
పండుగ పూట పరేషన్
సర్కారీ రేషన్‌తో సంక్రాంతి పండుగకు సకినాలు, కారపప్పలు, పిండివంటలు చేసుకుందామని ఆశపడ్డ పేదలకు ఈసారి నిరాశే ఎదురైంది. పండుగనాడు అదనపు కోటా ఇస్తారని భావించి వెళితే... ‘రెగ్యులర్ కోటాలోని వస్తువుల కే దిక్కులేదు, ఇక పండుగ కోటా ఎక్కడిదంటూ’ రేషన్ డీలర్ల నుంచి వస్తున్న సమాధానంతో ప్రజలు బిక్కముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త రాష్ట్రం, కొత్త ఏడాదిలో జరిగే తొలి పండుగను సంతోషంగా చేసుకుందామని భావించిన ప్రజలకు సర్కారు వారి రేషన్ కోతలు షాకునిచ్చాయి. కేవలం బియ్యం, అరకిలో చక్కెర మాత్రమే రేషన్ డీలర్ల వద్ద ఉండటంతో వాటితోనే సరిపెట్టుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్
కొత్త వాటికి దిక్కులేదు... పాత కార్డులు పనికిరావు
జిల్లాలో మొత్తం 9,92,457 రేషన్ కార్డులున్నాయి. వీటిలో 1347 అన్నపూర్ణ, 1,39,836 అంత్యోదయ, 6,823 ఆర్‌ఏపీ-2, 8,44,451 తెల్లకార్డులున్నాయి. ఈసారి రేషన్‌కార్డుల ఆధారంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. రేషన్‌కార్డులు రద్దయినందున వాటి స్థానంలో ప్రవేశపెట్టిన ఆహారభద్రత కార్డుల ఆధారంగానే సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి.
అయితే ఆహారభద్రత కార్డుల జారీ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా పూర్తి కాలేదు. చాలాచోట్ల ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వేలాది మందికి నేటికీ ఆహారభద్రత కార్డులు అందలేదు. దీంతో ప్రజలు రేషన్ కార్డులు తీసుకుని చౌక దుకాణాల వద్దక వెళుతున్నారు. ఆహారభద్రత కార్డులుంటేనే రేషన్ ఇస్తామని డీలర్లు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఆందోళన పడుతున్నారు.
మరోవైపు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రం రేషన్‌కార్డుల ఆధారంగానే సరకులు పంపిణీ చేయాలని ఆయా ప్రాంతాల్లోని డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ ప్రాంతాల్లో ఆహారభద్రత కార్డుల ప్రక్రియ పూర్తిస్థాయిలో కానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారభద్రత కార్డులు తమకు అందనందున రేషన్ కార్డులపైనే సరుకులు ఇవ్వాలని ప్రజలు ఒత్తిడి తెస్తుండటంతో రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినప్పటికీ అక్కడినుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో అయోమయంలో పడ్డారు.
రెండింటితోనే సరి..
మరోవైపు జనవరి కోటాకింద జిల్లాలోని రేషన్ దుకణాలన్నింటికీ ఈసారి బియ్యం, చక్కెర మాత్రమే సరఫరా అయ్యాయి. కిరోసిన్ పంపిణీ చేశామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నా రేషన్ దుకాణాల్లో వాటి జాడ కన్పించడం లేదు. పామోలిన్ అయితే గత ఆరేడు నెలలుగా పంపిణీ చేయడం లేదు. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే పామోలిన్ పంపిణీని నిలిపివేశామని అధికారులు చెబుతున్నారు.
గోధుమలు, గోధుమపిండి, ఉప్పు వంటి వస్తువులు కూడా రేషన్ దుకాణాల్లో ఇవ్వడం లేదని ప్రజలు చెబుతుండగా, ఆయా వస్తువులకు సంబంధించిన స్టాకు సిద్ధంగా ఉందని అధికారులు వివరణ ఇస్తున్నారు. అయితే ఈ వస్తువులకు సంబంధించి నాణ్యత లేకపోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు.
