ఓట్ల లెక్కింపునకు రెడీ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును ఈనెల 13న చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మండలాల వారీగా సిబ్బందిని నియమించి ఓట్ల లెక్కింపుపై శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీసీటీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదిన నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని 35 మండలాల్లో, మహబూబ్‌నగర్ పరిధిలోని 29 మండలాల్లో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 78 శాతం పోలింగ్ నమోదుకాగా 64 జెడ్పీటీసీలకు 402 మంది, 982 ఎంపీటీసీ స్థానాలకు 3,498 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం ఈనెల 13న బహిర్గంతం కానుంది.
విధుల్లో 3,048 మంది సిబ్బంది
ఈనెల 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపునకు అధికారులు మూడు విభాగాలుగా సిబ్బందిని విభజించి 3048 మందిని ఎంపిక చేశారు. వీరికి ఆయా మండలాల్లో లెక్కింపుపై శిక్షణ కూడా ఇచ్చారు. వారిలో 615 సూపర్‌వైజర్లు, 1683 కౌంటింగ్ అసిస్టెంట్లు, 750 నాల్గో తరగతి ఉద్యోగులను ఎంపిక చేశారు. అలాగే 606 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్‌కు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు చేస్తారు. జిల్లాలో అధికంగా అడ్డాకుల మండలానికి 15 టేబుళ్లను కేటాయించారు.
లెక్కింపు ఇలా..
ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు కోసం ఆరు కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో బ్యాక్సు సీల్‌ను తీస్తారు. ఇలా తీసిన బ్యాక్సుల్లోని ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాజీ రంగు బ్యాలెట్‌లను వేరు చేస్తారు. వేరు చేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు 2 గంటల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కావచ్చు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడు రౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు వెయ్యి ఓట్లను లెక్క బె డుతారు. ప్రతి గంటలకు ఒక్క సారి ఓట్ల లెక్కింపు లెక్కను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఎంపీటీసీల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25 ఓట్లను ఒక్క బెండల్‌గా కట్టి ఓట్లను లెక్క పెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా అవ్వడమే కాకుండా త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.
బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో భద్రం
జిల్లాలోని ఆరు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో బాక్సులు భద్రంగా ఉన్నాయి. నా గర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోని మండలాల బ్యాలెట్ బాక్కులు నాగర్‌కర్నూల్‌లోని నవోదయ జూనియర్ కళాశాలలో, నారాయణపేట్ పరిధిలోని మండలాల్లోని బాక్కులు నారాయణపేట శ్రీదత్త కళాశాలలో, వనపర్తి పరిధిలోని బాక్సు లు కేడీఆర్ కాలేజీలో, గద్వాల పరిధిలోని బాక్సులు గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని బాక్కులు సీబీఎం డిగ్రీ కాలేజీ లో, మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని బాక్సులు ఎన్‌టీఆర్ మహిళా డిగ్రీ కా లేజీలో భద్రంగా ఉన్నాయి. కౌంటింగ్‌రోజు ఇటు అధికారులు అటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలుంటాయి.