న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పెద్దవిగా, బలమైనవిగా తీర్చిదిద్దాలన్న ఆశయం కొనసాగుతోంది. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకుల విలీనం అనంతరం... మరో భారీ విలీనానికి కసరత్తు మొదలైనట్టు తెలియవచ్చింది. తదుపరి విలీనం పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి దశ విలీనంలో భాగంగా ఈ మూడు బ్యాంకులకు ప్రభుత్వం నుంచి త్వరలో ఆహ్వానాలు అందనున్నట్టు ఆర్థిక శాఖ అధికారి వెల్లడించారు. ‘‘ఎక్కువ సమయం వేచి చూడాలనుకోవడం లేదు. బ్యాంకులు ఆప్షన్లను పేర్కొనలేకపోతే, ప్రత్యామ్నాయ యంత్రాంగమే తగిన సూచనలు చేస్తుంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఓ విలీనం ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు. అయితే, ఈ విలీనం మూడు పార్టీలతో కలసి ఉండకపోవచ్చన్నారు. ఎన్నో కలయికలను పరిశీలిస్తున్నామని, మొదటి రెండు త్రైమాసికాల్లో ఈ పెద్ద బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు మరింత స్థిరపడతాయని భావిస్తున్నట్టు చెప్పారు. విజయా, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీన ప్రక్రియ గతేడాది అక్టోబర్‌లో ఆరంభమైన విషయం గమనార్హం. విలీన ప్రక్రియ ముగిసి గత నెల 1 నుంచి ఒకే బ్యాంకుగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇది మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది.
సరైన సమయం కాదు...
అయితే, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో మరో విలీనానికి ఇది సమయం కాదని కొందరు ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆర్‌బీఐ దిద్దుబాటు కార్యాచరణ పరిధి (పీసీఏ) నుంచి బయటకు వచ్చిందని, పీఎన్‌బీ, యూబీఐ రికవరీ దశలో ఉన్నాయని పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ పీసీఏ నుంచి బయపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రతీ సమస్యకు విలీనం పరిష్కారం కాదని, మరింత పెద్దవి, విఫల నిర్మాణాలను సృష్టించడానికంటే ముందు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్న అభిప్రాయాన్ని ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వ్యక్తంచేశారు.
మరో భారీ ప్రభుత్వ బ్యాంకు!!
Published Wed, May 1 2019 12:25 AM | Last Updated on Wed, May 1 2019 12:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment