ఉలిక్కిపడ్డ నెల్లూరు
జిల్లా కోర్డు ఆవరణలో బాంబు పేలుడుతో భయపడ్డ జనం
పోలీసు యంత్రాంగం అప్రమత్తం
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనతో నెల్లూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. కక్షిదారుల మధ్య గొడవల కారణంగానే ఈ సంఘటన జరిగిందా? లేక నగరంలో అలజడి సృష్టించడానికి జరిగిన విద్రోహక చర్యా? అన్న అనుమానాల నేపథ్యంలో పోలీసు యంత్రాగం విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ విశాల్ గున్నీ గుంటూరు నుంచి హుటాహుటిన ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలంలో లభించిన వస్తువులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
నెల్లూరు(క్రైమ్):
జిల్లా కోర్టు ఆవరణ(మూడో అదనపు జూనియర్ జడ్జి కోర్టు ఎదురుగా గల గోడవద్ద)లో సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు గుర్తుతెలియని దుండగులు బాంబు పేల్చారు. పేలుడు దాటికి గోడకు, సమీపంలోని చెట్టుకు, గోడ అవతలివైపున రంధ్రాలయ్యాయి. దుండగులు అరలీటర్ సామర్థ్యం కల్గిన ప్రెజర్ కుక్కర్‌ను టిఫిన్ బ్యాగ్‌లో అమర్చి 9వోల్ట్స్ బ్యాటరీలను వినియోగించి పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాస్ట్‌లో అమోనియం నైట్రేట్‌ను వినియోగించినట్లు సమాచారం. బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలను ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)గా పోలీసులు తెలిపారు.
భిన్న కోణాల్లో దర్యాప్తు
నిత్యం వందలాదిమంది కక్షిదారులు, న్యాయవాదులు కోర్టుకు వస్తున్న నేపథ్యంలో బాంబు ఘటనతో సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని అన్నీ కోర్టుల్లో ఏయే కేసులు విచారణ సాగింది అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి కేసుల్లోని బాధితులు? ముద్దాయిలు ఎవరైనా ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చునన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. తీవ్రవాద సంస్థ అల్ ఉమా హస్తం ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. అదనపు ఎస్పీలు శరత్‌బాబు, సూరిబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ అబ్దుల్ అజీజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాగం జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటల్స్, రైల్వే, బస్ స్టేషన్లతో పాటు వాహన తనిఖీలను నిర్వహించింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : విశాల్‌గున్నీ, ఎస్పీ
ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఇది విద్రోహక చర్య కాదు. ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చు. బక్రీదు సందర్భంగా జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా? అనుమానాస్పదంగా వాహనాలు నిలిపి ఉంచినా వెంటనే 9440796300, 9447096384, 9440796303, డయల్ 100కు సమాచారం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తాం. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం.