అక్రమాలతో పరుగు | Irregularities in the running | Sakshi
Sakshi News home page

అక్రమాలతో పరుగు

Published Sat, Mar 14 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

Irregularities in the running

ఎమ్మిగనూరు : అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం.. అక్రమాలను కప్పి పుచ్చే అధికార యంత్రాంగం అండదండలు ఆ యువకుడిని వక్ర మార్గంలో నడిపించాయి. మీ సేవ ముసుగులో అక్రమాలతో పరుగులు తీసి చివరకు కటకటాల పాలయ్యాడు. నాడు బోగస్ కార్డుల సృష్టిలో డీలర్లకు వరమయ్యాడు.. నేడు బీమా సొమ్ము స్వాహాకు కంపెనీ ప్రతినిధులకు కీలకంగా మారి కటకటాల పాలైన మీ-సేవ షఫి ఉదంతమిది. వివరాల్లోకి వెళితే..


 ఎమ్మిగనూరుకు చెందిన షఫీ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులకు తలలో నాలుకగా మారాడు. అధికారులతో ఉన్న చనువుతో అతడికి మీ సేవ కేంద్రం మంజూరైంది. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పూర్తయినా ఎమ్మిగనూరులోని ఈ కేంద్రం నుంచి వేలకు వేలు బోగస్‌కార్డులు సృష్టించాడు.
 
 కార్డుకు రూ. 500ల నుంచి రూ. 1000 చెల్లించి బోగస్‌కార్డులను రేషన్ డీలర్లే తయారు చేయిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి డీఎస్‌ఓ (జిల్లా పౌర సరఫరాల అధికారి) వెంకటేశ్వర్లు ఎమ్మిగనూరులో షఫీ నడుపుతున్న మీ సేవ కేంద్రంపై దాడి చేసి హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని డీపీఎల్ కేంద్రాల నుంచి రేషన్‌కార్డుల సమాచారం ఉన్న బ్యాక్‌అప్‌ను జిల్లా అధికారులకు అందించాల్సి ఉండగా షఫీ తన వద్దే ఉంచుకొని బోగస్‌కార్డుల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. అయితే రెవెన్యూ అధికారులతో ఉన్న పరిచయాలు - మామూళ్ల పంపకాల మూలంగా ఉన్నత స్థాయిలో అధికారులను మేనేజ్ చేసుకొని మళ్లీ మీ సేవ కేంద్రాన్ని పొందాడు. అయినా అతనిలో మార్పు రాలేదు.
 
  అప్పటికే తనకున్న పరిచయాలతో వి-3 మనీ సర్క్యులేషన్ స్కీంలో పలువురిని చేర్పించి రూ. 80లక్షల దాకా కట్టించాడు. చివరకు మనీ సర్క్యులేషన్ స్కీం బోర్డు తిప్పేయడంతో బాధితులకు తిరిగి సొమ్ము చెల్లిస్తానని నమ్మబలికి వివిధ అక్రమాలకు తెరలేపాడు. ఈ మనీ సర్క్యులేషన్ వ్యవహారంలో అప్పటి పోలీస్ అధికారులను సైతం మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. రచ్చబండ కార్యక్రమం కింద చేపట్టిన కార్డుల పంపిణిలో రేషన్ డీలర్లకు మళ్లీ షఫియే వరమయ్యాడు. చివరకు బోగస్ రేషన్‌కార్డులకు ఇతర ప్రాంతాల్లోని వ్యక్తుల ఆధార్‌కార్డుల నెంబర్లు ఫీడ్ చేస్తూ డీలర్లతో ఆమ్యామ్యాలు జరిపినట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు అందింది. తాజాగా బిర్లా సన్‌లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో తాను ఏజెంట్‌గా పని చేస్తూ ఏకంగా కంపెనీ సొమ్మును దిగమింగడంలో షఫీ కీలక పాత్ర పోషించాడు.
 
  తాను నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రాన్ని ఆసరాగా చేసుకొని బిర్లా సన్ లైఫ్‌లో చేరిన ఫారూక్ అనే వ్యక్తిని చనిపోయినట్లు సృష్టించి, అతడి భార్య ఆధార్‌కార్డును మీ సేవ ద్వారా డౌన్‌లోడ్ చేసి కర్నూలులోని ఓ బ్యాంకులో వేరే స్త్రీతో అకౌంట్ తెరవడం, బీమా సొమ్ము స్వాహా చేయడం వరకు షఫీ పాత్రే కీలకమని ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు నిగ్గు తేల్చి కటకటాల్లోకి పంపారు. అయితే ఫారూక్ మృతి చెందినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చింది ఓ గ్రామ వీఆర్వో అని, ఈ బీమా సొమ్ము గోల్‌మాల్‌లో ప్రస్తుత కంపెనీ ప్రతినిధుల పాత్ర కీలకమన్న కోణాలపై పోలీసు దర్యాప్తు జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన ఫారూక్ ఒక్కడే కాదు.. బిర్లా కంపెనీలో బీమా చేసిన పలువురిని చనిపోయినట్లు సృష్టించి కోట్లలో కంపెనీ సొమ్ము ఆరగించినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 ఈ వ్యవహారంలో బాధితుడు ఫారూక్ ఏకంగా బిర్లా కంపెనీపైనే పరువు నష్ట దావా వేయడం, కేసును సీఐడీకి అప్పగించాలని కోరడం జరిగింది. మున్ముందు పోలీసుల దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మీ సేవ కేంద్రాన్ని మంచి కోసం కాకుండా వక్రమార్గంలో ఉపయోగించుకుని ఊచలెక్కిస్తున్న షఫీ ఉదంతం ఇతరులకు కనువిప్పు కావాలని పోలీసులు, విజ్ఞులు పేర్కొంటున్నారు. రెవెన్యూ అధికారులు మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement