maredupalli
-
HYD: ఆగిపోయిన ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, సాయన్న అంత్యక్రియల సందర్భంగా స్మశానవాటిక వద్ద ఆయన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని డిమాండ్ చేశారు. వివరాల ప్రకారం.. సాయన్న అంత్యక్రియలు సోమవారం మారేడుపల్లిలోని హిందు స్మశానవాటికలో జరగాల్సి ఉంది. అయితే, సాయన్న అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో జరపకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతిమ సంస్కారాలు అధికారిక లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాద్ యాదవ్, మల్లారెడ్డి స్మశానవాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో, సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఇక, సాయన్న అంత్యక్రియల అంశంపై పద్మారావు గౌడ్.. రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
వెదురును వంటగ మలిచి...
వెదురు బొంగు... ఇంటి పైకప్పుగా మారి నీడనిస్తుంది... సన్నజాజి వంటి పందిళ్లను పెనవేసుకుంటుంది... నిచ్చెనగా మారుతుంది...బుట్టగా తయారై, పెళ్లికూతురుని మోస్తుంది... పూలకు ఆలవాలమవుతుంది... విసనకర్రలుగా మారి, మలయపవనాలు వీస్తుంది...వెదురు మురళిగా మారి సంగీతాన్ని జాలువారుస్తుంది...వెదురు బియ్యంతో వండిన అన్నం ఆకలిని తీరుస్తుంది... ఇప్పుడు వెదురు బొంగు తన పొట్టలో చికెన్‌ను నింపుకుని, బొగ్గుల మీద కాలి, కమ్మటి రుచికరమైన వంటకాన్ని అందిస్తోంది...మారేడుమిల్లి అడవులలో తయారవుతున్న గిరిజన తెగకు చెందిన వెదురు బొంగు చికెన్ మీద ప్రత్యేక కథనం... ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం పేరు చెప్పగానే చాలామందికి 1987 సంఘటన గుర్తుకు వస్తుంది. ఆ సంవత్సరం డిసెంబరు 27న ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లను గుర్తేడు దగ్గర నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ఆ సంఘటన అప్పుడు సంచలనమైంది. ఆ ప్రదేశం ఇప్పుడు సందర్శకులతో కళకళలాడుతోంది. అంతేనా... అక్కడి గిరిజనులు తయారుచేసే వెదురు బొంగు చికెన్ కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆ అటవీ ప్రాంతానికి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తున్నారు. క్విజీన్లలో కూడా... బొంగు చికెన్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఈ వంటకాన్ని మెనూలో చేరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన వారు బొంగు చికెన్‌ను మొట్టమొదటగా తయారు చేసినట్లు చెబుతారు. ఈ వంటకాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలోని మల్టీ క్విజీన్ రెస్టారెంట్లలో సర్వ్ చేస్తున్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అందమైన సెలయేళ్లు, వెదురు బొంగు చికెన్ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇటీవలి కాలంలో టూరిస్టుల సంఖ్య పెరగడంతో, వెదురు బొంగు చికెన్ గురించి బయటి ప్రపంచానికి బాగా పరిచయమైంది’’ అంటారు స్థానిక గిరిజన హక్కుల సంఘం నాయకుడు మొక్కపాటి ప్రకాశ్. ఇలా తయారవుతుంది... ప్రత్యేకమైన వెదురు బొంగును ఎంచుకుని, మ్యారినేట్ చేసిన చికెన్‌ను ఇందులో స్టఫ్ చేస్తారు. బొగ్గుల మంట మీద ఈ వెదురు బొంగును ఉంచి, లోపలి చికెన్ కాలేలా చూస్తారు. ఇందులో ఒక్క చుక్కనూనె కూడా ఉపయోగించరు. వెదురు బొంగులోకి వెళ్లే ఆవిరి ద్వారానే లోపల ఉన్న చికెన్ కాలుతుంది. ఈ విధానంలోనే వెదురు షూట్ కర్రీ, వెదురు చట్నీ కూడా తయారుచేస్తారు. విదేశీయులు సైతం బొంగు చికెన్‌ను ఇష్టంగా తింటున్నారు. ఇంటిల్లిపాదికీ... ‘ఏడాదిగా, చికెన్ ధరలు బాగా పెరిగిపోయాయి. అయినా మేము ప్లేట్ చికెన్ 70 రూ.లకే ఇస్తున్నాం. కేజీకి ఆరేడు ప్లేట్లు వస్తుంది’’ అంటారు పదిహేను సంవత్సరాలుగా బొంగు చికెన్‌ను తయారు చేస్తున్న రామారెడ్డి. అతని తండ్రి, సమీపంలోని అడవి నుంచి నెలకొకసారి వెదురు తీసుకువచ్చేవారు. రామారెడ్డి సహాయంతో అతని భార్య రాణి చికెన్ తయారు చేసేది. ఇప్పుడిది పెద్ద మార్కెట్ స్థాయికి చేరబోతోంది. రెండు మల్టీ నేషనల్ కంపెనీలు ఈ గిరిజన బొంగు చికెన్ రెసిపీని పాపులర్ చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఒక కంపెనీ మారేడుమిల్లి వచ్చి, అక్కడే ఉన్న ఇకో టూరిజం గెస్ట్‌హౌస్‌లో రెండు రోజుల పాటు ఉండి, బొంగు చికెన్, ఆలూ ధమ్లకి సంబంధించిన సమాచారాన్ని వీడియోల ద్వారా సేకరించింది. అదే... ఆకర్షణ... మావోయిస్టులు విస్తృతంగా సంచరించే ప్రాంతం నుంచి ఈ వంటకం ఎక్కడ పుట్టిందనే విషయంలో స్పష్టత లేదు. ఈ వంటకం గురించిన సమాచారం ఇతర రాష్ట్రాలకు ఎలా చేరిందో కూడా పూర్తిగా తెలియదు. ఎక్కడ నుంచి ఎలా వచ్చింది అనే విషయం భోజన ప్రియులకు అనవసరం. ఈ వంటకాన్ని తయారుచేసే విధానమే అందరినీ ఆకర్షిస్తోంది. వెదురు బొంగులోకి చికెన్‌ను స్టఫ్ చేసి, బొగ్గుల మీద నెమ్మదిగా కాల్చడం వల్ల చికెన్ చక్కగా ఉడికి, వెదురులో స్రవించే రసంతో కలిపి, మెత్తగా, రుచికరంగా తయారవుతుంది. ఆ ప్రాంతం ఇప్పుడు మంచి పిక్నిక్ స్పాట్‌గా మారింది. ఇప్పుడు కేవలం కొండారెడ్డి గిరిజన జాతికి చెందిన వారు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ వంటకాన్ని తయారుచేస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ చేతిలోకి వెళ్లిపోతున్నందుకు గిరిజనులు బాధపడుతున్నారు. చెట్లను కాపాడుతున్నారు... బొంగు చికెన్ తినేవారి సంఖ్య పెరిగిపోవడంతో, వెదురుచెట్లను కొట్టేయవలసి వస్తోంది. అందువల్ల అటవీశాఖ అధికారులు వెదురు చెట్లను విస్తృతంగా పెంచుతూ, గిరిజనులకు సహాయపడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏసీ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అటవీశాఖవారు వాటర్ ఫాల్స్, పార్కులను అభివృద్ధి చేసి, పర్యావరణాన్ని కాపాడుతున్నారు. పర్యాటక స్థలాన్ని అక్కడి గిరిజనులే నిర్వహిస్తున్నారు. విద్యార్థులంతా ఇక్కడికే... కాకినాడ జెఎన్టియు, అమలాపురం, భీమవరం, ఏలూరు వంటి ప్రదేశాలలో చదువుకునే కాలేజీ విద్యార్థులంతా మారేడుమిల్లి వచ్చి బొంగు చికెన్ తింటుంటారు. ఒకసారి 20 మంది విద్యార్థులు అక్కడకు వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. ముందుగానే రామారెడ్డికి కబురు చేశారు. మరుసటిరోజు వీరంతా అక్కడకు వెళ్లారు. బొంగు చికెన్ సిద్ధం చేశారు. అయితే వారిలో ముగ్గురు వెజిటేరియన్లు కావడంతో, రామారెడ్డి అప్పటికప్పుడు వెదురు, కాప్సికమ్ మసాలా తయారుచేశారు. -
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
-
భారీ అగ్ని ప్రమాదం 20 లక్షల ఆస్తినష్టం
మారేడుపల్లి: సికింద్రాబాద్ కార్ఖానా విక్రంపురి కాలనీ లో ఓ ప్లాజాలో బారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్స్ లో మంటలు వ్యాపించడంతో రూ. 20 లక్షల అస్తి నష్టం వాటిల్లింది. కార్ఖానా పోలీసులు తెలిపిన మేరకు.. కార్ఖానా లోని పూజా ప్లాజాలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఈజీ బై షోరూంలో షార్ట్‌సర్కూ్యట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఈజీబై షోరూం లో బారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికి దట్టమైన పొగలు వ్యాపించడంతో లోనికి వెళ్లడం కష్టంగా మారింది..దీంతో షోరూం అద్దాలను ద్వంసం చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలం వద్ద కు ఐదు ఫైర్ ఇంజన్లతో మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పక్కన ఉన్న దుకాణాల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే ఉన్న అన్ స్కిన్ షోరూం స్వల్పంగా దగ్ధమైంది. షోరూంలో దుస్తులతో పాటు కాస్మొటిక్స్ ఉండటంతో మంటలను ఆదుపులోకి తీసుకు రావడానికి చాలా సమయం పట్టింది. సుమారు ఇరవై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో స్థానికంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్టోర్ మేనేజర్ రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘తిరంగా’ ఆర్ట్..
మారేడుపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి అశ్విని నగర్లో ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రుక్మిణి ఆర్ట్స్ అకాడమీ రాజశ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో రూపొందించిన పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. స్వాతంత్య్ర వేడుకలు, తివర్ణ పతాకం, మహాత్మ గాంధీతో పాటు పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ ఆనంద్ తెలిపారు. -
అక్కడ నిప్పు... ఇక్కడ గాయం
బిక్కుబిక్కుమంటున్న బస్తీ వాసులు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో 35 మంది అరెస్ట్ పరారీలో మరికొందరు కుట్రతో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు కన్నీటి పర్యంతమవుతున్న నిందితుల కుటుంబ సభ్యులు ఆవేశమో... ఆగ్రహమో... రగిల్చిన మంటలు... ఇప్పుడు కొన్ని గుండెలను దహించేస్తున్నాయి. క డుపులను కాల్చేస్తున్నాయి. అమాయక జనం కళ్లలో కన్నీటి వర్షానికి కారణమవుతున్నాయి. మంటలకు కారణం ఒకరైతే... ఇప్పుడు గాయపడుతున్నది మరొకరు. ఆగ్రహం ఒకరిదైతే...ఆవేదన మరొకరిది. భర్త, పిల్లలు దూర మై ఇల్లాలు... కన్నబిడ్డను పోలీసులు తీసుకెళ్తుంటే... నిస్సహాయంగా నిలబడిన తల్లి.. ఆధారమైన తమ్ముడు అరెస్టయితే... ఆకలితో అలమటిస్తున్న అక్క...ఇలా ప్రతి ఇల్లూ ఇప్పుడు ఓ శోక సంద్రం. ఇదీ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటన ఫలితం. మారేడుపల్లి: ఒకరిద్దరు నేరస్తులు, రౌడీషీటర్ల కుట్ర వల్ల ఇప్పుడు మహత్మాగాంధీ నగర్, వాల్మీకి నగర్, దుర్గయ్య గార్డెన్ బస్తీలు శిక్ష అనుభవిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ ఇంటిపై పోలీసులు దాడి చేస్తారో... ఎవరిని అరెస్టు చే సి తీసుకెళ్తారోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. అంతా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. ఏ రోజుకు ఆ రోజు పని చే స్తే తప్ప పూట గడవదు. అలాంటి ఇళ్లలో సంపాదించే వ్యక్తులు అరె స్టవడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు వీధిన పడ్డారు. ఇదీ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి పరిణామం. భయం భయంగా... బన్నప్ప మృతితో పోలీస్ స్టేషన్‌పై దాడికి కుట్రకు పాల్పడింది కొందరైతే... ఫలితాన్ని మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోంది. మొత్తం 101 మంది దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 35 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 66 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు ఎప్పుడొస్తారో? ఎవరిని అరెస్టు చేస్తారోనన్న ఆందోళనతో స్థానికులు బితుకుబితుకుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దాడి రోజు అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో మద్యం మత్తులో కొందరు ఉన్నారు. గుంపుతో వెళ్లిన వారు మరికొందరు. ‘దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లతో పాటు ఏమాత్రం సంబంధం లేని వారిని సైతం అరెస్టు చేస్తున్నారంటూ’ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురు మగవాళ్లు అరెస్టయ్యారు. వారంతా పనిచేసి సంపాదిస్తే తప్ప ఆ కుటుంబాలకు పూట గడవదు. ఎప్పుడొస్తారో తెలియని తమ వారి కోసం బాధిత కుటుంబాలు దీనంగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంట్లో నలుగురినీ అరెస్టు చేశారు : లాల్ బీ స్టేషన్‌పై గొడవతో ఏమాత్రం సంబంధం లేకున్నా నా భర్తతో పాటు ముగ్గురు కుమారులనూ అరెస్టు చేశారు. బస్తీలో మటన్ షాపును నిర్వహిస్తూ బతుకుతున్నాం. బోనాల సందర్భంగా మాంసం విక్రయిస్తుండగా... బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వెళ్తుంటే మావాళ్లూ వెళ్లారు. అప్పటికే స్టేషన్ వద్ద గొడవ సద్దుమణిగిందని మావాళ్లు చెప్పారు. అయినా పోలీసులు షాబోద్దీన్, రఫీక్, మహ్మద్ మౌలానా, చాంద్‌లను అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడు రోజులగా మటన్‌షాపు మూసేసి రోడ్డున పడ్డాం. నా భర్త, కొడుకులు ఎప్పుడొస్తారో తెలియడం లేదు. వాళ్లకు సంబంధం లేదు : గంగ, చందు సోదరి దాడితో సంబంధం లేకున్నా పోలీసులు అక్రమంగా మా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవారినీ అరెస్టు చేశారు. మా తమ్ముడు చందు ఆటో ద్వారా సంపాదించే ఆదాయంపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. మా అక్క కొడుకులు నవీన్, రవితేజ మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. నవీన్‌ను పోలీసులు అరెస్టు చేస్తుంటే అడ్డు పడినందుకు చందును అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా సంపాదన లేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చందుకు 20 రోజుల క్రితమే బాబు పుట్టాడు. చంటి పిల్లాడితో మా మరదలు పడే వేదన మమ్మల్ని మరింత కలచివేస్తోంది. చూడ్డానికి వెళ్లాం : లక్ష్మి, అజయ్ సోదరి బన్నప్ప చనిపోయాడని తెలియడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాం. అప్పటికే స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు మాకు సంబంధం ఉందంటూ పోలీసులు మా బాబును తీసుకు వెళ్లారు. చిత్రహింసలకు గురి చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించండి. అమాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయొద్దు. చిన్న పిల్లోడినీ అరెస్టు చేశారు : మల్లమ్మ, చంద్రశేఖర్ తల్లి పోలీసు స్టేషన్ దగ్గర గొడవని తెలిసి అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న నా కొడుకు చంద్రశేఖర్ అక్కడికి వెళ్లాడు. గొడవలో మా కొడుకు పాల్గొనకపోయినా అరెస్టు చేశారు. 18 ఏళ్లు కూడా నిండని నా కొడుకును అన్యాయంగా ఇరికించారు. పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా?: జస్టిస్ చంద్రకుమార్ ఈ కేసు వెనుక కొన్ని శక్తులు ఉన్నాయనే మాట బలంగా వినిపిస్తోంది.సమగ్ర విచారణ లేకుండానే పోలీసులు అమాయకులను అరెస్టు చేస్తున్నారు. చనిపోయిన బన్నప్న తల్లిని, తమ్ముడిని సైతం కొట్టిన గుర్తులు ఉన్నాయి. అర్ధరాత్రి పూట అరెస్టులకు పాల్పడుతున్నారు. వాళ్లేమైనా దేశద్రోహులా? పగటి పూట స్టేషన్‌కు రప్పించవచ్చు. విచారణ చేయవచ్చు. చట్టవ్యతిరేకంగా అరెస్టులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పోలీసులే చట్టాలను ఉల్లంఘించడం మంచిది కాదు. ఫ్రెండ్లీ పోలీస్‌కు విరుద్ధం : ఎస్.జీవన్‌కుమార్, అధ్యక్షులు, మానవ హక్కుల వేదిక మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిలో పాతనేరస్తులు, రౌడీషీటర్లు ఉండవచ్చు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. కుట్రలతో సంబంధం లేని వారు కూడా అరెస్టవుతున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి. వారం రోజులుగా నగరంలో 5 చిత్రహింసల కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ‘స్నేహపూర్వకమైన పోలీసులు’అనే భావనకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. ఫోన్ కాల్స్‌పైనా ఆరా దాడిలో పాల్గొన్న బన్నప్ప కుటుంబ సభ్యులతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిందితులు దాడి ఘటనకు ముందు, ఆ తర్వాత జరిపిన ఫోన్ సంభాషణల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. ఏ-4 నిందితుడిగా ఉన్న దశరథ్ దాడి సమయంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో నేత ఒకరితో ఫోన్లో సంభాషించినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు... మరికొందరు నిందితుల ఫోన్ కాల్స్ విషయంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
క్రికెటర్లకు వెరీ వెరీ స్పెషల్
మారేడ్‌పల్లి, న్యూస్‌లైన్: క్రికెట్ క్రేజీ నగరంలో అకాడమీలకు లెక్కేలేదు. ఆసక్తిని క్యాష్ చేసుకునే సెంటర్లు ఎన్నో ఉంటే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అకాడమీలు కొన్నే! సరిగ్గా ఈ కోవలోకే చెందిన నాణ్యమైన కోచింగ్ అకాడమీ... ‘సెయింట్ జాన్స్’. ఈస్ట్‌మారేడుపల్లిలో ఉన్న ఈ క్రికెట్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో మెరిశారు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇక్కడ శిక్షణ తీసుకునే అంతర్జాతీయ క్రికెట్లో ‘వెరీ వెరీ స్పెషల్’గా అవతరించాడు. అనుభవజ్ఞలైన కోచ్‌ల నేతృత్వంలో రెండున్నర దశాబ్దాలుగా నడుస్తున్న ఈ అకాడమీలో నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు ఆట నేర్చుకుంటున్నారు. వేసవిలోనైతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇద్దరు కలిసి... మన నగరంలోనూ చక్కటి శిక్షణనిచ్చే అకాడమీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాజీ రంజీ క్రికెటర్లు ఎం.వి. నరసింహారావు, జాన్ మనోజ్‌లు కలిసి దీన్ని ప్రారంభించారు. 1987 మార్చి 11న ‘సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ’ పేరిట క్రికెట్ కోచింగ్‌కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్న క్రికెట్ అకాడమీలన్నీ దీని తర్వాతే పుట్టుకొచ్చాయి. వీవీఎస్ లక్ష్మణ్ మొదలుకొని తాజాగా హనుమ విహారి వరకు ఎందరో క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు దిద్దారు. అలా 26 ఏళ్లుగా ఔత్సాహిక క్రికెటర్లెందరికో ఇక్కడ పాఠాలు నేర్పుతున్నారు జాన్ మనోజ్. ప్రతి విభాగంలోనూ ప్రత్యేక శిక్షణ ఆరేళ్ల పిల్లల నుంచి వర్ధమాన క్రికెటర్ల వరకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం సెషన్ల వారిగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగని రీతిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 22 మంది సుశిక్షితులైన కోచ్‌లు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్ తదితర విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పదును పెడుతున్నారు. జాన్ మనోజ్‌తో పాటు పి. ప్రసన్న కుమార్ (1979-89 రంజీ ప్లేయర్) వంటి కోచ్‌లు నిరంతరం ఆటగాళ్లకు అందుబాటులో ఉంటున్నారు. భిన్నమైన పిచ్‌లపై ప్రాక్టీసు, శిక్షణ ఇస్తుండడం ఈ అకాడమీ ప్రత్యేకత. క్రీడాకారులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దుతున్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వసతులు... పిచ్‌లు... ఆధునిక సదుపాయాలన్నీ ఈ అకాడమీలో ఉన్నాయి. ఆరు మ్యాటింగ్ వికెట్లు, మూడు టర్ఫ్ వికెట్లు, 2 ఆస్ట్రోటర్ఫ్ వికెట్లతో పాటు ఒక సిమెంట్ పిచ్ ఈ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. ఆటకు ముందు శారీరక కసరత్తుల కోసం ప్రత్యేక జిమ్ సౌకర్యం కూడా ఉంది. అప్పటి హుడా (ఇప్పుడు జీహెచ్ఎంసీ) సహకారంతో మైదానాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ కేవలం క్రికెట్ కోచ్‌లే కాదు... ఫిజియోలు, డాక్టర్లు సైతం శిక్షణార్థులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ట్రెయినింగ్ మధ్యలో సీనియర్ క్రికెటర్లు, కోచ్‌లు అకాడమీని సందర్శించి వర్ధమాన క్రీడాకారులతో తమ అనుభవాల్ని పంచుకుంటారు. అమూల్యమైన సూచనలు అందిస్తారు. వేసవిలో ప్రత్యేక శిబిరాలు ఏడాది పొడవునా ఉదయం 5.45 గంటల నుంచి 8.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సెషన్లలో 170 మంది చొప్పున 340 మంది క్రికెటర్లు శిక్షణ తీసుకుంటున్నారు. వేసవిలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. విజేతలెందరో.... హైదరాబాద్ క్రికెట్ బ్రాండ్ వీవీఎస్ లక్ష్మణ్... సచిన్ సారథ్యంలో భారత్‌కు ఆడిన నోయల్ డేవిడ్, ఎమ్మెస్కే ప్రసాద్‌లు ఆట నేర్చుకుంది ఇక్కడే. 2012 అండర్-19 భారత క్రికెట్ టీమ్ సభ్యుడు, దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ ప్లేయర్ హనుమ విహారీ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ విద్యార్థే. వీరే కాకుండా పదుల సంఖ్యలో క్రీడాకారులు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నారు.