కొట్లాటలో వ్యక్తి మృతి
గంజాయి మత్తులో కొట్టుకున్న వైనం...!
చీమకుర్తి(సంతనూతలపాడు): కొట్లాట విషయంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చీమకుర్తిలోని మాదిగ పల్లెకు చెందిన బూదాల నాగేశ్వరరావు(32) స్థానిక ప్రభుత్వాసుపత్రి పక్కన చినరాస్తా రోడ్డులో గుడిసెల్లో నివాసం ఉంటున్న కొందరి వ్యక్తులతో గంజాయి తాగుతున్నాడు. ఈ క్రమం లో వారి మధ్యన మాటామాట పెరిగి నాగేశ్వరరావును అవతలి వారు కొట్టి చంపినట్లు మృతుడు భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు.
మృతుడు నాగేశ్వరరావును మేము కొట్టలేదని పాము కరిచి చని పోయాడని చినరాస్తా రోడ్డులో గుడిసెల్లో నివాసం ఉండేవారు చెబుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పంపామన్నారు. నివేదిక ప్రకారం కేసునమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తాగేందుకు గంజాయి వీరికి ఎక్కడ నుంచి సరఫరా అవుతోంది, గంజాయి విషయంలో పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.