక్రమంగా విధులను నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం వారిపై నిఘా కొరవడంతో అందిన కాడికి దోచుకుంటున్నారు. రాత్రి వేళ్లల్లో మద్యం దుకాణాలపై దాడులు చేయడం, మామూళ్లు దండుకోవడం పరిపాటిగా మారింది. ఎవరైనా గళం విప్పితే ఇక ఆ మద్యం దుకాణం సంగతి సరేసరి! చేసేదేమీ లేక వారు కూడా విధిలేక మామూళ్లను ముట్టజెపుతున్నారు. ఇటు చూడండి అర్బన్ ఎస్పీ సారూ! అంతేకాకుండా మామూళ్ల వసూళ్లను ఆయా స్టేషన్ పరిధిలోని ఉన్నాధికారులకు సైతం వాటా లు అందుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఇకనైనా అర్బన్ ఎస్పీ ప్రత్యేక నిఘా ఉంచి, దారిన పెట్టాలని, ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు సార్థకత చేకూరేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
‘బ్లూకోల్ట్స్’ పోలీసులపై దాడి
కడప అర్బన్ : కడప నగరంలోని ఎర్రముక్కపల్లె స ర్కిల్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ ప్రమాద సంఘటన చివరకు పోలీసు వ్యవస్థకు తీరని అవమానం జరిగింది. ఏకంగా బ్లూకోల్ట్స్ పోలీసులను అవమాన పరిచేలా ఆగంతకులు దాడి చేశారు. ఈ సంఘటనపై ఒన్‌టౌన్ సిఐ టివి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి. ♦ కడప నగరంలోని ఎర్రముక్కపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం నూర్, మస్తాన్ల వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. మస్తాన్ తరపున మహబూబ్ బాషా, నూర్ తరపున రహమాన్ పెద్దమనుషులుగా వచ్చి ద్విచక్రవాహనదారుల మధ్య నెలకొన్న ఘర్షణను సర్దుబాటు చేసే క్రమంలో స్థానికులలో కొందరు మహబూబ్బాషాపై దాడి చేశారు. ఈ క్రమంలో మహబూబ్‌బాషా డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ♦ ఫోన్ కాల్ అందుకున్న వెంటనే బ్లూకోల్ట్స్ –3 కానిస్టేబుల్ రమణ (పిసి నెం.3050), హోంగార్డు రణధీర్రెడ్డిలు తమ ద్విచక్రవాహనంలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ♦ ఆ సమయంలో స్థానికుల చేతిలో దెబ్బలు తిన్న మహబూబ్ బాషా తనపై దాడి చేసిన వారిలో సెల్పాయింట్ నిర్వాహకుడు రహమాన్‌తో పాటు, ప లువురు ఉన్నారని చూపించాడు. దీంతో వారిని స ర్దుబాటు చేసేందుకు కానిస్టేబుల్ రమణ, హోంగా ర్డు రణధీర్ రెడ్డిలు ప్రయత్నించగా నిందితులు పోలీసు లపై దాడి చేయడంతో పాటు వారిని ఎర్రముక్క పల్లె సర్కిల్ నుంచి తరుముకుంటూ సంధ్యాసర్కిల్ వరకు వచ్చినట్లు ‘పిటిజెడ్’ కెమెరాలో నమోదైంది. ♦ తమపై దాడి చేసిన విషయాన్ని బాధిత పోలీసులు ఒన్‌టౌన్ సీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ♦ కానిస్టేబుల్ రమణతో పాటు, హోంగార్డు రణధీర్ రెడ్డిలు రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టీవీ సత్యనారాయణ తెలిపారు. టీడీపీ నేతల హైడ్రామా.. ♦ ఈ సంఘటనలో నిందితులుగా పోలీసులు రహమాన్, ఇంతియాజ్, ఆరిఫ్, మహబూబ్‌బాషా, నూర్బాషాలతో పాటు మరికొందరిని గుర్తించారు. వీరిలో ఇంతియాజ్ టీడీపీ మైనార్టీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జిలానీబాషా మేనల్లుడుగా పోలీసులు గుర్తించారు. కాగా, పోలీసులపై దాడి సంఘటన జరిగిన తర్వాత జిలానీబాషా, తన అనుచరులతో ఎర్రముక్కపల్లె వద్ద ఉండగా ఎస్ఐ రంగారావు, పోలీసు సిబ్బంది తనను చితకబాదారని ఆరోపించారు. ఈమేరకు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చూశారు. కానీ పోలీసులు మాత్రం కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేశారు. -
దటీజ్ మహాలక్ష్మీ..
