రాగద్వేషాలకు అతీతం ఆయన విమర్శ
-
ఘనంగా కోడూరి శ్రీరామమూర్తి పుస్తకద్వయ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం కల్చరల్ :
సంయమనంతో కూడిన విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి అని, ఆయన విమర్శ రాగద్వేషాలకు అతీతమని గుంటూరుకు చెందిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో ఆదివారం ఆనంరోటరీహాల్లో ప్రముఖ విమర్శకుడు, కథారచయిత కోడూరి శ్రీరామమూర్తి రచించిన ‘సాహిత్యానుభూతి’,‘మహాత్ముడు–పర్యావరణము’గ్రంథాలను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాషలో మనోవైజ్ఞానిక అంశాలకు సంబంధించిన రచనలు తక్కువేనన్నారు. తెలుగుకథకు కొత్త అందాలను పొదిగిన ఉత్తమ కథకుడు, విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి, ఆయన రచనలన్నింటిలో సామాజిక విలువలు పుష్కలంగా కనిపిస్తాయన్నారు. కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ పనసపండు పక్వానికి వచ్చిన సంగతి దాని సువాసనలే చెబుతాయని, మంచి రచనకు కొలమానం ప్రముఖుల అభిప్రాయాలేనని అన్నారు. జ్ఞానపీఠఅవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి మండలిబుద్ధప్రసాద్‌లు కోడూరి రచనలపై వెలువరించిన అభిప్రాయాలను ఎర్రాప్రగడ చదివి వినిపించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎండ్లూరి సుధాకర్, రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్‌పీ గంగిరెడ్డి, కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, పర్యావరణవేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, కథారచయిత వల్లూరి శివప్రసాద్, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు
తదితరులు పాల్గొన్నారు.