BOI
-
కెనరాబ్యాంక్, బీఓబీ, బీఓఐలకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. బీఓబీ: సంజయ్ చంద్ర ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్ చంద్ర బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎస్ జయకుమార్ స్థానంలో సంజయ్ చంద్ర నియామకం జరిగింది. బీఓఐ: బ్యాంక్ ఎండీ సీఈఓగా అతనూ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం దాస్ ఇదే బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ కుర్చీ గత ఏడాది జూలై నుంచీ భర్తీకాలేదు. కెనరా బ్యాంక్: లింగమ్ వెంకట్ ప్రభాకర్ ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రభాకర్ పీఎన్బీలో ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెలాఖరున రిటైర్ కానున్న ఆర్ఏ శంకర్ నారాయణన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. -
మరో భారీ ప్రభుత్వ బ్యాంకు!!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పెద్దవిగా, బలమైనవిగా తీర్చిదిద్దాలన్న ఆశయం కొనసాగుతోంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకుల విలీనం అనంతరం... మరో భారీ విలీనానికి కసరత్తు మొదలైనట్టు తెలియవచ్చింది. తదుపరి విలీనం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి దశ విలీనంలో భాగంగా ఈ మూడు బ్యాంకులకు ప్రభుత్వం నుంచి త్వరలో ఆహ్వానాలు అందనున్నట్టు ఆర్థిక శాఖ అధికారి వెల్లడించారు. ‘‘ఎక్కువ సమయం వేచి చూడాలనుకోవడం లేదు. బ్యాంకులు ఆప్షన్లను పేర్కొనలేకపోతే, ప్రత్యామ్నాయ యంత్రాంగమే తగిన సూచనలు చేస్తుంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఓ విలీనం ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. అయితే, ఈ విలీనం మూడు పార్టీలతో కలసి ఉండకపోవచ్చన్నారు. ఎన్నో కలయికలను పరిశీలిస్తున్నామని, మొదటి రెండు త్రైమాసికాల్లో ఈ పెద్ద బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు మరింత స్థిరపడతాయని భావిస్తున్నట్టు చెప్పారు. విజయా, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీన ప్రక్రియ గతేడాది అక్టోబర్‌లో ఆరంభమైన విషయం గమనార్హం. విలీన ప్రక్రియ ముగిసి గత నెల 1 నుంచి ఒకే బ్యాంకుగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇది మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. సరైన సమయం కాదు... అయితే, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో మరో విలీనానికి ఇది సమయం కాదని కొందరు ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆర్బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధి (పీసీఏ) నుంచి బయటకు వచ్చిందని, పీఎన్బీ, యూబీఐ రికవరీ దశలో ఉన్నాయని పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ పీసీఏ నుంచి బయపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రతీ సమస్యకు విలీనం పరిష్కారం కాదని, మరింత పెద్దవి, విఫల నిర్మాణాలను సృష్టించడానికంటే ముందు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్న అభిప్రాయాన్ని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యక్తంచేశారు. -
మరో బ్యాంకింగ్ మెర్జర్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు చెప్పారు. కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. -
బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీనం..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటరు సమకూర్చాల్సిన అదనపు మూలధనం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విలీన బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో విలీన బ్యాంకు దేశీయంగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత మూడో స్థానంలో ఉండనుంది. -
బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి కుదేలు
సాక్షి, ముంబై: బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 ఫలితాల్లో మరోసారి చతికిలబడింది. విశ్లేషకులు అంచనాలను దరిదాపుల్లోకి కూడా రాలేక భారీ నష్టాలను చవి చూసింది. గత ఏడాది నష్టాలకు కొనసాగింపుగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.3969 కోట్ల భారీ నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది1045కోట్ల రూపాయల నష్టాలను సాధించింది. కాగా 1187కోట్ల రూపాయల నష్టాలను రిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. బ్యాడ్ లోన్ల బెడద బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారీగా దెబ్బ తీసింది. స్థూల ఎన్పీఏలు మార్చి చివరి నాటికి 16.58 శాతంగా నమోదయ్యాయి, అంతకు ముందు త్రైమాసికంలో 16.93శాతంగా ఉండగా , ఏడాది క్రితం ఇది 13.22శాతంగా ఉన్నాయి. బ్యాడ్ లోన్ల కేటాయింపులు 41 శాతం పెరిగి రూ .6,674 కోట్లకు చేరుకున్నాయి. -
రుణ రేట్లను సవరించిన నాలుగు బ్యాంక్‌లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాయి. రెపో తగ్గిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను 9-9.35% రేంజ్లో నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. 3 నెలల కాలానికి 9.2 శాతం,ఆరు నెలల కాలానికి 9.25 శాతం, ఏడాది కాలానికి 9.35 శాతంగా ఎంసీఎల్ఆర్ను నిర్ణయించామని వివరించింది. ఇక సిండికేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ను 9.3-9.45 శాతంగా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల ఏడు నుంచి వర్తిస్తాయని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంసీఎల్ఆర్ 9.05-9.6% రేంజ్లో ఉంది. ఇది ఈ నెల 1 నుంచే వర్తిస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ ఎంసీఎల్ఆర్ 9.3-9.75% రేంజ్లో ఉంది. ఈ నెల 5 నుంచి ఇది వర్తిస్తుంది. -
బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు
ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కల్పిస్తోంది. ఇందుకోసం ‘మై ఐటీ రిటర్న్ డాట్ కామ్’ అనే సంస్థతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేకుండా ఉద్యోగులు, ఖాతాదారులు ఈ వెబ్సైట్ ద్వారా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బీవోఐ జీఎం ఎస్ఆర్ మీనా తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ట్యాక్స్ కాలిక్యులేషన్, ట్యాక్స్ స్టేటస్, రిటర్నులు వంటి సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా కూడా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.