వెదురును వంటగ మలిచి... | maredupalli Bamboo Chicken Special Story | Sakshi
Sakshi News home page

వెదురును వంటగ మలిచి...

Published Sat, Aug 3 2019 9:25 AM | Last Updated on Sat, Aug 3 2019 9:25 AM

maredupalli Bamboo Chicken Special Story - Sakshi

వెదురు బొంగు... ఇంటి పైకప్పుగా మారి నీడనిస్తుంది... సన్నజాజి వంటి పందిళ్లను పెనవేసుకుంటుంది... నిచ్చెనగా మారుతుంది...బుట్టగా తయారై, పెళ్లికూతురుని మోస్తుంది... పూలకు ఆలవాలమవుతుంది... విసనకర్రలుగా మారి, మలయపవనాలు వీస్తుంది...వెదురు మురళిగా మారి సంగీతాన్ని జాలువారుస్తుంది...వెదురు బియ్యంతో వండిన అన్నం ఆకలిని తీరుస్తుంది... ఇప్పుడు వెదురు బొంగు తన పొట్టలో చికెన్‌ను నింపుకుని, బొగ్గుల మీద కాలి, కమ్మటి రుచికరమైన వంటకాన్ని అందిస్తోంది...మారేడుమిల్లి అడవులలో తయారవుతున్న గిరిజన తెగకు చెందిన వెదురు బొంగు చికెన్‌ మీద ప్రత్యేక కథనం...

ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పేరు చెప్పగానే చాలామందికి 1987 సంఘటన గుర్తుకు వస్తుంది. ఆ సంవత్సరం డిసెంబరు 27న ఎనిమిది మంది ఐఏఎస్‌ ఆఫీసర్లను గుర్తేడు దగ్గర నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు. ఆ సంఘటన అప్పుడు సంచలనమైంది. ఆ ప్రదేశం ఇప్పుడు  సందర్శకులతో కళకళలాడుతోంది. అంతేనా... అక్కడి గిరిజనులు తయారుచేసే వెదురు బొంగు చికెన్‌ కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆ అటవీ ప్రాంతానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తున్నారు.

క్విజీన్‌లలో కూడా...
బొంగు చికెన్‌ ఇప్పుడు బాగా పాపులర్‌ అయ్యింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఈ వంటకాన్ని మెనూలో చేరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన వారు బొంగు చికెన్‌ను మొట్టమొదటగా తయారు చేసినట్లు చెబుతారు. ఈ వంటకాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలోని మల్టీ క్విజీన్‌ రెస్టారెంట్లలో సర్వ్‌ చేస్తున్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అందమైన సెలయేళ్లు, వెదురు బొంగు చికెన్‌ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇటీవలి కాలంలో టూరిస్టుల సంఖ్య పెరగడంతో, వెదురు బొంగు చికెన్‌ గురించి బయటి ప్రపంచానికి బాగా పరిచయమైంది’’ అంటారు స్థానిక గిరిజన హక్కుల సంఘం నాయకుడు మొక్కపాటి ప్రకాశ్‌.

ఇలా తయారవుతుంది...
ప్రత్యేకమైన వెదురు బొంగును ఎంచుకుని, మ్యారినేట్‌ చేసిన చికెన్‌ను ఇందులో స్టఫ్‌ చేస్తారు. బొగ్గుల మంట మీద ఈ వెదురు బొంగును ఉంచి, లోపలి చికెన్‌ కాలేలా చూస్తారు. ఇందులో ఒక్క చుక్కనూనె కూడా ఉపయోగించరు. వెదురు బొంగులోకి వెళ్లే ఆవిరి ద్వారానే లోపల ఉన్న చికెన్‌ కాలుతుంది. ఈ విధానంలోనే వెదురు షూట్‌ కర్రీ, వెదురు చట్నీ కూడా తయారుచేస్తారు. విదేశీయులు సైతం బొంగు చికెన్‌ను ఇష్టంగా తింటున్నారు.

ఇంటిల్లిపాదికీ...
‘ఏడాదిగా, చికెన్‌ ధరలు బాగా పెరిగిపోయాయి. అయినా మేము ప్లేట్‌ చికెన్‌ 70 రూ.లకే ఇస్తున్నాం. కేజీకి ఆరేడు ప్లేట్లు వస్తుంది’’ అంటారు పదిహేను సంవత్సరాలుగా బొంగు చికెన్‌ను తయారు చేస్తున్న రామారెడ్డి. అతని తండ్రి, సమీపంలోని అడవి నుంచి నెలకొకసారి వెదురు తీసుకువచ్చేవారు. రామారెడ్డి సహాయంతో అతని భార్య రాణి చికెన్‌ తయారు చేసేది. ఇప్పుడిది పెద్ద మార్కెట్‌ స్థాయికి చేరబోతోంది. రెండు మల్టీ నేషనల్‌ కంపెనీలు ఈ గిరిజన బొంగు చికెన్‌ రెసిపీని పాపులర్‌ చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఒక కంపెనీ మారేడుమిల్లి వచ్చి, అక్కడే ఉన్న ఇకో టూరిజం గెస్ట్‌హౌస్‌లో రెండు రోజుల పాటు ఉండి, బొంగు చికెన్, ఆలూ ధమ్‌లకి సంబంధించిన సమాచారాన్ని వీడియోల ద్వారా సేకరించింది.

అదే... ఆకర్షణ...
మావోయిస్టులు విస్తృతంగా సంచరించే ప్రాంతం నుంచి ఈ వంటకం ఎక్కడ పుట్టిందనే విషయంలో స్పష్టత లేదు. ఈ వంటకం గురించిన సమాచారం ఇతర రాష్ట్రాలకు ఎలా చేరిందో కూడా పూర్తిగా తెలియదు. ఎక్కడ నుంచి ఎలా వచ్చింది అనే విషయం భోజన ప్రియులకు అనవసరం. ఈ వంటకాన్ని తయారుచేసే విధానమే అందరినీ ఆకర్షిస్తోంది. వెదురు బొంగులోకి చికెన్‌ను స్టఫ్‌ చేసి, బొగ్గుల మీద నెమ్మదిగా కాల్చడం వల్ల చికెన్‌ చక్కగా ఉడికి, వెదురులో స్రవించే రసంతో కలిపి, మెత్తగా, రుచికరంగా తయారవుతుంది. ఆ ప్రాంతం ఇప్పుడు మంచి పిక్‌నిక్‌ స్పాట్‌గా మారింది. ఇప్పుడు కేవలం కొండారెడ్డి గిరిజన జాతికి చెందిన వారు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ వంటకాన్ని తయారుచేస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ చేతిలోకి వెళ్లిపోతున్నందుకు గిరిజనులు బాధపడుతున్నారు.

చెట్లను కాపాడుతున్నారు...
బొంగు చికెన్‌ తినేవారి సంఖ్య పెరిగిపోవడంతో, వెదురుచెట్లను కొట్టేయవలసి వస్తోంది. అందువల్ల అటవీశాఖ అధికారులు వెదురు చెట్లను విస్తృతంగా పెంచుతూ, గిరిజనులకు సహాయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏసీ హోటల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అటవీశాఖవారు వాటర్‌ ఫాల్స్, పార్కులను అభివృద్ధి చేసి, పర్యావరణాన్ని కాపాడుతున్నారు. పర్యాటక స్థలాన్ని అక్కడి గిరిజనులే నిర్వహిస్తున్నారు.

విద్యార్థులంతా ఇక్కడికే...
కాకినాడ జెఎన్‌టియు, అమలాపురం, భీమవరం, ఏలూరు వంటి ప్రదేశాలలో చదువుకునే కాలేజీ విద్యార్థులంతా మారేడుమిల్లి వచ్చి బొంగు చికెన్‌ తింటుంటారు. ఒకసారి 20 మంది విద్యార్థులు అక్కడకు వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. ముందుగానే రామారెడ్డికి కబురు చేశారు. మరుసటిరోజు వీరంతా అక్కడకు వెళ్లారు. బొంగు చికెన్‌ సిద్ధం చేశారు. అయితే వారిలో ముగ్గురు వెజిటేరియన్లు కావడంతో, రామారెడ్డి అప్పటికప్పుడు వెదురు, కాప్సికమ్‌ మసాలా తయారుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement