Bodrai festival
-
మహబూబాబాద్: బొడ్రాయి పండుగలో అపశ్రుతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కంబాలపల్లిలో బొడ్రాయి పండుగలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామ దేవతల ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్థులు బోనాలు నిర్వహించారు. బోనాలతో గ్రామస్థులు బొడ్రాయి వద్దకు చేరుకోగ.. బోనంపై ఉన్న దీపం పైన పందిరి గడ్డిని తగలగడంతో మంటలు చెలరేగాయి. దీంతో యాగశాల పూర్తిగా దగ్గమయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఎగిసిపడిన మంటలను గ్రామస్థులు బిందెలతో నీళ్లు చల్లి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గడ్డి, తడకల పందిరి పూర్తిగా దగ్ధమయ్యింది. భక్తులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. బొడ్రాయి పండుగలో నరదృష్టి పోయిందని గ్రామస్థులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంపీ మాలోతు కవిత ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు -
బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో నాలుగు రోజులుగా జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన, వనభోజనాల కార్యక్రమంలో ఏకంగా రూ.5 కోట్ల మేర ఖర్చయిందనే విషయం చర్చనీయాంశమైంది. గ్రామ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సొంతంగా రూ.15 లక్షలు ఖర్చు చేశారని అంటున్నారు. అలాగే ప్రతీ ఇంటికి కొత్త బట్టలు, పూజ సామగ్రి, యాట పోతుల కొనుగోలు, వంటకాలు, బంధువులకు మర్యాదలు, భోజనాలు, విందు కోసం మందు, ఇలా ప్రతీ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే సుమారు రూ. 5 కోట్ల మేర ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
పండుగ కోసం తిరిగి.. తిరిగిరానిలోకాలకు..
నల్లగొండ: బొడ్రాయి పండుగ తెచ్చిన తంటా ఇంతా అంతా కాదు.. అనారోగ్యంతో మృత్యువాత పడ్డ మృతదేహాన్ని బోనాలు పూర్తయ్యే వరకు గ్రామానికి తీసుకురావద్దని గ్రామస్తులు చెప్పడంతో ఒక కుటుంబం మొత్తం మృతదేహంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సుమారు 14 గంటలకు పైగా రోదిస్తూ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్తే అరిష్టం జరుగుతుందని గ్రామస్తులు అనడంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు రోదిస్తూ కాలం వెల్లదీసిన తీరు అందరినీ కలిచి వేసింది. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర శంకరయ్య(34) గురువారం బొడ్రాయి పండుగును పురస్కరించుకుని పనుల నిమిత్తం ఎండలో తిరిగాడు. రాత్రి ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకరయ్య ఆర్ధరాత్రి చనిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో పెద్ద తంటా వచ్చి పడింది. గ్రామంలో బొడ్రాయి పండుగను నిర్వహిస్తున్నందున మృతదేహాన్ని తీసుకువస్తే అరిష్టం జరుగుతుందని.. మృతదేహాన్ని తీసుకురావొద్దని గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఉదయం కూడా తీసుకురావొద్దని... గ్రామం పొలిమేర చుట్టూ పొత్తిపోస్తాం.. కాబట్ట్టి ఇతర గ్రామస్తులు గ్రామానికి రారని, కల్వలపల్లి గ్రామస్తులు కూడా గ్రామం విడిచి వెళ్లవద్దని సూచించారు. దీంతో మృతుడిని కడసారి చూసేందుకు అతడి తల్లి కూడా బయటకు రాని దీన పరిస్థితి ఏర్పడింది. అమృతదేహాన్ని వార్డులో ఉంచే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చిరీ ఆవరణలో ఉంచారు. అటు గ్రామానికి వెళ్లలేక మృతుడి భార్య, పిల్లలు, బంధువులు అర్ధరాత్రి నుంచి మార్చురీ వద్ద రోదిస్తూ గ్రామస్తుల అనుమతి కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. బోనాల కార్యక్రమం పూర్తయిందని గ్రామం నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సమాచారం రావడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లారు. మా అమ్మకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు - సునిత, మృతుడి సోదరి అన్న శంకరయ్య ఆర్ధరాత్రి చనిపోతే పండుగ ఉందని గ్రామానికి తీసుకురావద్దని చెప్పారు. అమ్మ ముత్తమ్మ ఆరోగ్యం బాగా లేదంట. ఆమెను దావఖానాకు తీసుకురావడానికి ఎవ్వరూ గ్రామం నుంచి వెళ్లొద్దని అంటున్నారంట. ఆమెకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? అని ఆమె గ్రామస్తులను ప్రశ్నించింది.