ఇక అమ్మహస్తం కింద గత కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేసిన తొమ్మిది వస్తువులను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. వాస్తవానికి పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పాత రేషన్‌కు తోడు పండుగ నజరానాగా నెయ్యి, శనగలు, బెల్లం, పామోలిన్ వంటి ఆరు వస్తువులను ఆదనంగా అందజేసే పనిలో పడింది. తెలంగాణలో మాత్రం ఉన్న వాటికే కత్తెర వేస్తోందని రేషన్ డీలర్లు, ప్రజలు వాపోతున్నారు.
15 శాతం కోటా కట్
జనవరి నెలలో రేషన్ డీలర్లకు 10 నుంచి 15 శాతం మేరకు సరుకుల్లో విధించారు. ఆహారభద్రత కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఆ మేరకు బియ్యం, చక్కెర వంటి సరుకుల్లో కోత విధించినట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి రేషన్ దుకాణంలో ప్రతినెలా పంపుతున్న బియ్యం కోటాతో పోలిస్తే ఈసారి సుమారు 15 క్వింటాళ్ల బియ్యాన్ని తక్కువగా పంపినట్లు కరీంనగర్ పట్టణానికి చెందిన రేషన్ డీలర్ ఒకరు పేర్కొన్నారు.
హాలో.. మీకు పండుగ సరుకులు అందాయా?
జనవరిలో పాత కోటాకే కోతలు విధిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి రేషన్ డీలర్లకు విచిత్రమైన ఫోన్లు వస్తున్నాయి. బుధవారం నగరంలోని ఓ రేషన్ డీలర్‌కు 8333999999 అనే టోల్‌ఫ్రీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఁఈనెల మీకు బెల్లం, నెయ్యి, కొబ్బరి, చక్కెర, శెనగలు, పామోలిన్ అదనంగా పంపాం. అవి మీకు చేరినట్లయితే 9 బటన్ నొక్కండి. అందనట్లయితే 6 బటన్ నొక్కండి* అనే సమాధానం అక్కడినుంచి వచ్చింది.
దీంతో విస్తుపోయిన సదరు డీలర్ మిగిలిన డీలర్లకు ఫోన్లు చేసి మీకేమైనా పండుగ కోటా వచ్చిందా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. వాళ్లకు సైతం ఈ మేరకు ఫోన్లు రావడంతో కొందరు డీలర్లు అధికారులకు ఫోన్లు చేసి విషయం అడిగి తెలుసుకునే పడ్డారు. జిల్లా పౌరసఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పండుగ కోటా ఏమీ ఇవ్వలేదని, ఆ నెంబర్ ఏపీ ప్రభుత్వానిదై ఉంటుందని వివరణ ఇచ్చారు.
అందరికీ రేషన్ ఇస్తున్నాం : డీఎస్‌వో చంద్రప్రకాష్
జిల్లాలో ఆహారభద్రత కార్డులున్న ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్ తెలిపారు. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో ఆహారభద్రత కార్డుల ప్రక్రియ పూర్తి కానందున అక్కడ మాత్రం రేషన్‌కార్డుల ఆధారంగానే సరకులు పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించామన్నారు.
జిల్లాలో 9,92,457 రేషన్‌కార్డులుండగా, వాటి స్థానంలో ఆహార భద్రతాకార్డులను ప్రవేశపెట్టామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 9.45 ల క్షల ఆహారభద్రత కార్డులను పంపిణీ చేశామని, ఈ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందన్నారు. ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిర్ణీత గడువు లేదని, నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఉన్న సంవత్సర ఆదాయ పరిమితిని పెంచినందున రేషన్‌కార్డులతో పోలిస్తే అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఆహారభద్రత కార్డులు పంపిణీ చేసే అవకాశాలున్నారు. పండుగ కోటా అంశాన్ని ప్రస్తావించగా... ఈ ఏడాది పండుగ కోటా ఇవ్వని మాట వాస్తవమేనన్నారు. అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత లేనందున ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. అయితే పేదలకు నాణ్యతతో కూడిన మరిన్ని వస్తువులు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.