అమ్మో.. ‘దేశ’ ముదురు
* వంద కోట్లు మింగేసిన ‘బొమ్మరిల్లు’ రాజారావు
* అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు
* కోట్లు సేకరించి టీడీపీ మద్దతుదారుల గెలుపు కోసం వెదజల్లిన వైనం
* వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతలపూడి టికెట్ ఆశిస్తున్న రాజారావు
* పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం రూ.3 కోట్ల ఖర్చు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది ఏజెంట్లు.. మాయమాటలతో 40 వేల మంది నుంచి డిపాజిట్ల సేకరణ.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా వంద కోట్లు! మోసం బట్టబయలు కాగానే పరార్!! ‘బొమ్మరిల్లు’ పేరుతో అమాయక జనాన్ని నిండా ముంచిన ‘దేశ’ ముదురు రాయల రాజారావు ఘరానా మోసమిదీ. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్తగా ఉన్న ఈయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
వివిధ జిల్లాల్లోని డిపాజిట్‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాజారావును, ఆయన భార్య స్వాతిని అరెస్టు చేసేందుకు విశాఖ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విశాఖ పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి.. ఎనిమిది జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రాజారావు, రెండో ముద్దాయిగా ఉన్న ఆయన భార్య స్వాతి, మూడో ముద్దాయి, రాజారావు బావమరిది లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నారు.
పక్కాగా స్కెచ్..
* గతంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసిన రాజారావు.. వచ్చే ఎన్నికల్లో చింతలపూడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు వీలుగా ఇటీవలే విశాఖకు మకాం మార్చారు.
* ఏలూరుకు చెందిన టీడీపీ నేత మాగంటి బాబు ద్వారా పార్టీలో చేరిన ఈయన ఎనిమిది నెలలుగా చింతలపూడిలో భారీగా ఖర్చుచేస్తున్నారు.
* ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థుల కోసం బొమ్మరిల్లు సంస్థ నుంచి రూ.3 కోట్లకు పైగా సొమ్ము మళ్లించినట్లు సమాచారం. వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించారు.
* ఆర్బీఐ, సెబీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసిన రాజారావు.. రాజకీయాల్లో చేరడం ద్వారా రక్షణ పొందాలనే వ్యూహంతోనే టీడీపీలో చేరారని పోలీసులు అనుమానిస్తున్నారు.
* ఈ వ్యూహంలో భాగంగానే బొమ్మరిల్లు సంస్థల చైర్మన్, ఎండీ పదవులనుంచి తప్పుకొంటున్నట్లు నాటకం ఆడి డెరైక్టర్ల పేరిట కొందరు అనామకులను తెరపైకి తీసుకువచ్చారు.
* బొమ్మరిల్లు డెరైక్టర్లుగా ఉన్న వానపల్లి వెంకటరావు, సాధ శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, గోవిందు ఎర్రయ్య, మేనేజర్ సత్యనారాయణలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
మోసం ఇలా..
* 2011, ఆగస్టులో రాజారావు బొమ్మరిల్లు సంస్థను ప్రారంభించారు. హైదరాబాద్‌లో రాజా హోమ్స్, విశాఖలో బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ సహా పలు సంస్థలను ఏర్పాటు చేశారు.
* సినీనటులు, రాజకీయ నేతలతో ఆర్భాటంగా వెంచర్లు ప్రారంభింపజేశారు. ప్రజల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.
* కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప, తూర్పు గోదావరి తదితర జిల్లాలతో పాటు ఒడిశాలోనూ డిపాజిట్లు సేకరించారు.
* దాదాపు 3 వేల మంది ఏజెంట్లను నియమించి 40 వేల మంది నుంచి రూ.100 కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. ఇందులో ఇప్పటి వరకూ రూ. 20 కోట్లు మాత్రమే చెల్లించారు.
* సంస్థ పేరిట ఉందంటున్న 300 ఎకరాల భూమి కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ కాలేదని సమాచారం.