‘పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఆశలు అడియాశలు అయి.. దిక్కుతోచని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంట్ కోతలతో ఆత్యహత్యలు, వలసలకు ఆలవాలమైన తెలంగాణ.. ఇగ ఎక్కడైతది తెలంగాణ అని ఆనాడు అన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. ఆయన ఇవాళ కరీంనరగర్లో నిర్వహించిన కదనభేరి బహిరంగసభలో మాట్లాడారు. దిశదశ లేకుండా.. అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్న తెలంగాణ కోసం.. హైదరాబాద్‌లోని జల దృశ్యం నుంచి ఆనాడు పిడికెడు మందితో జైతెలంగాణ అని బయలుదేరానని చెప్పారు.
‘బ్రహ్మాండమైన చైతన్యవంతమైన ప్రజలు ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా.. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభించాలని భావించా. ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి మే 17న తెలంగాణ ఉద్యమం కోసం నమ్మి వస్తే.. ఆనాడు తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ.. ఈ కరీంనగర్ గడ్డ. ఆనాడు ఎంపి పదవి విసిరికొట్టి రారా నాకొడకా అంటూ కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చాను. ఉద్యమాన్ని ఉదృతం చేశాను. మొన్న మీరు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారు. ఆరు చందమామలను చూపెట్టాడు. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నాడు ఓ మంత్రి. రైతుల చెప్పులు బందోబస్తుగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి స్థాయి లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడుతా. ఉద్యమ సమయంలో మాట్లాడిన నేను.. అంతే తప్ప ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడలేదు. లంకె బిందెల కోసం వచ్చాను అని నేను ఏనాడైన అన్నమా?. మాతో పోటీ పడేలా పాలన చెయ్, కానీ చేరుతాం, బొంద పెడతాం అంటావా.
... అహోరాత్రులు కష్టపడి ఆలోచన చేసి 2014 నుంచి 19 వరకు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాను. మిషన్ భగీరథ నడిపే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?. రెప్ప పాటు కూడా కరెంట్ కూడా పోకుండా ఇచ్చాను. మేము అమలు చేసిన పథకాలు సక్కగా అమలు చేసే దమ్ము లేదా?. కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. లేదంటే పథకాలు అడిగితే నిజంగానే చెప్పుతో కొడతారు’ అని కేసీఆర్ అన్నారు
కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చినా. ఈ చవట దద్దమ్మలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా మేము అభివృద్ధిపై పోరాడుతాం. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?. ఐదు రూపాయల పని చేయని బండి సంజయ్ కి ఎందుకు ఓటెయ్యాలి?. బండి సంజయ్‌కి, వినోద్‌కి మధ్య అసలు పోలిక ఉందా?’ అని మండిపడ్డారు.
దయచేసి ఆలోచన చేయాలి
తెలంగాణాలో వ్యవసాయ స్థిరీకరణ చేయాలని ఆలోచించాం. చరణ్ సింగ్ లాంటి రైతుబిడ్డలు కూడా పెట్టని పథకాలు మనం రైతుల కోసం పెట్టుకున్నాం.ఈ విషయాలన్నీ కరీంనగర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్ గా మారిపోయింది. మేడిగడ్డలో చిన్న కాంపోనెంట్ లో ఏదో జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు.రెండు పిల్లర్లు కుంగితే భారతే మునిగిపోతున్నట్టు బొబ్బలు పెడుతున్నారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారు. గ్రామాల్లో మీరంతా చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం’ అని కేసీఆర్ తెలిపారు.
.. నేను సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం పొలం అయిన ఎండి పోయిందా?. ఇప్పుడేం రోగం వచ్చింది. నేను రెండు రోజుల్లో ఓ టీవీలో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి ఇంటింటికి చేరేలా చేస్తా. రెండు పిల్లర్లు మునిగిపోతే మొత్తం భారత దేశమే మునిగి పోయినట్టు చేస్తున్నారు’ అని కేసీఆర్ దుయ్యబట్టారు.