కిడ్నాప్ మిస్టరీని చేధించిన పోలీసులు
= నలుగురి అరెస్ట్
= రూ.5 లక్షల నగదు, మారుతి కారు, పల్సర్‌వాహనం స్వాధీనం
బెంగళూరు(బనశంకరి) : బోల్ట్‌నట్ తయారీ కంపెనీ యజమాని కిడ్నాప్ ఉదంతాన్ని చేధించిన చెన్నమ్మకెర అచ్చుకట్టె పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5లక్షల నగదు, రెండు ఉంగరాలు, మారుతీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.డీసీపీ లోకేశ్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు.. నాగేగౌడనపాళ్యకు చెందిన ముత్తురాజ్, యలచేనహళ్లి నివాసి నారాయణ, అభిషేక్, రాకేశ్‌లు సుబ్రహ్మణ్య పుర పరిధిలోని ఏజీఎస్లేఔట్ కు చెందిన బోల్ట్‌నట్ కంపెనీ యజమాని గోపినాథ్‌ను గత నెల 26 తేదీన కిడ్నాప్ చేశారు.
గోపీనాథ్‌ను అతని కారులోనే రాచనమడు అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అతనినుంచి రూ.35 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు అతని వద్ద రెండు బంగారు ఉంగరాలు, రూ. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకొని వదలివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు దక్షిణ విభాగం డిప్యూటీ పోలీస్‌కమిషనర్ బీఎన్.లోకేశ్‌కుమార్ మార్గదర్శనంలో బనశంకరి ఉప విభాగం సహాయక పోలీస్ కమిషనర్ ఆర్సీ.లోకేకుమార్ నేతృత్వంలో చెన్నమ్మకెరె అచ్చుకటె సీఐ టీటీ.కృష్ణ, ఎస్ఐ. ఎస్పీ.కమారస్వామి కేసు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి నగదు, బంగారు ఉంగరాలు, మారుతీకారు, బైక్, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.