bogas cards
-
అక్రమాలతో పరుగు
ఎమ్మిగనూరు : అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం.. అక్రమాలను కప్పి పుచ్చే అధికార యంత్రాంగం అండదండలు ఆ యువకుడిని వక్ర మార్గంలో నడిపించాయి. మీ సేవ ముసుగులో అక్రమాలతో పరుగులు తీసి చివరకు కటకటాల పాలయ్యాడు. నాడు బోగస్ కార్డుల సృష్టిలో డీలర్లకు వరమయ్యాడు.. నేడు బీమా సొమ్ము స్వాహాకు కంపెనీ ప్రతినిధులకు కీలకంగా మారి కటకటాల పాలైన మీ-సేవ షఫి ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరుకు చెందిన షఫీ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులకు తలలో నాలుకగా మారాడు. అధికారులతో ఉన్న చనువుతో అతడికి మీ సేవ కేంద్రం మంజూరైంది. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పూర్తయినా ఎమ్మిగనూరులోని ఈ కేంద్రం నుంచి వేలకు వేలు బోగస్‌కార్డులు సృష్టించాడు. కార్డుకు రూ. 500ల నుంచి రూ. 1000 చెల్లించి బోగస్‌కార్డులను రేషన్ డీలర్లే తయారు చేయిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి డీఎస్ఓ (జిల్లా పౌర సరఫరాల అధికారి) వెంకటేశ్వర్లు ఎమ్మిగనూరులో షఫీ నడుపుతున్న మీ సేవ కేంద్రంపై దాడి చేసి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని డీపీఎల్ కేంద్రాల నుంచి రేషన్‌కార్డుల సమాచారం ఉన్న బ్యాక్అప్ను జిల్లా అధికారులకు అందించాల్సి ఉండగా షఫీ తన వద్దే ఉంచుకొని బోగస్‌కార్డుల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. అయితే రెవెన్యూ అధికారులతో ఉన్న పరిచయాలు - మామూళ్ల పంపకాల మూలంగా ఉన్నత స్థాయిలో అధికారులను మేనేజ్ చేసుకొని మళ్లీ మీ సేవ కేంద్రాన్ని పొందాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. అప్పటికే తనకున్న పరిచయాలతో వి-3 మనీ సర్క్యులేషన్ స్కీంలో పలువురిని చేర్పించి రూ. 80లక్షల దాకా కట్టించాడు. చివరకు మనీ సర్క్యులేషన్ స్కీం బోర్డు తిప్పేయడంతో బాధితులకు తిరిగి సొమ్ము చెల్లిస్తానని నమ్మబలికి వివిధ అక్రమాలకు తెరలేపాడు. ఈ మనీ సర్క్యులేషన్ వ్యవహారంలో అప్పటి పోలీస్ అధికారులను సైతం మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. రచ్చబండ కార్యక్రమం కింద చేపట్టిన కార్డుల పంపిణిలో రేషన్ డీలర్లకు మళ్లీ షఫియే వరమయ్యాడు. చివరకు బోగస్ రేషన్‌కార్డులకు ఇతర ప్రాంతాల్లోని వ్యక్తుల ఆధార్‌కార్డుల నెంబర్లు ఫీడ్ చేస్తూ డీలర్లతో ఆమ్యామ్యాలు జరిపినట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు అందింది. తాజాగా బిర్లా సన్‌లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో తాను ఏజెంట్‌గా పని చేస్తూ ఏకంగా కంపెనీ సొమ్మును దిగమింగడంలో షఫీ కీలక పాత్ర పోషించాడు. తాను నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రాన్ని ఆసరాగా చేసుకొని బిర్లా సన్ లైఫ్‌లో చేరిన ఫారూక్ అనే వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి, అతడి భార్య ఆధార్‌కార్డును మీ సేవ ద్వారా డౌన్లోడ్ చేసి కర్నూలులోని ఓ బ్యాంకులో వేరే స్త్రీతో అకౌంట్ తెరవడం, బీమా సొమ్ము స్వాహా చేయడం వరకు షఫీ పాత్రే కీలకమని ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు నిగ్గు తేల్చి కటకటాల్లోకి పంపారు. అయితే ఫారూక్ మృతి చెందినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చింది ఓ గ్రామ వీఆర్వో అని, ఈ బీమా సొమ్ము గోల్‌మాల్‌లో ప్రస్తుత కంపెనీ ప్రతినిధుల పాత్ర కీలకమన్న కోణాలపై పోలీసు దర్యాప్తు జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన ఫారూక్ ఒక్కడే కాదు.. బిర్లా కంపెనీలో బీమా చేసిన పలువురిని చనిపోయినట్లు సృష్టించి కోట్లలో కంపెనీ సొమ్ము ఆరగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో బాధితుడు ఫారూక్ ఏకంగా బిర్లా కంపెనీపైనే పరువు నష్ట దావా వేయడం, కేసును సీఐడీకి అప్పగించాలని కోరడం జరిగింది. మున్ముందు పోలీసుల దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మీ సేవ కేంద్రాన్ని మంచి కోసం కాకుండా వక్రమార్గంలో ఉపయోగించుకుని ఊచలెక్కిస్తున్న షఫీ ఉదంతం ఇతరులకు కనువిప్పు కావాలని పోలీసులు, విజ్ఞులు పేర్కొంటున్నారు. రెవెన్యూ అధికారులు మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఏరివేతలో కలిపిమేత!
సాక్షి, కర్నూలు : బోగస్ ఏరివేతకు ప్రధాన అస్త్రమని ప్రభుత్వం భావించిన ఆధార్ అనుసంధానంలోనూ ఉన్న చిన్నపాటి లోపాన్ని కొందరు డీలర్లు, బోగస్ లబ్ధిదారులు అనుకూలంగా మలుచుకున్నారు. బోగస్ లబ్ధిదారులకు ఆధార్ నమోదు సంఖ్య (ఈఐడీ)లు వేసి కొన్నాళ్లపాటు కొనసాగేలా చేసుకున్నారు. ఆధార్ అనుసంధానం వరకు జిల్లాలో 11,47,030 లక్షల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్న విషయం విదితమే. 2011 జనాభా లెక్కలు ప్రకారం 10,18,617 కుటుంబాలు మాత్రమే ఉండడంతో బోగస్‌కార్డులు ఉన్నట్లు తేలతెల్లమైంది. ఆధార్ అనుసంధానం ద్వారా బోగస్ కార్డులు ఏరివేతకు ప్రభుత్వం యోచించింది. ఈ క్రమంలో ఆధార్ సంఖ్యలు ఇవ్వని లబ్ధిదారులు, కార్డుల వివరాలు తొలగిస్తామని జిల్లా అధికారులు ఇంతకుముందే ప్రకటించారు. విశిష్ణ ప్రాధికార సంస్థ జారీచేసిన ఏకీకృత గుర్తింపు సంఖ్య(యూఐడీ) లేకపోయినా నమోదు చేసుకున్నప్పుడు ఇచ్చిన ఈఐడీ ఇచ్చినా సరిపోతుందని అధికారులు చెప్పడంతో బోగస్ లబ్ధిదారులకు, వారి పేరుతో కార్డులు అనుభవిస్తున్న చౌకధరల దుకాణాల డీలర్లకు అవకాశం కలిగింది. కొందరు బోగస్ లబ్ధిదారులకు ఈఐడీలు అనుసంధానం చేసి కార్డులు కొనసాగేలా చేశారు. ఎలా చేశారంటే..? జిల్లా వ్యాప్తంగా పలు బోగస్ కార్డులు, పలువురు బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, బనగానపల్లె, డోన్, బేతంచర్ల, ప్యాపిలి, కోడుమూరు, తదితర పట్టణాలతోపాటు చిన్న పట్టణాల్లో వీరి సంఖ్య ఎక్కువగా, మిగతాచోట్ల తక్కువగా ఉన్నాయి. బయోమెట్రిక్ కార్డులు, ఆ తర్వాత రచ్చబండ సందర్భంగా కార్డులిచ్చినప్పుడు స్థానికంగా లేనివారి పేర్లపై కొందరు డీలర్లు కార్డులు తీసుకున్నారు. ఇతర జిల్లాల్లో ఉన్నవారి పేరున ఫొటోలు దిగి కార్డులు రాయించారు. జిల్లాలో ఉన్న పాత లబ్ధిదారుల పేరున కూడా రచ్చబండలో తాత్కాలికంగా కార్డులు పొందారు. ఆధార్ సంఖ్య అనుసంధానం చేసినప్పుడు ఒక వ్యక్తి దేశంలో ఎక్కడ ఉన్నా, ఎన్ని కార్డుల్లో ఉన్నా తెలిసిపోతుంది. ముందు ఒరిజినల్ కార్డుకు ఆధార్ సంఖ్య ఇచ్చినవారు తర్వాత బోగస్ కార్డుకు ఈఐడీ ఇచ్చారు. ఒకసారి ఆధార్ తీసుకున్న తర్వాత యూఐడీ ఒకేసారి వస్తుంది. ఈలోగా ఎన్నిసార్లయినా నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఈఐడీ వస్తుంది. ఇలా వచ్చిన ఈఐడీ ఇవ్వడం ద్వారా బోగస్ లబ్ధిదారులు చలామణిలో ఉండిపోయారు. 1.50 లక్షల బోగస్ కార్డులు..: జిల్లా వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల బోగస్ కార్డులు ఉన్నట్లు అంచనా. 6,77,685 మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆధార్ అనుసంధానంలో తిరస్కరించారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ లో బోగస్ కార్డుల బాగోతం వెలుగులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కొందరు రేషన్‌డీలర్లు కుమ్మక్కై ఈ బోగస్ కార్డుల ద్వారా సబ్సిడీ సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ప్రతి నెలా 6.77 లక్షల కిలోల బియ్యం, 3 లక్షల లీటర్ల కిరోసిన్, 3.35 కిలోల చక్కెర, గోధుమలు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఉన్నదెందరు:జిల్లాలో ఈఐడీ ఇచ్చిన లబ్ధిదారులు 4,73,033 మంది ఉన్నారు. వీరంతా ఈఐడీ ఇచ్చి నెలలు గడుస్తోంది. అంటే ఇప్పటికే యూఐడీ జారీ చేసే ఉంటారు. వారు నేరుగా ఆ సంఖ్య సమర్పించి అనుసంధానం చేసుకోవాలి. అలా చే యడం లేదు. ఆ నంబరు ఇవ్వకపోవడం వెనుక పదేపదే నమోదు చేయించుకున్న సందర్భాల్లో యూఐడీ రాదని తెలి యడం ఒక కారణంగా తెలుస్తోంది. ఇలా సుమారు లక్షన్నర మంది వరకు ఉండొచ్చని అంచనా. ఈ విషయం ప్రభుత్వం కూడా అనుమానించింది. అందుకే ఈ నెల 15వ తేదీలోగా ఈఐడీ ఇచ్చినవారి నుంచి యూఐడీ తెప్పించాలని అధికారులను ఆదేశించింది.అప్పటికి ఎవరైనా ఇవ్వకుండాఉంటే వారి ని బోగస్‌గా గుర్తించి తొలగించే అవకాశముంది. ఈ విష యం పౌరసరఫరాల అధికారి కూడా స్పష్టం చేశారు. ఈ దిశ గా సీఎస్‌డీటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరో 10 రోజుల్లో బోగస్‌ల విషయం తేలనుందని చెప్పవచ్చు.