Bomb hoax call
-
టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు!
బెంగళూరు టీసీఎస్ ఆఫీసుకు ఈ రోజు (మంగళవారం) ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే అక్కడున్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ఉద్యోగి బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ చేసింది. క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఆఫీసుకు చేరుకున్నారు. ఆఫీసు మొత్తం వెతికినప్పటికీ అక్కడ బాంబు వంటివి లేదని నిర్థారించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి హుబ్లీకి చెందిన కంపెనీ మాజీ మహిళా ఉద్యోగి అని తెలిసింది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నట్లు సమాచారం. కంపెనీ గతంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల ఈ పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్ ఈ ఏడాది మేలో ఒకసారి గుర్తుతెలియని వ్యక్తి హైదరాబాద్‌లోని టిసిఎస్ కొండాపూర్ క్యాంపస్‌కి ఫోన్ చేసి బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అక్కడ పనిచేసే సుమారు 1500 మంది ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. కానీ ఇది ఫేక్ కాల్ అని తెలుసుకున్న తరువాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన తరువాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. -
పళని, రజనీ ఇళ్లలో బాంబులు పెట్టాం
సాక్షి, చెన్నై: బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో చెన్నై పోలీసులు వణికిపోయారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు రజనీకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్లు శనివారం ఓ ఆగంతకుడు చెన్నై కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోయెస్ గార్డెన్‌లోని పళని, రజనీ ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం బాంబులేవీ దొరక్కపోవటంతో అదంతా ఉత్తదేనని తేల్చారు. ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసిన అధికారులు భువనేశ్వరన్(21) అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కడలూరుకు చెందిన భువీకి మతిస్థిమితం సరిగ్గాలేదు. గతంలోనూ ఇలాంటి పనులను పాల్పడ్డాడని చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపారు. 2013లో నాటి సీఎం జయలలిత ఇంట్లో బాంబు పెట్టినట్లు కాల్ చేయగా.. ఆ సమయంలోనూ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఏఐ విమానానికి బాంబు బెదిరింపు
పణజి: బెదిరింపు ఫోన్ తో ఆదివారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కిందకు దిగింది. ఢిల్లీ నుంచి గోవా మీదుగా మాస్కోకు బయలు దేరిన విమానం ఏఐ-156కు బాంబు బెదిరింపు ఫోన్ కావడంతో కలకలం రేగింది. విదేశ్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని చెప్పాడు. వెంటనే అప్రమత్తన భద్రతా సిబ్బంది గోవాలో విమానాన్ని కిందకు దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయిల పనిగా గుర్తించారు. విమానంలో నలుగురు విదేశీయులతో పాటు 89 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
బాంబు బెదిరింపుతో 11 స్కూళ్లకు సెలవు
చెన్నై : బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌తో దాదాపు 11 పాఠశాలలు మూతపడ్డాయి. చెన్నైలోని శాంథోం చర్చి ఏరియాలోని పాఠశాలల్లో బాంబు ఉందంటూ మంగళవారం సిటీ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే స్కూళ్ల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. ఆ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం స్కూళ్లకు పరుగులందుకున్నారు. చుట్టుపక్కల స్కూళ్లలో బాంబు ఉందని ఫోన్ కాల్ రావటంతో ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే హుటాహుటిన ఆ ప్రాంతాలకు చేరుకున్న పోలీసు సిబ్బంది... విద్యార్థలందరినీ బయటకు తరలించి తనిఖీలు చేపట్టారు. చివరికి అది కేవలం బెదిరింపు ఫోన్ కాల్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఆయా పాఠశాలలకు యాజమాన్యాలు మంగళవారం సెలవు ప్రకటించాయి.