లోకేశ్ రోడ్‌షో ఘటనలో ఇరువర్గాలపై కేసులు
పెబ్బేరు: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరులో ఆదివారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ రోడ్ షోలో జరిగిన వివాదాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రోడ్‌షోలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు మామిడిపళ్లు, మద్యం బాటిళ్లను విసరగా ప్రతిగా టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ స్థానిక నేత కారును దహనం చేసిన సంగతి విదితమే. ఈ ఘటనకు బాధ్యులైన వారికోసం పోలీసులు దర్యాప్తు వేగంగా చేపట్టారు.
సుభాష్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరా విజువల్స్‌తోపాటు ఇతర ఆధారాలతో గొడవలకు బాధ్యులైన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. నారా లోకేష్ వాహనంపై మద్యం సీసాలు, వాటర్‌బాటిళ్లు, మామిడిపళ్లు విసిరిన సంఘటనలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎల్లారెడ్డి, శివసాయిలపై ఐపీసీ 324, రెడ్‌విత్ 511, 127 ఆర్పీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
దీంతోపాటు టీఆర్‌ఎస్ నేత పెద్ద ఎల్లారెడ్డి కారును దహనం చేసిన కేసులో టీడీపీ నేతలు, కార్యకర్తలు మొత్తం 17 మంది పై ఐపీసీ 147,341,323,435,351లతోపాటు రెడ్‌విత్149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. వీరిలో ఎం.రాజశేఖర్, రామక్రిష్ణ, రంగస్వామి, తిరుపతయ్యలను రిమాండ్‌కు పంపారు. మిగిలిన 13 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరారీలో ఉన్నారని వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక టీడీపీకి చెందిన టవేరా వాహనంపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలో ఆరుగురు టీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలపై ఐపీసీ 147,324,428,427, రెడ్‌విత్ 149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్ నాయకులు గౌని కోదండరామిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, బీరం రాజశేఖర్ రెడ్డి, చిన్న ఎల్లారెడ్డి, రంగి, పరంధాములును పోలీసులు కోర్టులో హాజరు పరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ చేశారు.