నిన్నటి వరకూ ఓ పాట్లు.ఇప్పుడు మరో రకం టెన్షన్. ‘సార్వత్రిక’ బరిలో నిలుచున్న అభ్యర్థుల బాధలివి.చేతికి ఎముక లేని చందాన సొమ్ము ఖర్చుచేసినా..ఫలితం వచ్చేసరికి ఏమవుతుందోనన్న బెంగ ఓ వైపు. ఎదుటి పక్షంవారిని చెండాడి ఓటర్లను ఔరా అనిపించినా అవి ఏమేరకు ఓట్లురాల్చాయో తెలీని స్థితి. అసలు ఓటరు అంతరంగమేమిటో తెలియక ‘నాడి’ కోసం వేడివేడి చర్చలు. కప్పుల కొద్దీ టీ గొంతులో పడుతున్నా..తేలని లెక్కలు. అనుచరులు చెప్పేదొకటి, ఆత్మీయులు పలికేదొకటి ఏదో తేల్చుకోలేక వర్రీ. మధ్యలో ప్రచార సామగ్రిని సమకూర్చిన వారితో చెల్లింపుల నస. అన్నింటినీ దిగమింగుకొని ధీర గంభీర ప్రెస్‌మీట్లు ఇదీ గురువారం పలు పక్షాల అభ్యర్థుల స్థితి. జాతకాలు తేలేవరకు వీడని ఉత్కంఠ.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ టికెట్ల వేట మొదలుకుని నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ ఘట్టాలతో అలసి సొలసిన అభ్యర్థులు ప్రస్తుతం గెలుపోటములు లెక్క వేసుకునే పనిలో పడ్డారు. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకున్న అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకున్నారు. గురువారం ఉదయం బూత్‌లు, గ్రామాల వారీగా ఓట్ల పోలింగ్ వివరాలు తెప్పించుకున్న అభ్యర్థులు తమకు అనుకూలంగా పోలైన ఓట్ల వివరాలపై ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు, మీడియా ద్వారా సమాచారం సేకరిస్తూ తమ విజయావకాశాలను భేరీజు వేసుకుంటున్నారు.
చాలా చోట్ల ఓటర్లు గుంభనంగా వ్యవహరిస్తుండటంతో ఓటరు నాడి అందక అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ప్రచారం, పోలింగ్ సందర్భంగా తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా పనిచేసిన కేడర్, లీడర్లపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల సందర్భంగా భారీగా ఖర్చు చేసిన అభ్యర్థులు వ్యయం చేసిన తీరును సమీక్షించుకుంటున్నారు. ప్రచార సామగ్రిని సమకూర్చిన వ్యక్తులు, సంస్థలు తమకు రావాల్సిన బకాయిల కోసం అభ్యర్థుల ఇళ్ల వద్ద క్యూలు కడుతున్నారు. విజయావకాశాలు స్పష్టంగా ఉన్న నేతలు సాధించబోయే మెజారిటీపై లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు ఓటముల నడుమ ఊగిసలాడుతున్న నాయకులు తమకు అనుకూల, ప్రతికూలంగా పనిచేసిన అంశాలను విశ్లేషించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపునకు మరో పక్షం రోజులు గడువు వుండటంతో కొందరు అభ్యర్థులు కుటుంబ సభ్యులతో గడిపేలా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు.
అందని ఓటరు నాడి
పోలింగ్ ముగిసి 24 గంటలు గడిచినా ఓటరు నాడి అందక అభ్యర్థులు అయోమయం ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, తెలంగాణ వాదం. మోడీ ప్రభావం తదితర అంశాలు ఎంత మేర పనిచేశాయనే అంశంపై అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు.జిల్లా లో తమ పార్టీ సాధించబోయే స్థానాలపై రాష్ట్ర స్థాయి నేతలు కూడా అటు ఇంటిలిజెన్స్, మీడి యా విశ్లేషణలపై లెక్కలు వేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ అభ్యర్థి భారీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వర్గ పోరు, అంతర్గత వెన్నుపోట్లపై కాంగ్రెస్, తెలంగాణ వాదం ఎంత మేర పనిచేసిందనే అంశంపై టీఆర్‌ఎస్ లెక్కలు వేసుకుంటున్నాయి.
టీడీపీ- బీజేపీ కూటమిలో విభేదాల నేపథ్యంలో రెండు పా ర్టీల ఓట్లు ఒకరికొకరు ఎంత మేర బదిలీ చేసుకున్నారనే అనుమానాలు రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీల నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే కూటమి ఓట్లు ఎంత మేర పోలయ్యా యో తెలియక తల పట్టుకుంటున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెడితే అభ్యర్థులు తమకే విజయావకాశాలు ఉన్నాయంటూ గురువారం ప్రెస్‌మీట్లు పెట్టి మేకపోతు గాంభీ ర్యాన్ని ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు పూర్త య్యే వరకు కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా వుండేందుకు అభ్యర్థులు ఆత్మ విశాస్వం ప్రోది చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒడ్డెక్కుతమా!?
Published Fri, May 2 2014 2:05 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement