చస్తూ.. బతుకుతుండ్రు!
కొవ్వొత్తి తాను కరిగిపోతూ.. ఇతరుల జీవితాలకు వెలుగునిస్తుంది.. అచ్చం ఇలాగే వారు నిండా మునిగిపోయి.. లక్షలాది కుటుంబాలకు వెలుగునిచ్చారు.. ఇది గడిచి 36 ఏళ్లు అ వుతోంది.. కానీ నేటికీ వారి జీవితాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం, రెండు శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండిలేక.. కంటినిండా నిద్రపోక.. నేటికీ చస్తూ.. బతుకుతుండ్రు.. శ్రీశైలం ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన కొల్లాపూర్ మండల ం ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులు..
కొల్లాపూర్: సుమారు 36 ఏళ్ల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణా బ్యాక్‌వాటర్ చేరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 69 గ్రామాలు నీటమునిగా యి. అందులో కొల్లాపూర్ మండలంలోని మొగలొత్తు బొల్లారం ఒకటి. ప్రభుత్వం అన్ని గ్రామాలకు పునరావా సం కల్పించినట్టే.. బొల్లారానికి సైతం మొలచింతలపల్లి సమీపం లోని ఎర్రగట్టు వద్ద సర్వే నం.399 లో పునరావాసం కల్పించారు. ఎర్రగ ట్టు బొల్లారం అని పేరు పెట్టారు. మొత్తం 60 కుటుంబాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. గ్రామ సమీపంలోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా రు. ఆ తర్వాతే వారికి కష్టాలు మొదలయ్యా యి. ఈ గ్రామం రిజర్వు ఫారెస్టులో ఉందని, వెంటనే ఖాళీ చేయాలని అటవీశాఖ అధికారులు ఒత్తిళ్లు ప్రారంభించారు. గ్రామంలో శాశ్వత నిర్మాణాలను అడ్డుకుంటున్నారు.
అభివృద్ధి పనులకు అడ్డంకి..
ఎర్రగట్టు బొల్లారంలో 60 కుటుంబాలు నివసిస్తుండగా.. జనాభా 232 కాగా, ఓటర్ల సంఖ్య 160. ఈ గ్రామం ఎల్లూరుకు అనుబంధంగా ఉంది. గ్రామంలో 1997లో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి రూ.1.50 లక్షలు మంజూరయ్యా యి. పనుల ప్రారంభానికి అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో పూరిగుడిసెలోనే ప్రభుత్వ పాఠశాలను గత నాలుగేళ్ల క్రితం వరకూ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో ఉన్న పాఠశాలకు కూడా ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా.. ఆ పనులను సైతం అటవీ శాఖ అడ్డుకుంది. గ్రామంలో తాగునీటి ట్యాంకు మినహా మిగతా ఎలాంటి శాశ్వత భవనాలు, పక్కా ఇళ్లు, రోడ్ల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుచెబుతూ వస్తున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో గ్రామస్తులు బలవంతంగా 6 పక్కా ఇళ్లు నిర్మించుకోగా.. మిగతా వారంతా పూరి గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం.
అమలుకు నోచుకోని హామీలు
ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తుల సమస్యను పరిష్కరిస్తామని చాలామంది నాయకులు ప్రకటిస్తూ వచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారితోపాటు అప్పటి నాగర్‌కర్నూల్ ఎంపీ మంద జగన్నాథం పలు పర్యాయాలు గ్రామాన్ని సం దర్శించి.. గ్రామస్తుల ఇళ్లకు, భూములకు పట్టాలిప్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ వీరిలో ఏ ఒక్కరి హామీ కూడా అమలుకు నోచుకోలేదు.
సమన్వయ లోపమే శాపం..
గ్రామంలో అభివృద్ధి, రైతుల పొలాల్లో వ్యవసాయ పనులను అడ్డుకోవడం ఇక్కడి అటవీ అధికారులకు సర్వసాధారణం. అధికారులు అడ్డుకున్న ప్రతిసారి గ్రామస్తులు వారితో గొడవలు పడడం, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లడం, వారు రెవెన్యూ అధికారులకు సమస్యను అప్పగించడం, అధికారులు గ్రామాన్ని సందర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్పి వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. సమస్య తలెత్తి మూడున్నర దశాబ్దాలు అవుతున్నా, నేటికీ దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. రెండు శాఖల అధికారులు ఈ భూమి తమదే అంటూ వాదించుకుంటున్నారు. సర్వే నం.399లో 200 ఎకరాలకు పైగా భూమిని ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులు సాగు చేసుకుంటుండగా.. మరో 40 ఎకరాలు మొలచింతలపల్లి రైతుల ఆధీనంలో ఉన్నాయి. మొలచింతలపల్లి రైతులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఎర్రగట్టు బొల్లారం గ్రామస్తులకు మాత్రం ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు.
డీ–రిజర్వ్ చేయాలని కోరాం..
ఎర్రగట్టు బొల్లారం అటవీ శాఖ పరిధిలో ఉందని వారు చెబుతున్నారు. 5 హెక్టార్లలోపు నివాస ప్రాంతాలు ఉంటే ఆ స్థలాన్ని డీ–రిజర్వ్ చేసే వెసులుబాటు ఆ శాఖకు ఉంది. గ్రామంలో నివాస ప్రాంతంలో దాదాపు 5 హెక్టార్ల పరిధిలోనే ఉన్నాయి. దీని కోసం ఆర్డీఓకు నివేదిక పంపాం. కలెక్టర్ ద్వారా అటవీశాఖకు ప్రతిపాదనలు వెళ్తాయి. అటవీశాఖ వారు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఉన్నత స్థాయిలో పరిష్కారం జరగాల్సి ఉంది. – సరస్వతి, తహసీల్దార్, కొల్లాపూర్
మా సమస్యను పట్టించుకోవాలే..
నిర్వాసితులమైన మాకు రెవెన్యూ అధికారులు ఎర్రగట్టు వద్ద పునరావాసం కల్పించారు. ఆ భూమి రిజర్వ్ ఫారెస్టులో ఉందంటూ ఫారెస్టు వాళ్లు అభ్యంతరం చెబుతున్నారు. ఊర్ల ఒక్క సర్కారు బిల్డింగ్ కట్టనివ్వరు. అధికారుల వల్లనే మాకు ఈ తిప్పలు. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది. – డి.వెంకటస్వామి, ఎర్రగట్టు బొల్లారం
ఉన్నతాధికారులు స్పందించాలి..
మా గ్రామంలోని నివాస గృహాలు, వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి. రెవెన్యూ అధికారులు మాకు పునరావాసంగా ఈ ప్రాంతాన్ని కాకుండా వేరే ప్రాంతం ఏర్పాటు చేసి ఉంటే మాకు ఈ సమస్య ఉండేది కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రభుత్వం అండగా ఉండాలి. – సుధాకర్, ఎర్రగట్టు బొల్లారం