‘డిపాజిట్లా’..చూద్దాం..!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: పురపాలక సంఘాలకు జరిగిన పోరులో అభ్యర్థులు చేసిన డిపాజిట్లకు సంబంధించి మొత్తాన్ని అందజేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నవారికి ఈ చెల్లింపులు జరగాల్సి ఉంది. తొలుత వెంటనే ఇచ్చేస్తామని చెప్పినా ఆ తర్వాత ఆ మాటే పక్కన పెట్టేశారు.అందరికీ నిబంధనలు అమలు పరిచే అధికారులే ఇలా చేస్తే ఎలా అని ఉపసంహరించుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా 95 మంది చెల్లింపులకోసం ఎదురుచూస్తున్నారు.
రూ.పదిలక్షలకు పైగా వసూళ్లు...
ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లోని 41వార్డులకు గాను వివిధ పక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు 462మంది డిపాజిట్లు చెల్లించి నామినేషన్లను దాఖలు చేశారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1250, జనరల్ అభ్యర్థులు 2,500 వంతున చెల్లించగా మున్సిపాలిటీకి రూ.10లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. వీరిలో ఉపసంహరణ రోజు మార్చి 18న 95మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకొని డిపాజిట్ల ఇవ్వాలని కోరగా తరువాత ఇస్తామని చెప్పి పంపించేశారు. ఇలా మున్సిపాల్టీ వద్ద రూ.2లక్షల వరకు డిపాజిట్ల మొత్తం పేరుకు పోయింది. చెల్లింపుల్లోనే జాప్యమవుతోంది.
కౌంటింగ్ అయ్యాక చెల్లింపులు: కమిషనర్
ఈనెల 12న ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తవుతోంది, ఆతరువాత ఉపసంహరించుకొన్న అభ్యర్థులంతా తమ రశీదులతో వస్తే వెంటనే వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని మున్సిపల్ కమిషనర్ అమరయ్య తెలిపారు. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా తిరిగి చెల్లించడం అలస్యమైందని, ఇక అలస్యం లేకుండా వారికి చెల్లిస్తామని వెల్లడించారు.