క్రికెటర్లకు వెరీ వెరీ స్పెషల్ | cricketers very very special | Sakshi
Sakshi News home page

క్రికెటర్లకు వెరీ వెరీ స్పెషల్

Published Sat, May 17 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

cricketers very very special

మారేడ్‌పల్లి, న్యూస్‌లైన్: క్రికెట్ క్రేజీ నగరంలో అకాడమీలకు లెక్కేలేదు. ఆసక్తిని క్యాష్ చేసుకునే సెంటర్లు ఎన్నో ఉంటే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అకాడమీలు కొన్నే! సరిగ్గా ఈ కోవలోకే చెందిన నాణ్యమైన కోచింగ్ అకాడమీ...
 
 ‘సెయింట్ జాన్స్’. ఈస్ట్‌మారేడుపల్లిలో ఉన్న ఈ క్రికెట్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో మెరిశారు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇక్కడ శిక్షణ తీసుకునే అంతర్జాతీయ క్రికెట్‌లో ‘వెరీ వెరీ స్పెషల్’గా అవతరించాడు. అనుభవజ్ఞలైన కోచ్‌ల నేతృత్వంలో రెండున్నర దశాబ్దాలుగా నడుస్తున్న ఈ అకాడమీలో నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు ఆట నేర్చుకుంటున్నారు. వేసవిలోనైతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
 
 ఇద్దరు కలిసి...
 మన నగరంలోనూ చక్కటి శిక్షణనిచ్చే అకాడమీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాజీ రంజీ క్రికెటర్లు ఎం.వి. నరసింహారావు, జాన్ మనోజ్‌లు కలిసి దీన్ని ప్రారంభించారు. 1987 మార్చి 11న ‘సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ’ పేరిట క్రికెట్ కోచింగ్‌కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్న క్రికెట్ అకాడమీలన్నీ దీని తర్వాతే పుట్టుకొచ్చాయి. వీవీఎస్ లక్ష్మణ్ మొదలుకొని తాజాగా హనుమ విహారి  వరకు ఎందరో క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు దిద్దారు. అలా 26 ఏళ్లుగా ఔత్సాహిక క్రికెటర్లెందరికో ఇక్కడ పాఠాలు నేర్పుతున్నారు జాన్ మనోజ్.
 
 ప్రతి విభాగంలోనూ ప్రత్యేక శిక్షణ
 ఆరేళ్ల పిల్లల నుంచి వర్ధమాన క్రికెటర్ల వరకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం సెషన్ల వారిగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగని రీతిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 22 మంది సుశిక్షితులైన కోచ్‌లు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్ తదితర విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పదును పెడుతున్నారు. జాన్ మనోజ్‌తో పాటు పి. ప్రసన్న కుమార్  (1979-89 రంజీ ప్లేయర్) వంటి కోచ్‌లు నిరంతరం ఆటగాళ్లకు అందుబాటులో ఉంటున్నారు. భిన్నమైన పిచ్‌లపై ప్రాక్టీసు, శిక్షణ ఇస్తుండడం ఈ అకాడమీ ప్రత్యేకత. క్రీడాకారులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దుతున్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
 
 వసతులు... పిచ్‌లు...
 ఆధునిక సదుపాయాలన్నీ ఈ అకాడమీలో ఉన్నాయి. ఆరు మ్యాటింగ్ వికెట్లు, మూడు టర్ఫ్ వికెట్లు, 2 ఆస్ట్రోటర్ఫ్ వికెట్లతో పాటు ఒక సిమెంట్ పిచ్ ఈ సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆటకు ముందు శారీరక కసరత్తుల కోసం ప్రత్యేక జిమ్ సౌకర్యం కూడా ఉంది. అప్పటి హుడా (ఇప్పుడు జీహెచ్‌ఎంసీ) సహకారంతో మైదానాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ కేవలం క్రికెట్ కోచ్‌లే కాదు... ఫిజియోలు, డాక్టర్లు సైతం శిక్షణార్థులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ట్రెయినింగ్ మధ్యలో సీనియర్ క్రికెటర్లు, కోచ్‌లు అకాడమీని సందర్శించి వర్ధమాన క్రీడాకారులతో తమ అనుభవాల్ని పంచుకుంటారు. అమూల్యమైన సూచనలు అందిస్తారు.
 
 వేసవిలో ప్రత్యేక శిబిరాలు
 ఏడాది పొడవునా ఉదయం 5.45 గంటల నుంచి 8.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సెషన్‌లలో 170 మంది చొప్పున 340 మంది క్రికెటర్లు శిక్షణ తీసుకుంటున్నారు. వేసవిలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
 
 విజేతలెందరో....
 హైదరాబాద్ క్రికెట్ బ్రాండ్ వీవీఎస్ లక్ష్మణ్... సచిన్ సారథ్యంలో భారత్‌కు ఆడిన నోయల్ డేవిడ్, ఎమ్మెస్కే ప్రసాద్‌లు ఆట నేర్చుకుంది ఇక్కడే. 2012 అండర్-19 భారత క్రికెట్ టీమ్ సభ్యుడు, దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ ప్లేయర్ హనుమ విహారీ  సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ విద్యార్థే. వీరే కాకుండా పదుల సంఖ్యలో క్రీడాకారులు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement