srirammurthy
-
కులం మీద బతికేవాడు అయ్యన్నపాత్రుడు
సాక్షి,అనకాపల్లి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వెలమ కుల ద్రోహి అని టీడీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ రెబల్ అభ్యర్థి ఈర్లె శ్రీరామ్మూర్తి విమర్శించారు. కులం కోసం కాదు.. కులం మీద బతికేవాడే అయ్యన్నపాత్రుడు అని, తాను తప్ప ఎవరూ ఎదగకూడదని అనుకునే వాడని మండిపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2018లో రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీకి సేవలు చేస్తున్నానని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన తనకు గతంలో చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ మాట తప్పారని ధ్వజమెత్తారు. బీసీ కులాలంటే టీడీపీ అధిష్టానానికి గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తనకు ఉపాధ్యాయ సంఘాలు, పట్టభద్రులతో మంచి సన్నిహితం ఉందని, టీడీపీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గానైనా నామినేషన్ వేసి గెలుస్తానని శ్రీరామ్మూర్తి ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉంటాననే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు అడుగడుగునా తనపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి అయ్యన్నపాత్రుడి స్వగ్రామమని, ఆయనది ఉత్తరాంధ్ర కాదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వలస నేతలు పాలిస్తున్నారనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అయ్యన్నకు ఆ అర్హత లేదన్నారు. -
రాగద్వేషాలకు అతీతం ఆయన విమర్శ
ఘనంగా కోడూరి శ్రీరామమూర్తి పుస్తకద్వయ ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : సంయమనంతో కూడిన విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి అని, ఆయన విమర్శ రాగద్వేషాలకు అతీతమని గుంటూరుకు చెందిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో ఆదివారం ఆనంరోటరీహాల్లో ప్రముఖ విమర్శకుడు, కథారచయిత కోడూరి శ్రీరామమూర్తి రచించిన ‘సాహిత్యానుభూతి’,‘మహాత్ముడు–పర్యావరణము’గ్రంథాలను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాషలో మనోవైజ్ఞానిక అంశాలకు సంబంధించిన రచనలు తక్కువేనన్నారు. తెలుగుకథకు కొత్త అందాలను పొదిగిన ఉత్తమ కథకుడు, విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి, ఆయన రచనలన్నింటిలో సామాజిక విలువలు పుష్కలంగా కనిపిస్తాయన్నారు. కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ పనసపండు పక్వానికి వచ్చిన సంగతి దాని సువాసనలే చెబుతాయని, మంచి రచనకు కొలమానం ప్రముఖుల అభిప్రాయాలేనని అన్నారు. జ్ఞానపీఠఅవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి మండలిబుద్ధప్రసాద్‌లు కోడూరి రచనలపై వెలువరించిన అభిప్రాయాలను ఎర్రాప్రగడ చదివి వినిపించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎండ్లూరి సుధాకర్, రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి, పర్యావరణవేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, కథారచయిత వల్లూరి శివప్రసాద్, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.