జూరాల కాలువలో భారీ మొసలి
పెబ్బేరు: జూరాల ప్రధాన ఎడమ కాలువలో భారీ మొసలి స్థానికుల కంటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలానికి చెందిన తోమాలపల్లి గ్రామస్తులు దాన్ని గుర్తించి బంధించారు. కాలువకు నీటి విడుదల నిలిచిపోవడంతో గ్రామ యువకులు కొందరు చేపల వేటకు వెళ్లారు. కాలువ అంచున సుమారు 10 అడుగుల పొడవున్న మొసలి కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు.
అందరు గుమికూడి దాన్ని తాళ్లతో బంధించి గ్రామంలోని దేవాలయం వద్ద ఉన్న వేప చెట్టుకు కట్టేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వనపర్తి బీట్‌ఆఫీసర్లు నాగరాజు, రజనీకాంత్, శ్రీనివాసులు వచ్చి దాన్ని తీసుకెళ్లి జూరాల డ్యాంలో వదిలేశారు. వర్షాకాలంలో వచ్చిన నీటి ప్రవాహానికి మొసలి కాలువలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు తెలిపారు.