యూఎస్‌ డ్రోన్‌ దాడిలో ఐసిస్‌–కె ఉగ్రవాదుల మృతి | Drone Strike Against ISIS-K Killed 2 High-Profile Targets | Sakshi
Sakshi News home page

యూఎస్‌ డ్రోన్‌ దాడిలో ఐసిస్‌–కె ఉగ్రవాదుల మృతి

Published Sun, Aug 29 2021 4:36 AM | Last Updated on Sun, Aug 29 2021 8:32 AM

Drone Strike Against ISIS-K Killed 2 High-Profile Targets - Sakshi

దాడి జరిగిన ప్రాంతంలో ధ్వంసమైన వాహనం.. బాంబు తీవ్రతకు ఏర్పడిన గొయ్యి

వాషింగ్టన్‌/కాబూల్‌: కాబూల్‌ బాంబుదాడికి ప్రతీకారంగా అమెరికా ఐసిస్‌–కె సూత్రధారులిద్దరిని డ్రోన్‌దాడిలో హతమార్చింది. అఫ్గాన్‌ లోని నాన్‌గర్హర్‌ ప్రావిన్సు ప్రాంతంలోని ఐసిస్‌ స్థావరాలపై ఈ దాడి జరిగినట్లు అమెరికా ప్రతినిధి కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రఘాతుకానికి పాల్పడ్డ ఐసిస్‌ మూకలపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ శపథం చేసిన సంగతి తెలిసిందే! అధ్యక్షుడి ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మిలటరీ డ్రోన్‌ దాడులు చేసింది.

దాడుల్లో ఇద్దరు ఐసిస్‌ వ్యూహకర్తలు మరణించారని, ఒకరు గాయపడ్డాడని మిలటరీ ప్రతినిధి హాంక్‌ టేలర్‌ చెప్పారు. దాడిలో సామాన్య పౌరులెవరూ గాయపడలేదన్నారు.   మరణించిన ఐసిస్‌ వ్యూహకర్తలకు కాబూల్‌ దాడితో సంబంధం ఉందో, లేదో తెలియరాలేదు. వీరి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విమానాశ్రయంపై దాడి అనంతరం ఉగ్రమూకలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ డ్రోన్‌ దాడులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.   

ఐసిస్‌–కెలో 14 మంది కేరళీయులు?
ఐసిస్‌–కె ఉగ్రవాద సంస్థలో 14 మంది కేరళ రాష్ట్రానికి చెందినవారు భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత బగ్రామ్‌ జైలు నుంచి వారిని విడుదల చేశారు. వారంతా ఐసిస్‌–కెతో ఉంటూ ఈ పేలుళ్లకు పన్నాగం పన్నిన వారిలో ఉన్నారని అఫ్గాన్‌ నుంచి సమాచారం వచ్చినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. 14 మందిలో 13 మంది ఇంకా కాబూల్‌లోనే ఉన్నారు. కేరళలోని మల్లాపురం, కసర్‌గోడ్, కన్నూర్‌ జిల్లాలకు చెందిన వీళ్లంతా ఏడేళ్ల క్రితమే కాబూల్‌కి వెళ్లి ఉగ్రసంస్థలో చేరారు. 

అమెరికా బలగాలు వారిని జైలు పాలు చేస్తే, తాలిబన్లు తిరిగి  బయటకు తీసుకువచ్చారు. అఫ్గాన్‌ ఉగ్ర కార్యకలాపాల్లో కేరళ వాసుల హస్తం ఉందని తాలిబన్లు ప్రచారం చేసి అంతర్జాతీయంగా భారత్‌ పరువుని బజారుకీడుస్తారేమోనని కేంద్రం ఆందోళనలో ఉంది. కాబూల్‌లోని టర్క్‌మెనిస్తాన్‌ ఎంబసీ వద్ద పేలుళ్లు జరిపేందుకు యత్నించిన ఇద్దరు పాక్‌ జాతీయులను తాలిబన్లు అడ్డుకున్నారు. సున్నీ పస్తూన్‌ ఉగ్ర సంస్థకు చెందిన వీరు పేలుడు పదార్థాలతో ఉండగా పట్టుబడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement