bongu chicken
-
బొంగులో బిర్యానీ.. చికెన్, బాస్మతి రైస్‌తో అబ్బ! ఏమి రుచి..! ధరెంతో తెలుసా?
అనంతగిరి(విశాఖ జిల్లా): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో బొంగు చికెన్ దొరకని ప్రదేశమే ఉండదు. బొంగు చికెన్‌కు అంత డిమాండ్ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం బొంగు బిర్యానీకి కూడా అంతే డిమాండ్ పెరిగింది. మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు, బొర్రా హోటల్ నిర్వహకులు బొంగు బిర్యానీని రుచి చూపిస్తున్నారు. బొంగుచికెన్ మాదిరిగానే బొంగు బిర్యానీ కూడా ఫేమస్ అయింది. మన్యంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. బొర్రా హోటల్లో తయారుచేస్తున్న బొంగు బిర్యానీ మన్యంలో దొరికే ఆహారంపై మొగ్గు చూపుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, స్థానికంగా ఉన్నవారు పర్యాటకులకు కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. బొర్రా గుహలను తిలకించేందుకు భారీగా తరలివచ్చే పర్యాటకుల కోసం హోటల్స్ వద్ద బొంగుచికెన్తో పాటుగా బొంగు బిర్యానీని అందుబాటులో ఉంచుతున్నారు. హోటల్లో ఇచ్చే ఒక బొంగు బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది. దీని ధర రూ.500 నుంచి రూ. 600 వరకు ఉంది. చికెన్, బాస్మతి రైస్‌తో కలిపి ఎంతోరుచిగా దీనిని తయారు చేస్తున్నారు. బిర్యానీలో ఎన్నోరకాలు ఉండగా, పర్యాటక ప్రాంతాల్లో దొరికే బొంగు బిర్యానీ రుచే వేరంటూ పర్యాటకులు లొట్టలేసుకుని తింటూ కితాబు ఇస్తున్నారు. బొంగు బిర్యానీని రుచి చూడాలంటే మరెందుకు లేటు బొర్రా రావలసిందే. చదవండి: 20 సినిమాలకు పైగా షూటింగ్.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే.. -
వెదురును వంటగ మలిచి...
వెదురు బొంగు... ఇంటి పైకప్పుగా మారి నీడనిస్తుంది... సన్నజాజి వంటి పందిళ్లను పెనవేసుకుంటుంది... నిచ్చెనగా మారుతుంది...బుట్టగా తయారై, పెళ్లికూతురుని మోస్తుంది... పూలకు ఆలవాలమవుతుంది... విసనకర్రలుగా మారి, మలయపవనాలు వీస్తుంది...వెదురు మురళిగా మారి సంగీతాన్ని జాలువారుస్తుంది...వెదురు బియ్యంతో వండిన అన్నం ఆకలిని తీరుస్తుంది... ఇప్పుడు వెదురు బొంగు తన పొట్టలో చికెన్‌ను నింపుకుని, బొగ్గుల మీద కాలి, కమ్మటి రుచికరమైన వంటకాన్ని అందిస్తోంది...మారేడుమిల్లి అడవులలో తయారవుతున్న గిరిజన తెగకు చెందిన వెదురు బొంగు చికెన్ మీద ప్రత్యేక కథనం... ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పేరు చెప్పగానే చాలామందికి 1987 సంఘటన గుర్తుకు వస్తుంది. ఆ సంవత్సరం డిసెంబరు 27న ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లను గుర్తేడు దగ్గర నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ఆ సంఘటన అప్పుడు సంచలనమైంది. ఆ ప్రదేశం ఇప్పుడు సందర్శకులతో కళకళలాడుతోంది. అంతేనా... అక్కడి గిరిజనులు తయారుచేసే వెదురు బొంగు చికెన్ కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆ అటవీ ప్రాంతానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తున్నారు. క్విజీన్లలో కూడా... బొంగు చికెన్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఈ వంటకాన్ని మెనూలో చేరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన వారు బొంగు చికెన్‌ను మొట్టమొదటగా తయారు చేసినట్లు చెబుతారు. ఈ వంటకాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలోని మల్టీ క్విజీన్ రెస్టారెంట్లలో సర్వ్ చేస్తున్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అందమైన సెలయేళ్లు, వెదురు బొంగు చికెన్ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇటీవలి కాలంలో టూరిస్టుల సంఖ్య పెరగడంతో, వెదురు బొంగు చికెన్ గురించి బయటి ప్రపంచానికి బాగా పరిచయమైంది’’ అంటారు స్థానిక గిరిజన హక్కుల సంఘం నాయకుడు మొక్కపాటి ప్రకాశ్. ఇలా తయారవుతుంది... ప్రత్యేకమైన వెదురు బొంగును ఎంచుకుని, మ్యారినేట్ చేసిన చికెన్‌ను ఇందులో స్టఫ్ చేస్తారు. బొగ్గుల మంట మీద ఈ వెదురు బొంగును ఉంచి, లోపలి చికెన్ కాలేలా చూస్తారు. ఇందులో ఒక్క చుక్కనూనె కూడా ఉపయోగించరు. వెదురు బొంగులోకి వెళ్లే ఆవిరి ద్వారానే లోపల ఉన్న చికెన్ కాలుతుంది. ఈ విధానంలోనే వెదురు షూట్ కర్రీ, వెదురు చట్నీ కూడా తయారుచేస్తారు. విదేశీయులు సైతం బొంగు చికెన్‌ను ఇష్టంగా తింటున్నారు. ఇంటిల్లిపాదికీ... ‘ఏడాదిగా, చికెన్ ధరలు బాగా పెరిగిపోయాయి. అయినా మేము ప్లేట్ చికెన్ 70 రూ.లకే ఇస్తున్నాం. కేజీకి ఆరేడు ప్లేట్లు వస్తుంది’’ అంటారు పదిహేను సంవత్సరాలుగా బొంగు చికెన్‌ను తయారు చేస్తున్న రామారెడ్డి. అతని తండ్రి, సమీపంలోని అడవి నుంచి నెలకొకసారి వెదురు తీసుకువచ్చేవారు. రామారెడ్డి సహాయంతో అతని భార్య రాణి చికెన్ తయారు చేసేది. ఇప్పుడిది పెద్ద మార్కెట్ స్థాయికి చేరబోతోంది. రెండు మల్టీ నేషనల్ కంపెనీలు ఈ గిరిజన బొంగు చికెన్ రెసిపీని పాపులర్ చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఒక కంపెనీ మారేడుమిల్లి వచ్చి, అక్కడే ఉన్న ఇకో టూరిజం గెస్ట్‌హౌస్‌లో రెండు రోజుల పాటు ఉండి, బొంగు చికెన్, ఆలూ ధమ్లకి సంబంధించిన సమాచారాన్ని వీడియోల ద్వారా సేకరించింది. అదే... ఆకర్షణ... మావోయిస్టులు విస్తృతంగా సంచరించే ప్రాంతం నుంచి ఈ వంటకం ఎక్కడ పుట్టిందనే విషయంలో స్పష్టత లేదు. ఈ వంటకం గురించిన సమాచారం ఇతర రాష్ట్రాలకు ఎలా చేరిందో కూడా పూర్తిగా తెలియదు. ఎక్కడ నుంచి ఎలా వచ్చింది అనే విషయం భోజన ప్రియులకు అనవసరం. ఈ వంటకాన్ని తయారుచేసే విధానమే అందరినీ ఆకర్షిస్తోంది. వెదురు బొంగులోకి చికెన్‌ను స్టఫ్ చేసి, బొగ్గుల మీద నెమ్మదిగా కాల్చడం వల్ల చికెన్ చక్కగా ఉడికి, వెదురులో స్రవించే రసంతో కలిపి, మెత్తగా, రుచికరంగా తయారవుతుంది. ఆ ప్రాంతం ఇప్పుడు మంచి పిక్నిక్ స్పాట్‌గా మారింది. ఇప్పుడు కేవలం కొండారెడ్డి గిరిజన జాతికి చెందిన వారు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ వంటకాన్ని తయారుచేస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ చేతిలోకి వెళ్లిపోతున్నందుకు గిరిజనులు బాధపడుతున్నారు. చెట్లను కాపాడుతున్నారు... బొంగు చికెన్ తినేవారి సంఖ్య పెరిగిపోవడంతో, వెదురుచెట్లను కొట్టేయవలసి వస్తోంది. అందువల్ల అటవీశాఖ అధికారులు వెదురు చెట్లను విస్తృతంగా పెంచుతూ, గిరిజనులకు సహాయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏసీ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అటవీశాఖవారు వాటర్ ఫాల్స్, పార్కులను అభివృద్ధి చేసి, పర్యావరణాన్ని కాపాడుతున్నారు. పర్యాటక స్థలాన్ని అక్కడి గిరిజనులే నిర్వహిస్తున్నారు. విద్యార్థులంతా ఇక్కడికే... కాకినాడ జెఎన్టియు, అమలాపురం, భీమవరం, ఏలూరు వంటి ప్రదేశాలలో చదువుకునే కాలేజీ విద్యార్థులంతా మారేడుమిల్లి వచ్చి బొంగు చికెన్ తింటుంటారు. ఒకసారి 20 మంది విద్యార్థులు అక్కడకు వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. ముందుగానే రామారెడ్డికి కబురు చేశారు. మరుసటిరోజు వీరంతా అక్కడకు వెళ్లారు. బొంగు చికెన్ సిద్ధం చేశారు. అయితే వారిలో ముగ్గురు వెజిటేరియన్లు కావడంతో, రామారెడ్డి అప్పటికప్పుడు వెదురు, కాప్సికమ్ మసాలా తయారుచేశారు. -
బొంగు బిర్యానీ.. టేస్టే..సెపరేటు
చాలా తక్కువ మందికే తెలిసిన వంటకం.. అరకు అందాలను చూడటానికి వెళ్లిన వారికి మాత్రమే పరిచయమున్న ఘుమఘుమ. ఇప్పుడు రాజధాని వాసుల నోరు ఊరిస్తోంది. అదే బొంగులో బిర్యానీ. బొంగులో చికెన్.. ఇది చాలామందికి తెలిసిన రుచే.. అయితే అరకు, బొర్రాగుహలకు మాత్రమే ప్రత్యేకమైన వెదురు బిర్యానీ ఇప్పుడు మన ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వంటకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇప్పుడు భవానీ ద్వీపంలో దీనిని సండే స్పెషల్‌గా ఏర్పాటు చేసింది. కృష్ణానది మధ్యలో.. చల్లని అహ్లాద వాతావరణంలో వేడివేడిగా బొంగు బిర్యానీ తింటుంటే.. ఆహా.. జిహ్వకు ఎంత ఇంపుగా ఉంటదో.. ఇంక లేటేందుకు లే‘టేస్ట్’ గురించి తెలుసుకుందాం రండి.. భవానీపురం(విజయవాడ పశ్చిమ): భవానీ ఐలాండ్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన రుచి.. బొంగులో బిర్యానీ.. మాంసాహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిని తయారు చేసే విధానం.. తయారీకి అవసరమైన వెదురు ఎక్కడి నుంచి తీసుకొస్తారు.. దీని రేటు తదితరాలకు సంబంధించి భవానీ ఐలాండ్ మేనేజర్ డి. సుధీర్‌బాబు తెలిపిన వివరాలు.. ఇదీ విధానం.. ముందుగా శుభ్రం చేసిన చికెన్‌కు అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పూ–కారం, చికెన్ మసాలా, పెరుగు, టేస్టింగ్ సాల్ట్ పట్టించి కాసేపు ఉంచుతారు. అలాగే బిర్యానీ రైస్‌ను హాఫ్ బాయిల్డ్ చేస్తారు. ఆ తర్వాత అర కేజీ చికెన్, అర కేజీ రైస్‌ను బొంగులో పెడతారు. బొంగుకు ఒక వైపు సీలు వేసినట్లు (వాసానికి మధ్యలో ఉండే కణుపు) ఉంటుంది. రెండో వైపు అరిటాకుగానీ, విస్తరాకుగానీ మూతగా పెడతారు. అప్పుడు బొంగును కట్టెల పొయ్యిపై ఏటవాలుగా పెట్టి మంటలో కాలుస్తారు. ఇక్కడ విచిత్రమేమిటంటే దీనిలో ఎక్కడా ఆయిల్ కలపరు. పచ్చి వెదురు బొంగులో ఉండే సహజమైన నీటితోనే చికెన్, రైస్ ఉడుకుతాయి. రేటు కొంచెం ఎక్కువే.. బొంగు బిర్యానీ అయినా (రైస్,చికెన్ కలిపి) బొంగు చికెన్ అయినా కిలో ఉంటుంది. వీటిలో ఏదైనా జీఎస్టీతో కలిపి రూ.650లు చార్జి చేస్తున్నారు. వీటితోపాటు కప్పు ఐస్క్రీంగానీ, కూల్ డ్రింక్గానీ ఇస్తున్నారు. వెదురు బొంగులు.. బిర్యానీ తయారీకి ఉపయోగించే పచ్చి వెదురు బొంగులను ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నుంచి ప్రతి వారం తెప్పిస్తున్నారు. ఈ బిర్యానీ తయారీలో నిపుణుడైన అప్పారావు అనే వ్యక్తిని రంపచోడవరం నుంచి తీసుకువచ్చి ఐలాండ్‌లోని వంట సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. అందరికీ అందుబాటులో.. మాంసాహార ప్రియులు బొంగు బిర్యానీ కోసం ఎక్కడికో వెళ్లకుండా.. అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో భవానీ ఐలాండ్‌లో కొత్తగా ప్రవేశపెట్టాం. ప్రతి ఆదివారం లంచ్ కింద ఈ ప్రత్యేక బిర్యానీతోపాటు కుండ బిర్యానీకూడా ఏర్పాటు చేశాం. సందర్శకుల నుంచి లభించే ఆదరణ చూసి ప్రతి రోజూ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం.– సీహెచ్ శ్రీనివాస్, డీవీఎం, ఏపీటీడీసీ -
బొంగు బిర్యానీ?!
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర అధికార వంటకంగా ‘బొంగు బిర్యానీ’ని ఖాయంచేశారు. చాలామంది నిర్ఘాంతపో యారు. అది విశాఖ ప్రాంతంలో కొండదొరల వంటకం. పచ్చి వెదురు గొట్టంలో లేత కోడిని సమస్త మసాలా దినుసులతో దట్టించి, దాన్ని బొంగులోకెక్కించి, మంటమీద కాలుస్తారు. కోడి వెదురు గొట్టంలో ఒక పదునులో ఉడికాక దాన్ని తింటారు. అదొక మహత్తర సందేశంగా ప్రతిధ్వనిస్తుంది. అసలు దాని వ్యవహార నామం ‘బొంగులో కోడి’. ఈ బొంగు బిర్యానీ పేరు డొల్లగా, బోలుగా ధ్వనిస్తూ మా చంద్రబాబు ప్రసంగంలాగే ఉందని కొందరు వ్యాఖ్యానించారు. ‘బొంగు భుజాన వేసుకుని పోయెద మెక్కడికైన...’ అని తిరుపతి వేంకట కవులు పద్యంలో కోప్పడ్డారు. అసలు మనం ‘బిర్యానీ’ పదాన్ని వాడటమే శుద్ధ దండగ. అది మన సంప్రదాయం కాదు. తెలంగాణ నైజాం పాలనలో వారింటి వంటగా రకరకాల బిర్యా నీలు చెలరేగిపోయేవి. దాని రుచి, వైభవం విశ్వ వ్యాప్తమైంది. బిర్యానీ అంటే అది విశేషమైన నాన్ వెజ్ వంటకం. శాకాహారులు దాన్ని శాకపాకాలతో వండుకుని తృప్తి పడుతున్నారు. అటు ట్రైబల్స్‌ని ఆనందపరుద్దామని చంద్రబాబు ఆలోచన చేశా రేమో. అట్లా అనుకుంటే ‘నత్తముక్కల గోంగూర’ని రంగంలోకి దింపండి. అమరావతి అబ్బా అంటుంది. బడుగు బలహీన వర్గాలు గుంటూరు గోంగూరని, కొనకుండానే దొరికే నత్తముక్కల్ని కలిపి పొక్కిస్తారు. తిన్నవాళ్లకి అమరావతి కనిపిస్తుంది. ‘కొత్త రాష్ట్రం, కొత్త కాపిటల్, కొత్త ఆఫీసులు, ఆఫీసర్లు– ఇన్ని కొత్తల మధ్య ఈ బొంగు బిర్యానీ అవసరమా? నేటి అమరావతిని ఏలిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి పరంపర పొట్టేలు, కోడిపుంజు మాంసాలు విరివిగా తిని ధరణికోటకి పేరు తెచ్చారు. ఆ పునాదులమీద, ఆ పౌరుషాల పురిటిగడ్డమీద తిరిగి పునాదులెత్తాం. ఈ నేపథ్యంలో ‘ఈ బొంగు బిర్యానీ అవసరమా?’ అని అడుగుతు న్నారు తెలుగు తమ్ముళ్లు. కృష్ణా జిల్లా మంచి వంట లకు పుట్టినిల్లు. కొన్ని వందల సంవత్సరాలపాటు ప్రసిద్ధి వహించిన ‘బ్రాహ్మల ఇంగువచారు’ కృష్ణా జిల్లాలో ఒక సామాజిక వర్గం ఇచ్చిన కౌంటర్‌తో గింగిరాలు తిరిగింది.ఆ కౌంటర్ పేరు ‘ఉలవచారు’. అది మహత్తరం, బలవత్తరం. వేడి అన్నం, ఉలవ చారు బాబు దృష్టికి రాలేదా? బొత్తిగా అభిరుచి లేని మనిషి అని కొందరన్నారు. ఇహ గోదావరి జిల్లాల కెళితే, ఎన్ని కూరలు, ఎంత వైవిధ్యం? రాజమం డ్రిలో కూర్చుంటే, ఈ దేవుడు ఇంకో వందేళ్లు, ఫిట్ మెంట్ పడేస్తే ఆయన సొమ్మేం పోయిందనిపిస్తుంది. ఈ వరదాకాలంలో గోదావరికి ఎదురొస్తుంది పులస! వాటి కోసం బడా బడా బెంజికార్లు తలు పులు తెరుచుకుని గోదావరి ఒడ్డున నిలబడతాయి. ఆ జిల్లాలో అన్ని చేపలూ గోదావరి నీళ్లు తాగి, గాలి పీల్చి తెగ నోరూరిస్తాయ్. ఇహ పాలకొల్లు, అంత ర్వేది లాంటి చోట బెల్లపు జీళ్లు ఏవున్నావుంటాయ్. బెల్లాన్ని ముదురుపాకంలో దించి, దాన్ని కొండచిల వగా చేసి నున్నటి గుంజకి చుడతారు. ఇహ దాన్ని లాగి లాగి, పీకి బాబు ప్లీనరీ స్పీచ్‌ని తలపిస్తారు. చివరికి చప్పట్లు కొట్టినట్టు నువ్వులద్ది జీళ్లు తయారు చేస్తారు. అవి అనన్య సామాన్యంగా ఉంటాయి. కాకినాడ కోటైకాజా ఒక చిత్రం. మడత కాజా ఇంకో విచిత్రం. విశాఖపట్నం సముద్రపు చేప సామా న్యమా? పలాస జీడిపప్పు రచనలు, ద్రావిడ ప్రసి ద్ధం పనసబుట్టల్ని ఎప్పుడైనా తిన్నారా? నెల్లూరు సీమ పులి బొంగరాలు, కారం దోశెలు, ఆ దిగువన అల్లూరయ్య సమస్త పాకాలు, తెనాలి బెల్లం జిలేబి, అటేపు బొబ్బట్లు నాలిక్కి తగల్లేదా బాబూ! ఆత్రేయ పురం పూత రేకులు ఇంటర్నేషనల్ ఫేమ్. ఇంకా రాయలసీమ రాగిముద్ద, పధ్నాలుగు సరసమైన కలు పులతో అనాదిగా విరాజిల్లుతున్నది. అసలు రాగి సంగటిని డిక్లేర్ చేస్తే ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉండనే ఉండదు. అప్పుడు మనకి కడప ఇనుముతో పనే ఉండదు. చిత్తూరు జిల్లా పిట్ట మాంసాలన్నీ పూర్తిగా లోకల్. ఈ కొండ అడివి పిట్టల్ని తిన్నవారు అదో రకంగా ఉంటారని చెబుతారు. అయినా మనకి పులిహోర నించి పులగం దాని డజను చిత్రాన్నాలు న్నాయ్. ఎందుకసలు మన ముఖ్యమంత్రి రాష్ట్ర వంటకానికి పోటీ పెడితే, అద్భుతాలు చేయగల మన తెలుగింటి ఆడపడుచులు జిహ్వ కింపుగా ఓ ‘కొత్త’ వంటకం బంగారుపళ్లెంలో అంది స్తారు. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
బొంగు బిరియానీ భలే టేస్ట్ గురూ!
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రామైన బొర్రా వద్ద బొంగు చికెను అందరికి తెలుసు. బొంగు బిరియాని కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. బొర్రా వద్ద హోటళ్ల నిర్వాహకులు బొంగు బిరియానితో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. బొర్రా గుహలకు వెళ్లే పర్యాటకుల నుంచి ముందుకు ఆర్డర్ తీసుకుని వారు తిరిగి వచ్చే సమయానికి సిద్ధం చేస్తున్నారు. అరకిలో బొంగు బిర్యానీని రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నట్టు హోటల్ యజమాని దారు తెలిపాడు. -
కృతుంగ...తెలుగింటి వంట
హైదరాబాదీల దిల్ పసంద్ పాయా చూడగానే జుర్రేయాలనిపిస్తుంది. మారుమిల్లి వెదురు బొంగు చికెన్... మాటల్లేవ్! టేస్ట్ చేయాల్సిందేనని తొందరపెడుతుంది. రాగి సంకటి ముద్ద, దాని మీద ఓ నేతి చుక్క... నంజుకోవడానికి నాటు కోడి కూర సీమ వాసులని నోరూరిస్తోంది. పల్నాడు, నైజాం కోడి బిర్యానీ, చెన్నూరు మాంసం పలావ్... ఇలా అచ్చంగా మనవైన వంటలు.. సజ్జరొట్టె, జొన్న రొట్టె, కొర్రన్నం... అన్నీ మన ఊరి వంటలు. ఇవన్నీ ఒకే చోట లాగించేయాలంటే... నగరంలోని కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే... జంక్ ఫుడ్స్మయం అయిన మహానగరంలో అచ్చమైన తెలుగు రుచులు కనుమరుగయ్యే పరిస్థితిని గమనించి... 2002లో సీటీఓ లింగారెడ్డి ఓ చిన్న ప్రయత్నం చేశారు. అదే ‘కృతుంగ’ రెస్టారెంట్. ఆ తర్వాత నరేందర్‌రెడ్డి... ఆ చిన్న ప్రయత్నానికి సంకల్పాన్ని, దిశను నిర్దేశిస్తూ ఎన్నో రెస్టారెంట్లుగా విస్తరింపచేశారు. నగరవాసులకు తెలుగింటి రుచులను అందిస్తూ... వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది ఇప్పుడు కృతుంగ. చిన్న అవుట్‌లెట్‌గా ప్రారంభమై నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 13 బ్రాంచీలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలకు కేరాఫ్... జూనియర్ ఎన్టీఆర్, రోజా, అలీ, సుమా, ఎస్వీ కృష్ణారెడ్డి, అనూప్ రూబెన్స్, అక్కినేని, కృష్ణంరాజు ఫ్యామిలీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు... ఇలా అనేక మంది ప్రముఖులు, సామాన్యులు ఇష్టపడే ఫుడ్ పాయింట్ ఇది. 2002లో పంజాగుట్టలో ప్రారంభమైన కృతుంగా... తన బ్రాంచీలు విస్తరిస్తూ జూబ్లీహిల్స్, ఎర్రమంజిల్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మణికొండ, కూకట్పల్లి, కొండాపూర్, జూబ్లీహిల్స్... ఇలా సిటీలోని అన్ని ప్రధాన సెంటర్లకూ విస్తరించింది. రుచికరమైన ఆహారానికి నాణ్యమైన దినుసులు ఎంతో ముఖ్యం. వంట సరుకులన్నీ సొంతంగా పండించిన వాటి నుంచి తెప్పించి ఇక్కడ వండి వారుస్తున్నారు. ఎండు మాంసం కర్రీస్ జూబ్లిహిల్స్ బ్రాంచ్ స్పెషల్. ఇది నగరంలో మరెక్కడా దొరకదు. ఆహారంతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్న ఈ రోజుల్లో... జంక్ ఫుడ్ బదులు కాల్షియంతో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనేదే మా ఉద్దేశం. రాగి, జొన్న, నూనె తక్కువగా ఉండే వెరైటీలు, మట్టి కుండలో వంటలు... ఇలా అన్నీ మన ప్రాంతాల్లో చేసుకునే వంటలే. 1000కు పైగా ఉద్యోగులు మా రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. వీళ్లందరినీ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి, ఇక్కడి పనుల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. పసుపు నుంచి రాగుల వరకూ స్వయంగా పండించినవే ఇక్కడ వాడతాం. ఇలా పదిమందికి ఉపాధి, మంచి ఆహారం అందించడమే మా లక్ష్యం’ అంటారు కృతుంగా రెస్టారెంట్స్ ఎండీ టి.నరేందర్‌రెడ్డి. ఇటీవలే బెంగళూరులోని జయ్ నగర్లో 3వ బ్రాంచి ప్రారంభించారు. మున్ముందు బెంగళూరులో 6, పుణే, చెన్నయ్ సహా సౌత్ ఇండియాలో మరో 20 బ్రాంచీలు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. వీటితో పాటు అమెరికాలోనూ ప్రారంభిస్తామన్నారు. ఫుట్‌బాల్ వంటి అనేక ఆటల పోటీలు, ఈవెంట్లు, సెలబ్రిటీల ఫంక్షన్లకు ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్స్ వెళ్తుంటాయి. 2009లో కింగ్‌ఫిషర్ నిర్వహించిన వంటల పోటీలో బెస్ట్ ఫుడ్ అవార్డు, 2008లో ఫోర్బ్ జాబితాలో రాష్ట్రంలో టాప్ బెస్ట్ రెస్టారెంట్‌గా గుర్తింపు సంపాదించుకుని ప్రత్యేకతను చాటుకుంది ‘కృతుంగ’. kritunga@gmail.com ph: 9000633918 - ఓ మధు