boeing airplanes
-
గాల్లో ఉండగానే కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు!
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి ఇటీవలే పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. దాంతో బోయింగ్ 737 మ్యాక్స్‌లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. కానీ, ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ‘సపోరో-న్యూ చిటోస్ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే నాలుగు లేయర్లు కలిగిన కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితోపాటు 59 మంది ప్రయాణికులు ఉన్నారు’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో చెప్పింది. ఇదీ చదవండి: కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్? అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. తాజాగా వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు తెలిపింది. మరిన్ని భద్రతా పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు గతవారం మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఎనిమిదేళ్ల నాటి విమానం మిస్సింగ్ మిస్టరీ.. కూలిందా? కూల్చారా!
మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న మిస్సయ్యింది. ఆ విమానం ఆచూకీ కోసం గాలించినా... కనిపించకపోయేసరికి కూలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఐతే ఇప్పుడూ ఆ విమానం కూలిందా? ఉద్దేశ్వపూర్వకంగా కూల్చేశారా అను పలు అనుమానాలు తలెత్తేలా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఆ విమానంలో సుమారు 239 మంది ప్రయాణికులతో మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తుండగా..ఆ విమానం ఆచూకీ కానరాకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి ఆ విమానం మిస్సింగ్ మిస్టరీని చేధించే పనిలో పడ్డారు నిపుణులు. ఆ విమానానికి సంబంధించిన శకలాలను వెతికే పలు ప్రయత్నాలు చేశారు. ఆ బోయింగ్ 777 విమానం శకలాలు మడగాస్కన్ మత్స్యకారులకు లభించాయి. 2017లో వచ్చిన ఉష్ణమండల తుపాను ఫెర్నాండో నేపథ్యంలో మడగాస్కన్ సముద్ర తీరానికి విమాన శకలాలు కొట్టుకు రావడంతో టాటాలీ అనే మత్స్యకారుడు ఆ శిధిలాల భాగాన్ని గుర్తించినట్లు బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గ్రాండ్ ఫ్రే చెబుతున్నారు. అతను నుంచి సేకరించిన శకలాల ఆధారంగా... ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని సముద్రంలోకి కూల్చివేసినట్లు విమాన శకలాలను గాలించే నిపుణుడు అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్, బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. అందుకు సాక్ష్యం ఆ మత్స్యాకారుడి వద్ద ఉన్న ల్యాండింగ్ బోర్డు గేర్ని చూస్తే తెలుస్తుందంటున్నారు ఆ నిపుణులు. ఎందుకంటే క్రాష్ అయినప్పుడు.. విమానాన్ని వీలైనంతగా మునిగిపోయేలా చేసేలా.. ల్యాండింగ్ బోర్డు గేర్ని పొడిగించిన విధానమే అసలైన ఎవిడెన్స్ అని చెప్పారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏ పైలెట్ సాధారణంగా ల్యాండింగ్ గేర్‌ను తగ్గించరు. విమానం ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉండటమే గాక నీటిలో సులభంగా మునిగిపోతుంది. ప్రయాణికులు ఎవరు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు గిబ్సన్, ఇంజనీర్ రిచర్డ్ గాడ్ ఫ్రే చెబుతున్నారు. (చదవండి: చైనాకు ఎదరు తిరిగితే అంతే...ఆ యువతి ఇంకా నిర్బంధంలోనే..) -
విమానయానానికి మరింత డిమాండ్ ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్‌పరమైన సవాళ్లు క్రమంగా తగ్గుతుండటంతో దక్షిణాసియాలో విమానయానానికి మరింతగా డిమాండ్ పెరగనుందని విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ఎండీ (రీజనల్ మార్కెటింగ్) డేవ్ షుల్టి తెలిపారు. వ్యాపార అవసరాలు, విహారయాత్రలు మొదలైన వాటి కోసం ప్రయాణాలు చేసేందుకు ప్రజల్లో మళ్లీ ధీమా పెరుగుతోందని, ఎయిర్‌లైన్స్ కూడా సర్వీసులను పెంచుతున్నాయని ఆయన చెప్పారు. దాదాపు 90 శాతం వాటాతో దక్షిణాసియా విమానయాన మార్కెట్లో భారత్ కీలకంగా ఉంటోందని వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే 20 ఏళ్లలో భారత ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు కొత్తగా 2,000 పైగా చిన్న విమానాలు అవసరమవుతాయని డేవ్ చెప్పారు. ఇందుకు సంబంధించి దక్షిణాసియా, భారత మార్కెట్‌పై బోయింగ్ రూపొందించిన అంచనాల నివేదికను శుక్రవారమిక్కడ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమం సందర్భంగా డేవ్ ఆవిష్కరించారు. భారత్ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుండటం, మధ్య తరగతి వర్గాల పరిమాణం పెరుగుతూ ఉండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దక్షిణాసియాలో డిమాండ్ పుంజుకోగలదని ఆయన తెలిపారు. ఫలితంగా దక్షిణాసియాలో వచ్చే రెండు దశాబ్దాల్లో ఎయిర్ ట్రాఫిక్ ఏటా 6.9 శాతం మేర వృద్ధి నమోదు కాగలదని, కొత్తగా దాదాపు 375 బిలియన్ డాలర్ల విలువ చేసే 2,400 కమర్షియల్ విమానాలు అవసరమవుతాయని డేవ్ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి విమానయాన సంస్థలు.. ఇంధనం ఆదా చేసే విశిష్టమైన పెద్ద విమానాలపై మరింతగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం దేశీ ఎయిర్‌లైన్స్‌కు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తరహా పెద్ద విమానాలు 240 పైగా అవసరం పడవచ్చని వివరించారు. భారత్‌లో కార్గో కార్యకలాపాలు సగటున 6.3 శాతం వార్షిక వృద్ధి సాధించే అవకాశం ఉందని బోయింగ్ తన నివేదికలో పేర్కొంది. దేశీయంగా 75 పైగా రవాణా విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్’ గండం
సెల్‌ఫోన్ కారణంగా విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) తెలిపింది. సెల్‌ఫోన్ సిగ్నళ్ల కారణంగా బోయింగ్ కంపెనీకి చెందిన కొన్ని విమానాల్లోని కాప్పిట్లో ఉండే డిస్ప్లే బోర్డులు పనిచేయడం ఆగిపోతున్నాయని వెల్లడించింది. ఈ విషయమై కొందరు పైలట్లు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ నివేదికను సమర్పించింది. 2013 వరకూ విమానాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడటంపై అమెరికాలో నిషేధం ఉండేది. అయితే ఆ తర్వాతికాలంలో దాన్ని తొలగించారు. ప్రస్తుతం విమానాల్లో సెల్ఫోన్లను ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’లో ఉంచి తీసుకెళ్లేందుకు ఎయిర్‌లైన్స్ అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు రకాలకు.. తాజాగా ఈ సెల్ఫోన్ల వైఫై సంకేతాలు, భూమిపై ఉండే రాడార్ల కారణంగా బోయింగ్ కంపెనీకి చెందిన 737, 777 క్లాస్ విమానాల్లోని కాప్‌పిట్ డిస్ప్లే యూనిట్లో సమస్య తలెత్తుతోంది. విమానం వెళుతున్న వేగం, ఎత్తు, వెళ్లాల్సిన దిశ తదితర అంశాలు ఈ డిస్ప్లే యూనిట్లో కనిపిస్తాయి. పైలట్లు సురక్షితంగా విమానాన్ని నడిపేందుకు ఈ వ్యవస్థ మార్గదర్శనం చేస్తుంది. కానీ సెల్‌ఫోన్ సిగ్నళ్ల కారణంగా ఈ డిస్ప్లే యూనిట్లు పనిచేయకుండా పోతున్నాయని, తద్వారా విమాన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందని ఎఫ్ఏఏ తెలిపింది. తాము గాల్లో ఉండగానే డిస్ప్లే యూనిట్లు మూగబోయినట్లు బోయింగ్ ఎన్జీ 737 పైలట్లు దాదాపు 12 సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. తప్పు సరిచేస్తామన్న హనీవెల్ ప్రస్తుతం అమెరికాలో 1,300కుపైగా విమానాలు తిరుగుతుండగా, వీటిలో బోయింగ్ 737, 777 క్లాస్ విమానాలకు ఈ ముప్పుందని ఎఫ్ఏఏ చెప్పింది. ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ హనీవెల్ ఇంటర్నేషనల్ ఈ డిస్ప్లే యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది. ఈ డిస్ప్లే యూనిట్లను 2019, నవంబర్‌లోగా మార్చాలని ఎఫ్ఏఏ ఆదేశించింది. కాగా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నివేదికను హనీవెల్ సంస్థ ఖండించింది. సెల్ఫోన్లలోని సిగ్నల్స్, ఇతర రేడియో సంకేతాలు తమ డిస్ప్లే యూనిట్లను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. తాజాగా ఎఫ్ఏఏ ఆదేశాల నేపథ్యంలో బోయింగ్ విమానాల్లోని తమ డిస్ప్లే యూనిట్లను మారుస్తున్నామని హనీవెల్ సంస్థ తెలిపింది. ఈ విషయమై తమ ఇంజనీరింగ్ నిపుణులు దృష్టి సారిస్తారని కూడా తెలిపింది. -
భారతీయ నర్సులకు విముక్తి
-
భారతీయ నర్సులకు విముక్తి
* విడుదల చేసినఇరాక్ సున్నీ మిలిటెంట్లు * స్వదేశానికి తీసుకొచ్చేందుకు విమానాన్ని పంపిన భారత్ * నేటి ఉదయం కొచ్చికి.. న్యూఢిల్లీ/కొచ్చి: ఇరాక్ సున్నీ మిలిటెంట్ల చెర నుంచి 46 మంది భారతీయ నర్సులకు విముక్తి లభించింది. మిలిటెంట్లు వీరిని శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఉన్నట్టుండి విడుదల చేశారు. ఇరాక్‌లో ఘర్షణలు లేని ఎర్బిల్ నుంచి వీరు ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక బోయింగ్ విమానంలో స్వదేశానికి రానున్నారు. ఈ విమానం శనివారం ఉదయం నేరుగా కొచ్చికి చేరుకోనుంది. కేరళకు చెందిన ఈ నర్సులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఈ విమానాన్ని ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపింది. వీరిని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు గురువారం తమ అధీనంలోని తిక్రిత్ పట్టణ ఆస్పత్రి నుంచి బలవంతంగా మోసుల్ పట్టణానికి తరలించడం తెలిసిందే. ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్థాన్ రాజధాని అయిన ఎర్బిల్.. మోసుల్కు 80 కి.మీ దూరంలో ఉంది. నర్సులు ఎర్బిల్లోని భారత ఎంబసీని సంప్రదిస్తున్నారని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో తెలిపారు. వారు క్షేమంగా ఉన్నారని, వారిని తీసుకొచ్చే విమానంలో కిర్కుక్ నుంచి మరో 70 మంది భారతీయులు, కేరళకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి, ఓ ఐఎఫ్ఎస్ అధికారి వస్తున్నారన్నారు. అన్ని సాధనాలనూ వినియోగించుకున్నాం.. నర్సులు నాటకీయ పరిణామాల మధ్య విడుద లైనట్లు అక్బరుద్దీన్ వ్యాఖ్యల ద్వారా తె లుస్తోంది. వీరి విడుదలకు జరిపిన సంప్రదింపుల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర ఉందా అని విలేకర్లు అడగ్గా ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. ‘సంప్రదింపుల్లో దౌత్యస్థాయిలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయి వివరాలు చెప్పలేం’ అని అన్నారు. దౌత్యం.. ముందు తలుపుల గుండా పనిచేస్తుందని, అయితే తాము ఇతర తలుపులనూ వాడుకున్నామన్నారు. వాటిలో ఒక తలుపు తెరచి తమ పౌరులను తరలించగలిగామని, పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేమన్నారు. నర్సుల విడుదలకు అనేక ప్రయత్నాలు చేశామని, అన్ని సాధనాలనూ వినియోగించుకున్నామన్నారు. కాగా, నర్సులు మోసుల్ నుంచి బస్సులో ఎర్బిల్ విమానాశ్రయానికి దగ్గర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకున్నారని కేరళ సీఎం ఊమెన్ చాందీ ఢిల్లీలో చెప్పారు. భారత ప్రభుత్వం, బాగ్దాద్‌లోని భారత ఎంబసీ, తమ రాష్ట్ర ప్రభుత్వం కలసికట్టుగా కృషిచేసి వీరిని స్వదేశానికి తీసుకొస్తున్నామన్నారు. తమను తిక్రిత్ నుంచి తరలించిన మిలిటెంట్లు మోసుల్ దగ్గర్లోని ఓ ఆస్పత్రి దగ్గరున్న పాత భవనంలో ఉంచారని నర్సులో ఒకరు కొట్టాయంలోని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. కాగా, భారత ప్రభుత్వం నర్సుల ఉదంతాల్లాటివి తలెత్తకుండా పటిష్ట వలస చట్టాన్ని తేవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వాన్ని కోరింది. నర్సులకు సకాలంలో జీతాలు చెల్లించి ఉంటే వారు ఇదివరకే భారత్‌కు చేరుకుని ఉండేవారంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఊరట చెందారు. తనకు సంతోషంగా ఉందని, వారు సురక్షితంగా తిరిగిరావాలని ఓ సందేశంలో పేర్కొన్నారు.