
తమిళనాడు సీఎం పళనిస్వామి.. రజనీకాంత్(జత చేయబడిన చిత్రం)
సాక్షి, చెన్నై: బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో చెన్నై పోలీసులు వణికిపోయారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు రజనీకాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్లు శనివారం ఓ ఆగంతకుడు చెన్నై కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోయెస్ గార్డెన్‌లోని పళని, రజనీ ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం బాంబులేవీ దొరక్కపోవటంతో అదంతా ఉత్తదేనని తేల్చారు. ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసిన అధికారులు భువనేశ్వరన్(21) అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కడలూరుకు చెందిన భువీకి మతిస్థిమితం సరిగ్గాలేదు. గతంలోనూ ఇలాంటి పనులను పాల్పడ్డాడని చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ తెలిపారు. 2013లో నాటి సీఎం జయలలిత ఇంట్లో బాంబు పెట్టినట్లు కాల్ చేయగా.. ఆ సమయంలోనూ పోలీసులు అరెస్ట్ చేశారు.