మహిళలను వివిధ విపత్కర పరిస్థితులనుంచి కాపాడేందుకు పోలీసు విభాగంలో తొలిసారిగా మహిళా బ్లూకోల్ట్స్‌ను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఏర్పాటు చేశారు. అలా మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహాలక్ష్మి విధినిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పలువురు మహిళలను ఆమె కాపాడారు. ఈవ్ టీజింగ్ తదితర సమస్యల నుంచి మహిళలను కాపాడుతూదటీజ్ మహాలక్ష్మి అనినిరూపించుకుంటున్నారు. రాజమహేంద్రవరం క్రైం : రాష్ట్రంలోనే తొలి మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహా లక్ష్మి తన సేవలతో అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాకినాడకు చెందిన మహాలక్ష్మి బీఏ బీఈడీ చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి తల్లి ఆశయాల మేరకు పోలీసుశాఖలో ప్రవేశించారు. 2014 బ్యాచ్‌కు చెందిన మహాలక్ష్మి ఒంగోలులో శిక్షణ పొందారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో మహిళా పోలీసుగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం త్రీటౌన్‌లో విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మిని అర్బన్ ఎస్పీ రాజకుమారి రాష్ట్రంలోనే మొట్ట మొదటి మహిళా బ్లూ కోల్ట్స్గా నియమించారు. ఆమె అంకితభావంతో విధులను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పలువురు మహిళలను కాపాడారు. కోరుకొండ మండలం, కణుపురు గ్రామానికి చెందిన శానాపతి వెంకట లక్ష్మి భర్త వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరి 1న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఆత్మహత్యా యత్నం చేసుకుంటుండగా పసిగట్టిన మహిళా బ్లూకోల్ట్స్ మహాలక్ష్మి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి ఆమెను బంధువులకు అప్పగించారు. అలాగే యానాంకు చెందిన నల్లా దుర్గా దేవిని కూడా కాపాడారు. ఆమె భర్త వికలాంగుడు. ఆమెను ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. దాంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ వద్దకు వచ్చి జనవరి నెలలో ఆత్మహత్యా యత్నం చేసుకోబోయింది. ఆమెను కూడా మహిళా బ్లూకోల్ట్స్ రక్షించి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆమెను సోదరుడికి అప్పగించారు. ఈవ్‌టీజింగ్ తదితరాల బారిన పడకుండా బాధితుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించి మహిళలను ఆదుకోవడంలో ముందుంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు మహాలక్ష్మి. -
నిరంతరం నిఘా
► రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ► కరీంనగర్లో బ్లూకోట్స్ బృందాలు ప్రారంభం కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కోసం బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కరీంనగర్ కమిషనరేట్‌కు కేటారుుంచిన 40 బ్లూకోట్స్ ద్విచక్ర వాహనాలను మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా తాను ఎక్కువ జీవోలు, ఎక్కువ నిధులు, సౌకర్యాలు కల్పించిన ఏకై క శాఖ పోలీస్శాఖనేనని తెలిపారు. భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుంచి పెట్టబడులు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సింగపూర్ తరహా పోలీస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కరీంనగర్ రేంజ్ ఇన్చార్జి డీఐజీ రవివర్మ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లూకోట్స్ ఏర్పాటుతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. నేరాల నియంత్రణ : సీపీ కమలాసన్‌రెడ్డి బ్లూ కోట్స్ బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. బ్లూకోట్స్ బృందాల పనితీరు వివరిస్తూ.. నేరాల నియంత్రణ, ముందస్తు చర్యలు తీసుకోవడం, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 58 మంది కానిస్టేబుళ్లు, 58 మంది హోంగార్డులను కలిపి 40 బ్లూకోట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరు బ్లూ కలర్ రేడియం కోట్స్ ధరించి ప్రత్యేకంగా తయారు చేసిన బైక్‌లపై తిరుగుతూ పరిస్థితులను అదుపులో ఉంచుతారన్నారు. వీరి వెంట బైక్, వాటికి జీపీఎస్ట్రాకర్, వీడియో కెమెరా, టార్చిలైట్ ఉంటుందని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, గంగాధర, రామడుగు, చిగురుమామిడి, గన్నేరువరం, హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, కేశవపట్నం, ఇల్లందకుంట, వీణవంక పోలీస్స్టేషన్లలో వీరు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. డయల్ 100 కాల్స్‌కు సైతం స్పందించి సంఘటన ప్రాంతానికి పది నిమిషాల్లోపు చేరుకుంటారని తెలిపారు. కరీంనగర్లో 20 షీటీం బృందాలను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకూ 43 మందికి కౌన్సిలింగ్ నిర్వహించగా నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా నేరాలకు పాల్పడని 43 మంది రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్స్ తొలగించామని కొత్తగా 53 మందిపై రౌడీషీట్స్, సస్పెక్ట్‌షీట్స్ తెరిచినట్లు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమరుు బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఎంపీపీ వాసాల రమేశ్, ఏసీపీలు రామారావు, రవీందర్‌రెడ్డి, సి.ప్రభాకర్, ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, బ్లూకోట్ సిబ్బంది పాల్గొన్నారు.