బీరప్ప మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్స్ వద్ద గుమిగూడిన గ్రామస్తులు
సాక్షి, మక్తల్ : కొడుకు మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఆ తల్లి గుండెపోటుతో మృత్యువాత పడిన సంఘటన మక్తల్ మండలం చందాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ బీరప్ప(35) రెండురోజుల క్రితం కిందపడటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ మరణ వార్త విన్న బీరప్ప తల్లి లక్ష్మమ్మ(75) కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. అయితే బీరప్పకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువచ్చి గ్రామ శివారులో కుటుంబసభ్యులు దూరంగా ఉండగా ఖననం చేశారు. ఇంటి దగ్గర తల్లి శవం ఉండగానే కొడుకుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు కాగా బీరప్ప పెద్దవాడు. బీరప్పకు భార్య నర్సమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చదవండి: మీ స్థాయి ఎంత.. మీ లెక్కెంత..?
నీటిసంపులో పడి బాలుడు..
పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): మండలంలోని పెద్ద కారుపాముల చెందిన కృష్ణయ్య, యాదమ్మ దంపతుల కుమారుడు సుశాంత్ (3) శనివారం ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడ్డాడు. కాగా చాలాసేపటి తర్వాత గుర్తించడంతో అప్పటికి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
చెరువులో మొసలి కలకలం
మాగనూర్ (మక్తల్): మండలంలోని అమ్మపల్లి పెద్ద చెరువులో మొసలి కలకలం సృష్టించింది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనుల కోసం చెరువు పక్కకు వెళ్తుండగా గట్టుపైకి మొసలి వస్తుందని రైతులు తెలిపారు. ఫారెస్టు అధికారులు వచ్చి మొసలిని వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment