book inagration
-
ఓటుకు పనితీరే కొలమానం
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ఎన్నుకోబోయే వ్యక్తి పనితీరు, ప్రజా ప్రయోజనాలనే కొలమానంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పోటీచేసే వ్యక్తి గుణగణాలు, సామర్థ్యం, యోగ్యత, నడతను కచ్చితంగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులమతాలు, ధన ప్రభావంతో ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి రచించిన ‘ఎకోటి కాలింగ్’పుస్తకాన్ని తెలుగులో అనువదించిన ‘సుపరిపాలన’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పాలనే కీలకమైందని, పాలనా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయ వలసిన అవసరం ఉందని సూచించారు. సౌకర్యాల కల్పనతో పాటు ప్రజలకు అడ్డంకులు లేని ఆనందమయ జీవితాన్ని కల్పించడమే సుపరిపాలన ధ్యేయమన్నారు. ఎన్నుకోబడిన ప్రతినిధులు తమ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలన్నారు. కరదీపికలా సుపరిపాలన పుస్తకం.. కొత్తగా సివిల్ సర్వీసుల్లోకి వచ్చే వారికి సుపరిపాలన పుస్తకం కరదీపికలా పని చేస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు, అడ్డంకులు తదితర ఎన్నో అంశాలను ఇందులో చర్చించినట్లు తెలిపారు. థర్డ్ జండర్స్, న్యాయం లాంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను వెలువరించిన ఈ పుస్తకం, ఉద్యోగంతో పాటు సమాజం పట్ల జోషి చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందని, రచయిత జోషి రచించిన ఇంగ్లీషు పుస్తకాన్ని సరళమైన, చక్కని తెలుగులో అనువాదం చేసిన అన్నవరపు బ్రహ్మయ్యకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎస్.కె.జోషి, అనువాదకుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్ విజయమ్మ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నేతృత్వంలో రచించిన ‘ప్రతి దినం ప్రజాహితం' పుస్తకాన్ని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. ఏడాదికాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అనేక కార్యక్రమాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే వైఎస్ జగన్ 90శాతం హామీలను అమలు చేశారని అభినందించారు. ఇచ్చిన హామీ మేరకు జూలై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో అమర్, విజయమ్మతో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
సమకాలీన మార్పులను గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం–లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమోరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్’పేరుతో ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్ హనుమంతరావు రాసిన పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా హనుమంతరావు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. మార్క్సిజం–లెనినిజం భావాల నుంచి నెహ్రూవియన్ సోషలిజం వైపు వచ్చేందుకు హనుమంతరావుకు ఎక్కువ సమయం పట్టలేదన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలను ఇప్పటికీ రూపుమాపలేకపోయామని ఇందుకు కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రొ.మనోరంజన్ మొహంతి, దీపక్ అయ్యర్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాగద్వేషాలకు అతీతం ఆయన విమర్శ
ఘనంగా కోడూరి శ్రీరామమూర్తి పుస్తకద్వయ ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : సంయమనంతో కూడిన విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి అని, ఆయన విమర్శ రాగద్వేషాలకు అతీతమని గుంటూరుకు చెందిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో ఆదివారం ఆనంరోటరీహాల్లో ప్రముఖ విమర్శకుడు, కథారచయిత కోడూరి శ్రీరామమూర్తి రచించిన ‘సాహిత్యానుభూతి’,‘మహాత్ముడు–పర్యావరణము’గ్రంథాలను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాషలో మనోవైజ్ఞానిక అంశాలకు సంబంధించిన రచనలు తక్కువేనన్నారు. తెలుగుకథకు కొత్త అందాలను పొదిగిన ఉత్తమ కథకుడు, విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి, ఆయన రచనలన్నింటిలో సామాజిక విలువలు పుష్కలంగా కనిపిస్తాయన్నారు. కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ పనసపండు పక్వానికి వచ్చిన సంగతి దాని సువాసనలే చెబుతాయని, మంచి రచనకు కొలమానం ప్రముఖుల అభిప్రాయాలేనని అన్నారు. జ్ఞానపీఠఅవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి మండలిబుద్ధప్రసాద్‌లు కోడూరి రచనలపై వెలువరించిన అభిప్రాయాలను ఎర్రాప్రగడ చదివి వినిపించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎండ్లూరి సుధాకర్, రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, పర్యావరణవేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, కథారచయిత వల్లూరి శివప్రసాద్, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.