దిగుడుబావిలో మొసలి : బంధించిన గ్రామస్తులు
పాన్‌గల్ (మహబూబ్‌నగర్) : చెరువులో మొసలి ఉందని ఆ గ్రామస్తులకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది. కానీ చెరువు ఎండినా అది మాత్రం కనిపించలేదు. అయితే పక్కనే ఉన్న బావిలో అనుకోకుండా మొసలి జాడ కనిపించటంతో నీటినంతా తోడి దానిని పట్టి బంధించి అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం బొల్లారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బొల్లారం గ్రామ సర్పంచి సత్యనారాయణరెడ్డి, వీఆర్‌వో శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని పెద్ద చెరువులో ఏడాది నుంచి మొసలి ఉంటోందనే విషయం గ్రామస్తులకు తెలిసింది. కాగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువు పూడిక తీస్తుండటంతో అందులో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడేశారు. అయితే ప్రమాదం పసిగట్టిన మొసలి అదను చూసుకుని సమీపంలోనే ఉన్న దిగుడు బావిలోకి జారుకుంది. కానీ ఆ విషయాన్ని గ్రామస్తులు గుర్తించలేదు.
గురువారం సాయంత్రం బావిలోకి దిగిన గొర్రెలు నీళ్లు తాగుతుండగా అందులో ఉన్న మొసలి ఒక గొర్రెను పట్టేసింది. దీంతో అక్కడ మొసలి ఉన్న విషయం గ్రామస్తులకు తెలిసిపోయింది. వెంటనే అంతా కలిసి మోటార్ల సాయంతో బావిలో నీటిని తోడేశారు. ఎటూ దారిలేక అందులోనే ఉండిపోయిన మొసలిని తాడుతో గట్టిగా కట్టేసి పంచాయతీ కార్యాలయంలో బంధించారు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు మొసలిని వేరే చోటుకు తరలించారు.