Blue Cross Society
-
‘వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో వీధి కుక్కలకు రోగనిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు పునరుత్పత్తి నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపిస్తామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర వింద్‌కుమార్ తెలిపారు. వీధి కుక్కలను చంపకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ఆయన బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమలతో సమావేశమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వెటర్నరీ విద్యార్థుల కోసం త్వరలో 2 వారాల శిక్షణ కోర్సును ప్రారంభించనున్నామన్నారు. వెటర్నరీ విద్యార్థులకు శిక్షణ అందించడానికి బ్లూక్రాస్ సొసైటీ ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తామని అమల పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ డీకే శ్రీదేవి పాల్గొన్నారు. -
గిరిజన తండాలో సినీనటి అమల సందడి
కుల్కచర్ల: ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు అక్కినేని అమల గిరిజన తండాలో సందడి చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అల్లాపూర్ తండాను ఆదివారం ఆమె సందర్శించారు. రాంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మాణెమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలోనూ 36 మందితో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్న మాణెమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అక్కినేని నాగేశ్వర్రావు స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఫిలిమ్స్ మీడియా పాఠశాలకు అమల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి గ్రామీణ ప్రాంతాలు, వారి జీవన స్థితిగతులు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు తండాలను సందర్శించారు. -
జంతు సంరక్షణే బ్లూక్రాస్ లక్ష్యం
♦ సొసైటీ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ♦ కేజీరెడ్డి కళాశాలలో డాగ్స్ షెల్టర్ ప్రారంభం మొయినాబాద్: పశుపక్ష్యాదుల విషయంలో ప్రతిఒక్కరూ మాన వతా దృక్పథంతో వ్యవహరించాలని బ్లూక్రాస్ సొసైటీ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల అన్నారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బ్లూక్రాస్, కళాశాల యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాగ్స్ షెల్టర్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శునకాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జంతు సంరక్షణే ధ్యేయంగా బ్లూక్రాస్ సొసైటీని స్థాపించామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన కుక్కలకు వైద్యం అందించాలని కోరారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి శునకాలను కొనుగోలు చేస్తారని.. అలా కాకుండా వీధి కుక్కలను దత్తత తీసుకుని పెంచితే అవి విశ్వాసంతోపాటు రక్షణగా ఉంటాయన్నారు. సృష్టిలోని జీవులన్నింటికీ బతికే హక్కుందన్నారు. కేజీ రెడ్డి కళాశాలలో డాగ్స్ షెల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ప్రవళిక, శృతి, జబీఖాన్, కళాశాల డెరైక్టర్ మధుసూదన్‌నాయర్, ప్రిన్సిపల్ కేవీ నర్సింహ్మరావు, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ రవికిరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.